
యూఏఈలో 25 మంది భారతీయులకు మరణ శిక్ష, విదేశీ జైళ్లలో 10,000 మందికిపైగా భారతీయ ఖైదీలు
Indians executed in foreign countries: యూఏఈలో వివిధ కేసుల్లో దోషులుగా తేలిన 25 మంది భారతీయులు మరణ శిక్ష ఎదుర్కొంటున్నారని కేంద్రం పార్లమెంట్‌కు తెలిపింది. అలాగే మరో 10,152 మంది భారతీయులు వివిధ దేశాల్లో జైల్లలో ఖైదీలుగా ఉన్నారని కేంద్రం చెప్పింది. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ గురువారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు బదులుగా రాతపూర్వకంగా ఈ సమాధానం ఇచ్చారు.
విదేశాల్లో శిక్షలు పడిన ఖైదీలు, విచారణ ఎదుర్కుంటున్న ఖైదీలకు తగిన రీతిలో సహాయం అందించేందుకు భారత ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. విదేశాల్లో మరణ శిక్ష ఎదుర్కుంటున్న భారతీయులు ఎంతమంది ఉన్నారు? వారికి భారత ప్రభుత్వం ఏ విధమైన న్యాయ సహాయం అందిస్తోంది అనే ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఈ వివరణ ఇచ్చింది.
కేంద్ర సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ చెప్పిన వివరాల ప్రకారం విదేశాల్లో మరణ శిక్ష ఎదుర్కుంటున్న భారతీయుల సంఖ్య ఒక్క యూఏఈకే పరిమితం కాలేదు. సౌది అరేబియాలో 11 మంది, మలేషియాలో ఆరుగురు, కువైట్ లో ముగ్గురు, ఇండోనేషియా, కతార్, అమెరికా, యెమెన్ లో ఒక్కొక్కరు చొప్పున మరణశిక్ష ఎదుర్కుంటున్నారు.
కోర్టు కేసులు, జైలు శిక్షలు ఎదుర్కుంటున్న వారికి సహాయం అందించేందుకు ఆయా దేశాల్లోని రాయబార కార్యాలయాల సిబ్బంది పనిచేస్తున్నట్లు సింగ్ తెలిపారు. కోర్టుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, న్యాయవాదులు, పోలీసులు, జైలు సిబ్బంది, కేసులు పెట్టిన వారితో అక్కడి సిబ్బంది సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. మరణ శిక్ష కేసుల్లోనూ సాధ్యమైనంత వరకు వారి కోసం పోరాడటం జరుగుతోందన్నారు. ఆయా దేశాల్లో మరణ శిక్ష పడిన వారికి క్షమాభిక్ష పిటిషన్స్ దాఖలు చేయడంలోనూ సహాయం అందిస్తున్నట్లు సింగ్ వెల్లడించారు.
ఇటీవల కాలంలో భారతీయ ఖైదీలకు మరణ శిక్ష అమలు చేసిన దేశాలు
గత ఐదేళ్లలో ఎవరికైనా మరణశిక్ష అమలు చేయడం జరిగిందా అనే ప్రశ్నకు సింగ్ సమాధానం ఇచ్చారు. మలేషియా, కువైట్, ఖతార్, సౌది అరేబియాలో పలు కేసుల్లో భారతీయులకు మరణ శిక్ష విధించడం జరిగిందన్నారు.
2023 లో కువైట్, సౌది అరేబియా దేశాల్లో ఐదుగురు చొప్పున, మలేషియాలో మరొకరికి మరణ శిక్ష అమలు అయింది. అలాగే 2024 లో కువైట్, సౌది అరేబియా దేశాల్లో ముగ్గురు చొప్పున, జింబాబ్వేలో మరొకరికి మరణ శిక్ష అమలైందని కేంద్రం పార్లమెంట్‌కు ఇచ్చిన వివరణలో పేర్కొంది. కేంద్రం వెల్లడించిన ఈ డేటా ప్రకారం చూస్తే ఇటీవల కాలంలో కువైట్, సౌది అరేబియా దేశాల్లో మరణ శిక్ష అమలైన భారతీయ ఖైదీల సంఖ్య ఎక్కువగా ఉంది. ఆ తరువాత స్థానంలో మలేషియా కూడా ఉంది.
More Interesting stories: మరిన్ని ఆసక్తికరమైన కథనాలు
ప్రపంచంలో సంతోషంగా ఉన్న దేశాల్లో ఇండియా, అమెరికా, బ్రిటన్ ర్యాంక్స్ ఎంతో తెలుసా?
కెనడా వచ్చి తప్పు చేశాను... పెద్ద చర్చకు దారితీసిన సోషల్ మీడియా పోస్ట్
సునీత విలియమ్స్ చిన్నప్పటి లక్ష్యం వేరు... చివరకు అయ్యింది వేరు