Europe Floods: భారీ వరదలతో యూరప్ కంట్రీస్‌లో కల్లోలం
Europe Floods: ఊహకందని విపత్తు యూరప్ కంట్రీస్‌లో కల్లోలం సృష్టిస్తోంది.
Europe Floods: ఊహకందని విపత్తు యూరప్ కంట్రీస్‌లో కల్లోలం సృష్టిస్తోంది. ఒక్కసారిగా వరద ప్రవాహం ముంచెత్తడంతో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. కొన్ని ప్రాంతాల్లో వరద కల్లోలం తగ్గినా అడుగుల మేర పేరుకుపోయిన బురద స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా వెస్ట్ జర్మనీలో ఎటుచూసినా భయానక పరిస్థితులే కనిపిస్తున్నాయి.
ఒక్కసారిగా ముంచెత్తిన వరదలతో యూరప్ అతలాకుతలం అవుతోంది. భారీ వరదల కారణంగా ఇప్పటికే 155మంది మృతి చెందగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కినిపిస్తోంది. ఒక్క జర్మనీలోనే అత్యధికంగా 133మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. వెస్ట్ జర్మనీలో వరదలకు పెద్ద ఎత్తున ఇళ్లు కొట్టుకుపోయాయి. బెల్జియం, లగ్జంబర్గ్, నెదర్లాండ్స్‌లోనూ వరద భీబత్సం కొనసాగుతోంది. ఆ దేశాల్లోని ప్రధాన నగరాల వీధులు బురదలో కూరుకుపోయాయి. అయితే, జర్మనీలో మరణాల సంఖ్య అధికంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. అపార్ట్‌మెంట్ల సెల్లార్లలో మరిన్ని మృతదేహాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు సాయం అందించేందుకు మిలట్రీ రంగంలోకి దిగింది. మట్టి, బురదతో నిండిపోయిన గ్రామాలను క్లీన్ చేసేందుకు సైనిక దళాలు, ఫైర్‌ఫైటర్లు క్షేత్రస్థాయిలో సహాయకచర్యలు చేపట్టారు. నార్త్ రైన్ వెసంటంఫాలియా, రైన్ ల్యాండ్-పలాటినేట్ ప్రాంతాల్లో భారీ వర్షాలు విలయం సృష్టించాయి. ఈ ప్రాంతాల్లో హెలికాప్టర్ల సాయంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సైనిక దళాలు తీరికలేకుండా పనిచేస్తున్నాయి.