చిన్న నిర్లక్ష్యం. చిన్నారుల పాలిట మృత్యుపాశంగా మారుతోంది. అంతవరకు కళ్లముందే ఆడుకుంటున్న చిన్నారులు అంతలోనే విగతజీవులుగా మారుతున్నారు. అప్పుడు గుండెలు బాదుకుని కన్నీరు పెట్టడం తప్ప చేసేదేమీ మిగలడం లేదు. కార్లలో ఇరుక్కున్న చిన్నారులు నరకం అనుభవించి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా విశాఖలో జరిగిన ఘోరం మరోసారి అందరినీ కలచివేసింది. అసలు కారులో పిల్లలు మరణించడానికి కారణాలేంటి? నిర్లక్ష్యానికి మరో బాలుడు బలైపోయాడు. కారు డోర్ లాకై ఏడేళ్ల పిల్లాడు మృత్యువాత పడ్డాడు. ఊపిరాడక కారులోనే తనువుచాలించాడు. విశాఖ మల్కాపురంలో జరిగిన ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
నావల్ ఎంజీఆర్ పార్క్ క్వార్టర్స్ లో కారును కడిగిన యజమాని అది ఆరేందుకు డోర్ తెరిచి ఉంచాడు. అదే సమయంలో కారులోకి ప్రవేశించిన ఏడేళ్ల బాలుడు ప్రేమ్ కుమార్ అందులో ఉన్న బొమ్మలను తీసుకుంటుండగా డోర్ లాక్ అయ్యింది. దాంతో మూడు గంటలపాటు ఆ బాలుడు నరకం అనుభవించాడు. ఎంతగా అరుపులు పెట్టాడో ఎంతలా ఏడ్చాడో తెలియదు కానీ ఊపిరాడక కారులో ప్రాణాలు విడిచాడు. కొనఊపిరితో అల్లాడిన ఆ బాలుడి చివరి క్షణాలను తలుచుకుని తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. మరోవైపు తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. అయితే ఇలాంటి ఘటనలు గతంలో ఎన్నో జరిగినా, వాటి నుంచి తల్లిదండ్రులు పాఠాలు నేర్చుకోవడం లేదు. పిల్లల విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాలు తీసేస్తున్నారు.
కారు డోర్స్ లాకై పిల్లలు మృత్యువాత పడటానికి అనేక కారణాలున్నా ముఖ్యంగా హీట్ స్ట్రోకే కారణమంటున్నారు నిపుణులు. చిన్న పిల్లల శరీరాలు అధిక వేడిని తట్టుకోలేవు, పెద్దలతో పోల్చితే, చిన్నారులు నాలుగైదు రెట్లు వేగంగా హీట్ అవుతారు, ఇదే వారి పాలిట శాపంగా మారి, మరణానికి కారణమవుతోందని చెబుతున్నారు. పదిహేనేళ్లలోపు పిల్లలందరికీ ఇలాంటి ప్రమాదం పొంచి ఉందంటున్నారు. అంతేకాదు కారు డోర్స్ లాకైన 10 నిమిషాల్లోనే లోపలి టెంపరేచర్ 20 డిగ్రీలు పెరుగుతుందని, దాంతో చిన్నారుల అవయవాలు ఒక్కొక్కటిగా షట్‌డౌన్ అవుతూ పనిచేయడం మానేస్తాయని, చివరికి మృత్యువాత పడతారని చెబుతున్నారు. ఒకవేళ అద్దాలు తెరిచి ఉన్నా కారు వేడికి, కార్బన్ మోనాక్సైడ్ కారణంగా చిన్నారులు మృత్యువాత పడే అవకాశాలే ఎక్కువగా ఉంటాయంటున్నారు. వేసవిలో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని, అందుకే పిల్లల విషయంలో అత్యంత జాగ్రత్త ఉండాలని సూచిస్తున్నారు.