నకిలీ అడ్రస్‌లతో భారతీయ పౌరులుగా చెలామణి..ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్
బంగ్లాదేశీయులు దేశంలోకి అక్రమంగా చొరబడుతున్నారు. కొద్ది రోజుల ఇక్కడ నివాసం ఉండి ఇక్కడి అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్నారు. ఆధార్ కార్డు, ఓటర్ కార్డ్, పాన్ కార్డులు సంపాదిస్తున్నారు. మన దేశ పౌరులుగా చెలామణి అవుతున్నారు. ఈ నకిలీ దేశీయుల గుట్టును సంగారెడ్డి జిల్లా పోలీసులు రట్టు చేశారు.
2012లో బంగ్లాదేశ్ కు చెందిన ఎం.డి.బాబు, రిపోన్, గులాం హుస్సేన్, సైపుల్ , ఖురేషి అనే యువకులు భారతదేశంలోకి అక్రమంగా వచ్చారు. కొల్ కతా మీదుగా వీరు హైదరాబాద్ చేరుకున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం రుద్రారంలోని అల్ కబీర్ పశువధ శాలలో ఐదుగురు బంగ్లాదేశీయులు కాంట్రాక్ట్ కార్మికులుగా చేరారు. వీరు స్థానిక అంబేద్కర్ కాలనీలో నివాసం ఉంటూ ఓ ఇంటికి సంబంధించిన నకిలీ అడ్రస్ సృష్టించారు. ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, పాన్ కార్డు సంపాదించారు.
ఐదుగురు బంగ్లాదేశీయుల్లో బాబు, రిపోన్ అస్సాంకు చెందిన మహిళలను నిఖా చేసుకోగా, ఖురేషి సోలాపూర్ కు చెందిన తులసిని పెళ్లి చేసుకున్నాడు. తప్పుడు ధృవపత్రాలతో బంగ్లాదేశ్ కు చెందినవారు అక్రమంగా నివసిస్తున్నారని పటాన్ చెరు పోలీసులకు సమాచారం అందింది. ఆ ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు గుట్టు బయటపడింది. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. అక్రమ విదేశీయుల జాడ చెబితే తగిన పారితోషికం ఇస్తామంటున్నారు పోలీసులు. పోలీసులకు పట్టుబడ్డ ఈ ఐదుగురు బంగ్లాదేశీయులు తమ దేశం నుంచి మరికొంత మందిని రప్పించినట్లు తెలుస్తోంది. వీరి అరెస్ట్ తో ఇరుగుపొరుగువారు ఉలిక్కి పడుతున్నారు. బంగ్లాదేశీయులకు ఉపాధి కల్పించిన అల్ కబీర్ పరిశ్రమ యాజమాన్యానికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.