Nikki Haley: అమెరికా అధ్యక్ష బరిలో భారత సంతతికి చెందిన నిక్కీ హెలీ
Nikki Haley: రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ప్రచారం ప్రారంభించిన నిక్కీ
Nikki Haley: భారతీయ అమెరికన్ నిక్కీ హేలి అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. తన అభ్యర్థిత్వ ప్రచారాన్ని ప్రారంభించారు. అందుకు సంబంధించి ఓ వీడియోను విడుదల చేశారు. ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఆమె అభ్యర్థిత్వం కోసం పోటీపడనున్నారు. 2024లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయడం కోసం ఇండో అమెరికన్ దక్షిణ కరోలినా గవర్నర్ నిక్కీ హెలీ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వ బరిలోకి దిగుతున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో అభ్యర్థిత్వం కోసం నిక్కీ పోటీపడుతున్నారు.
అమెరికా అధ్యక్ష బరిలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ పడుతున్న నిక్కీ హెలీ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. భారత సంతతికి చెందిన కుమార్తెగా గర్వపడుతున్నానని ఆమె సందేశాన్నిచ్చారు. బ్లాక్స్, వైట్స్ అనే తేడా లేకుండా పనిపై ఫోకస్ పెట్టాలని మా అమ్మ ఎప్పుడూ చెబుతుండేవారని నిక్కీ గుర్తుచేశారు. మన ఆలోచనలను కొందరు జాత్యాహంకారంగా భావిస్తారని, కానీ సత్యానికి మించినది ఏదీ లేదని ఆమె చెప్పుకొచ్చారు. చైనా, రష్యాలు యుద్ధానికి కాలు దువ్వుతున్నాయి మనల్ని వేధించవచ్చని అనుకుంటున్నారని, వారి బెదిరింపులకు భయపడేదిలేదని తేల్చిచెప్పారు. ఆర్థిక బాధ్యత, సరిహద్దు భద్రత, దేశ పటిష్ఠత కోసం కొత్త తరం నాయకత్వానికి సమయం ఆసన్నమైందన్నారు. మరో జోబైడెన్ మనకు వద్దని, దేశాన్ని మరింత గొప్పగా, స్వేచ్ఛగా మార్చే అవకాశాలు ఇంకా ఉన్నాయనీ ఆమె తెలిపారు. క్లిష్ట పరిస్థితిల్లో కూడా అమెరికా తమను చేరదీసిందన్నారు. దక్షిణ కరోలినాలో పుట్టి, పెరగడం ద్వారా దేశ గొప్పతనం తెలిసిందని నిక్కీ చెప్పుకొచ్చారు.
అజిత్ సింగ్ రణ్‌ధావా, రాజ్‌కౌర్ రణ్‌ధావా అనే సిక్కు దంపతులకు నిక్కీహెలీ జన్మించారు. తండ్రి పంజాబ్ వ్యవసాయ వర్సిటీ ప్రొఫెసర్‌గా సేవలు అందించారు. తల్లి ఢిల్లీ వర్సిటీ నుంచి లా పూర్తి చేశారు. పంజాబ్ నుంచి కెనడాకు వలస వెళ్లి 1960లో అమెరికాలో స్థిరపడ్డారు. నిక్కీ క్లెమ్‌సన్ వర్సిటీ నుంచి అకౌంటింగ్ డిగ్రీ పట్టా పొందారు. గార్మెంట్స్ వ్యాపారం చేశారు. రాజకీయాల్లోకి రాకముందు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ వుమెన్ బిజినెస్ ఓనర్స్ అధ్యక్షురాలిగా పని చేశారు. 39 ఏళ్ల అతిచిన్న వయసులోనే అమెరికాలో గవర్నర్‌గా నిక్కీ బాధ్యతలు చేపట్టారు. దక్షిణ కరోలినా తొలి మహిళా గవర్నర్‌గా సేవలందించారు.