అకాల వర్షం.. అరటి రైతులకు అపార నష్టం ...

Update: 2019-06-23 09:19 GMT

అరటి రైతాంగానికి అచ్చిరాలేదు..అకాల వర్షం రూపంలో వచ్చిన అపార నష్టం అరటి రైతును కోలుకోలేని దెబ్బతీసింది. ఈ ఏడాది అరటి ధర బాగున్నా.. పంట లేకపోవడంతో నిరాశ తప్పలేదు. ధర పెరిగినా చేతిలో పంట లేకపోవడంతో అన్నదాతలకు ఆవేదనే మిగిలింది. కడప జిల్లాలో అరటి ఎక్కువగా సాగవుతోంది. పులివెందుల అరటికి జాతీయ స్థాయిలో పేరుంది. రాజంపేట ప్రాంతాల్లో పండే అరటి పలు రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. పులివెందుల నుంచి అరటి కలకత్తా, ఢిల్లీ ప్రాంతాలకు ఎగుమతి జరుగుతుంది. అయినా అరటి పండించే రైతులకు చేదు అనుభవమే ఎదురవుతోంది. వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటాయి. అప్పులు చేసి పంటను సాగు చేశారు.

అహర్నిషలు కష్టపడి సాగుచేసిన గత నెలలో కురిసిన అకాల వర్ష ప్రభావంతో అరటి పంట నేలకూలింది. గాలి వాన బీభత్సంతో పులివెందుల, రైల్వేకోడూరు, కమలాపురం, రాజంపేట నియోజకవర్గంలో సాగు చేసిన అరటి పంట పెద్దమొత్తంలో దెబ్బతింది. గాలివాన దెబ్బకే సుమారు 20కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్లు అంచనా. అరటి పంట తుడిచిపెట్టుకుపోవడంతో జిల్లాలో అరటి దిగుబడి చాలా తక్కువగా ఉంది. ఫలితంగా డిమాండ్ బాగా పెరిగింది. గాలులకు ఒరిగిపోయిన గెలలు, ఎదుగు బొదుగు లేని అరటిని కూడా టన్ను ఐదారు వేలకు వ్యాపారులు కొంటున్నారు. నాణ్యమైన అరటిని మాత్రం టన్నుకు 14వేలకు కొంటున్నారు. ఇక గెలలతో సహా టన్నుల ప్రకారం అరటికి 9,500 నుంచి 12వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులు అప్పుల పాలయ్యారు. అకాల వర్షంలతో అరటి పంట నష్టపోయిన తమకు పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.  

Tags:    

Similar News