Indian Americans in Donald Trump new government: డోనల్డ్ ట్రంప్ మొత్తానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టేందుకు రెడీ అవుతున్నారు. వచ్చే జనవరిలో డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం ఉంటుంది. ట్రంప్ రెండోసారి విజయం సాధించడంలో పలువురు ఇండియన్ అమెరికన్స్ కీలక పాత్ర పోషించారు. ట్రంప్ కోసం వారు చాలా చురుగ్గా ప్రచారంలో పాల్గొన్నారు. ట్రంప్ తరపున వారు ప్రత్యర్థి కమలా హారీస్‌తో జరిగిన డిబేట్స్‌లో కూడా పాల్గొన్నారు. తన గెలుపు కోసం పని చేస్తున్న ఇండియన్ అమెరికన్స్ పేర్లను ట్రంప్ ఎన్నికల ప్రచార సభల్లోనే అనౌన్స్ చేశారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే వారిని ప్రభుత్వంలోకి తీసుకుంటానని కూడా చెప్పారు.
ఇంతకీ ట్రంప్ తన కొత్త ప్రభుత్వంలో భారత సంతతి మూలాలు ఉన్న అమెరికన్స్‌లో ఎవరెవరికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది? అమెరికాలో ట్రంప్‌ను అంతగా ఇంప్రెస్ చేసిన ఇండియన్ అమెరికన్స్ ఎవరు? వారిలో ఎవరెవరికి ట్రంప్ క్యాబినెట్లో చోటు దక్కే అవకాశం ఉంది? ఈ వివరాలన్నీ తెలుసుకోవాలంటే ఈ డీటేయిల్డ్ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
ఇక డీటెయిల్స్‌లోకి వెళ్తే... 2022 నాటి లెక్కల ప్రకారం అమెరికాలో భారతీయ మూలాలు ఉన్న వారి జనాభా ఒక శాతంగా ఉంది. అయితే, ఒక్క శాతమే కదా అని లైట్ తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే కొంతమంది ఇండియన్ అమెరికన్స్ ఇప్పుడు అక్కడ పారిశ్రామికవేత్తలుగా, రాజకీయ నాయకులుగా, వివిధ రంగాల్లో ఉన్నతస్థాయిలో ఉన్నారు. అంతేకాదు, ఓటింగ్ సరళిని ప్రభావితం చేసే స్థాయిలో కొనసాగుతున్నారు. ఇండియన్ కమ్యూనిటీకి ప్రతినిధులుగా ఉంటూ అక్కడి ప్రభుత్వంలో, రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అందుకే అమెరికాలో అధ్యక్షులు కూడా వారికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా పేర్లు వినిపిస్తున్న వారిలో వివేక్ రామ స్వామి, కశ్యప్ పటేల్, బాబి జిందాల్, నిక్కీ హేలీతో పాటు ఇంకొంత మంది ఉన్నారు.
వివేక్ రామస్వామి
ముందుగా వివేక్ రామస్వామి విషయానికొస్తే... అమెరికాలో పేరున్న బిజినెస్‌మేన్లలో వివేక్ రామస్వామి ఒకరు. వయస్సు 38 సంవత్సరాలు. ఒక ఫార్మాసుటికల్ కంపెనీకి యజమానిగా వ్యాపారం చేసుకుంటూనే రాజకీయాల్లోనూ అడుగుపెట్టిన యంగ్ మ్యాన్. అమెరికాకు ఇప్పుడు ఏం కావాలో, ఏం చేస్తే అమెరికా ఇంకా ముందుకు పోతుందో చెప్పేందుకు ప్రయత్నించిన యువకుడు. ఒక దశలో రిపబ్లిక్ పార్టీ తరపున అభ్యర్థిగా నిలబడేందుకు ట్రంప్‌తోనే పోటీపడిన సాహసికుడు. గతేడాది ఫిబ్రవరి నుండి ఈ ఏడాది జనవరి వరకు రిపబ్లిక్ పార్టీ నుండి అమెరికా అధ్యక్షుడిగ పోటీ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. అమెరికాకు మళ్లీ పూర్వవైభవం తీసుకొచ్చే పాలసీలు అవసరం అని తన అభిప్రాయాన్ని బలంగా వినిపించారు. అయితే, కాకస్ దశలో రిపబ్లిక్ పార్టీ ప్రతినిధులను మెప్పించడంలో ట్రంప్ కంటే వెనుకపడ్డారు. అలా ప్రెసిడెంట్‌గా పోటీ చేసే ఛాన్స్ కోల్పోయారు.
అధ్యక్షుడిగా పోటీ చేయాలనే రేసు నుండి తప్పుకున్న తరువాత ట్రంప్ విజయం కోసం కృషి చేసే వారిలో మళ్లీ తానే ముందు నిలబడ్డారు. తన మద్దతుదారులను కూడా ట్రంప్ గెలుపు కోసం కృషి చేసేలా చేశారు. వివేక్ దూకుడు చూసి ట్రంప్ సైతం ఆయన్ని పలు వేదికలపై మెచ్చుకున్న సందర్భాలున్నాయి. పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ట్రంప్ మాట్లాడుతూ తాను అమెరికా అధ్యక్షుడినైతే వివేక్ రామస్వామికి కీలక పదవి ఉంటుందన్నారు. ఆయన కంటే ఆ పదవికి ఇంకెవ్వరూ న్యాయం చేయలేరన్నారు. అందుకే ట్రంప్ కొత్త ప్రభుత్వంలో వివేక్ రామస్వామి కోసం కీలకమైన ఇంచార్జ్ పొజిషన్ ఏదో వెయిట్ చేస్తోందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
కశ్యప్ పటేల్
ఇక ట్రంప్ కేబినెట్‌లో చోటు దక్కించుకునే ఇండియన్ అమెరికన్స్‌లో వినిపిస్తోన్న మరో పేరు కశ్యప్ పటేల్. ఆయన్నే సింపుల్‌గా కశ్ అని కూడా పిలుస్తారు. న్యూయార్క్‌లోని గార్డెన్ సిటీలో 1980లో పుట్టిన కశ్యప్ పటేల్‌కు ఆల్రెడీ ట్రంప్ ప్రభుత్వంలో పనిచేసిన అనుభవం ఉంది. రక్షణ శాఖ, ఇంటెలీజెన్స్ వ్యవరాల్లో కశ్యప్ దిట్ట. ఉక్రెయిన్ వార్ సమయంలో ట్రంప్ తీవ్ర విమర్శలు ఎదుర్కున్నారు. ఆ విమర్శల నుండి బయటపడేందుకు ట్రంప్ అప్పట్లో ఒక అడ్వైజర్స్ టీమ్ ఏర్పాటు చేశారు. ఆ సలహాదారుల బృందాన్ని ముందుండి నడిపించిన నాయకుడిగా కశ్యప్ పటేల్ పేరు చెబుతుంటారు.
అమెరికా ఇంటెలిజెన్స్, రక్షణ శాఖలో సమస్యల్ని ఛేదించిన టాలెంట్ ఆయన సొంతం. ఆయనకు ట్రంప్ ఏ పని అప్పగించినా... దాని తోలు తీసి అవతలపడేసే మోనార్క్ అనే పేరు తెచ్చుకున్నారు. కశ్యప్ పటేల్ పనితనం చూసి ఆ బృందంలోని తోటి అమెరికన్స్ కుళ్లుకుని కామెంట్స్ చేసే వాళ్లట. ట్రంప్ క్యాంపులో కశ్యప్ రేంజ్ అది. అందుకే ప్రపంచంలోనే అత్యంత పవర్‌ఫుల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీగా పేరున్న సీఐఏ లేదా నేషనల్ సెక్యురిటీ కౌన్సిల్‌లో కశ్యప్ పటేల్‌కు మరోసారి కీలక పదవి ఇచ్చే అవకాశాలున్నాయి.
బాబీ జిందాల్
ట్రంప్ కేబినెట్‌లో వినిపిస్తున్న మూడో ఇండియన్ అమెరికన్ పేరు బాబి జిందాల్. ముందుగా అమెరికా హెల్త్ కేర్ సెక్టార్ లో ఆయన సుదీర్ఘ కాలం పనిచేశారు. ఆ తరువాత 2004 లో తొలిసారిగా లూసియానా నుండి కాంగ్రెస్ కు ఎన్నికయ్యారు. అక్కడి పార్లమెంటరీ కమిటీలలో హెల్త్ కేర్, రక్షణ వంటి వివిధ శాఖల్లో పని చేశారు. 2008 లో ఒకసారి, 2011 లో మరోసారి లూసియానా గవర్నర్ అయ్యారు. ప్రస్తుతం హెల్తీ అమెరికా సెంటర్ ను ముందుండి నడిపిస్తున్నారు. ట్రంప్ మద్దతుదారుల్లో ఆయన కూడా ఒకరు. అందుకే ఆయనకు ట్రంప్ టీమ్‌లో ముఖ్యమైన హోదా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నిక్కీ హేలీ
నిక్కీ హేలీ సౌత్ కరోలినా గవర్నర్ గా పనిచేశారు. ట్రంప్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ చివరకు నేషనల్ కన్వెన్షన్స్ లో మాట్లాడారు. తన మద్దతుదారులను కూడా ఆమె ట్రంప్ వైపు పంపించారు. అలా ట్రంప్ వ్యతిరేకురాలు అనే ముద్ర నుండి ట్రంప్ లాయలిస్ట్ అనే పేరు తెచ్చుకున్నారు. గవర్నర్ గా పనిచేసిన ఆమె అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ట్రంప్ తన కొత్త ప్రభుత్వంలో కీలక బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.
డోనల్డ్ ట్రంప్ రికార్డు బద్దలు కొట్టిన జో బైడెన్
ఇక డోనల్డ్ ట్రంప్ కేబినెట్ లో చోటు దక్కించుకునే వారే కాకుండా ఆయన ప్రభుత్వంలో ఇతర కీలకమైన పదవులు దక్కించుకునే ఇండియన్ అమెరికన్స్ సంఖ్య కూడా ఈసారి మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికా ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు ఈ సంఖ్య పెరుగుతూ వస్తోందని వైట్ హౌజ్ గణాంకాలే చెబుతున్నాయి.
ఉదాహరణకు బరాక్ ఒబామా తన ప్రభుత్వ హయాంలో 60 మంది భారత సంతతి మూలాలు ఉన్న వారికి కీలక బాధ్యతలు అప్పగించారు. ఆ తరువాత 2016 లో అమెరికా ప్రెసిడెంట్ అయిన డోనల్డ్ ట్రంప్ ఆ సంఖ్యను 80 మందికి పెంచారు. ఈ అన్ని రికార్డులను బద్దలుకొడుతూ 2020 లో జో బైడెన్ ఏకంగా 130 మంది ఇండియన్ అమెరికన్స్ కు కీలక బాధ్యతలు అప్పగించారు.
ఇక డోనల్డ్ ట్రంప్ కొత్త ప్రభుత్వం విషయానికొస్తే.. ప్రస్తుతం అమెరికాలో స్టేట్ అండ్ ఫెడరల్ లెవెల్స్ ఎలక్షన్లలో 40 మందికిపైగా ఇండియన్ అమెరికన్స్ ఎన్నికయ్యారు. వారిలో 20 మందికి పైగా నేతలు అమెరికాలో టాప్ కంపెనీలను లీడ్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఈసారి ట్రంప్ ఇంకెంతమంది ఇండియన్ అమెరికన్స్ కు ఆ ఛాన్చ్ ఇచ్చే అవకాశం ఉందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.