
America Mass Shooting: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. న్యూమెక్సీకోలోని లాస్ క్రూస్ లో శుక్రవారం రాత్రి రెండు గ్రూపుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా..మరో 15 మంది గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం ఈ ఘటన రాత్రి 10గంటలకు జరిగింది. మరణించినవారిలో ఇద్దరు టీనేజర్లు ఉన్నారు. గాయపడ్డవారంతా 16 నుంచి 36ఏళ్ల వయసు ఉన్నవారేనని పోలీసులు తెలిపారు.
రెండు గ్రూపుల మధ్య ఈ కాల్పులు జరిగినట్లు లాస్ క్రూస్ పోలీస్ చీఫ్ జెరేమీ స్టోరీ తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
లాస్ క్రూసెస్ నగరం చివావా ఎడారి అంచున, రియో గ్రాండే నదికి సమీపంలో ఉంది. ఈ నగరం అమెరికా-మెక్సికో సరిహద్దుకు ఉత్తరాన 66 కిలోమీటర్ల దూరంలో ఉంది. 'న్యూయార్క్ టైమ్స్' ప్రకారం, సంఘటన జరిగిన సమయంలో, ఆ ప్రాంతంలో మోడిఫైడ్ స్పోర్ట్స్ కార్ ప్రియుల కోసం నెలవారీ సమావేశం జరిగేది. రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవ కారణంగా ఈ కాల్పులు జరిగాయని లాస్ క్రూసెస్ పోలీస్ చీఫ్ తెలిపారు. ఈ సంఘటన కార్ షోకు ముందు జరిగింది. సంఘటనా స్థలంలో దాదాపు 50-60 హ్యాండ్‌గన్ బుల్లెట్ షెల్స్ దొరికాయి. సంఘటన జరిగిన సమయంలో పార్కులో దాదాపు 200 మంది ఉన్నారు.