
Pilot forgot his passport: పాస్‌పోర్ట్ మర్చిపోయి ఫ్లైట్ ఎక్కిన పైలట్... తరువాత ఏం జరిగిందంటే!!
What happens if a pilot forgot to carry their passport: అమెరికా నుండి చైనాకు వెళ్లే విమానంలోని ప్రయాణికులకు ఒక వింత అనుభవం ఎదురైంది. విమానం టేకాఫ్ అయిన తరువాత కొద్దిసేపటికి పైలట్ తన పాస్‌పోర్ట్ వెంట తెచ్చుకోవడం మర్చిపోయినట్లు గుర్తించారు. విమానయానంలో పని చేసే వారు చేయకూడని పెద్ద తప్పు ఇది. శనివారం క్యాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ నుండి షాంఘాయ్‌కు బయల్దేరిన విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ తరువాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
శనివారం మధ్యాహ్నం 2 గంటలకు యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన UA 198 విమానం లాస్ ఏంజెల్స్ ఎయిర్ పోర్ట్ నుండి టేకాఫ్ అయింది. విమానంలో 257 మంది ప్రయాణికులు, 13 మంది సిబ్బంది ఉన్నారు. విమానం పసిఫిక్ మహా సముద్రంపై ప్రయాణిస్తుండగా పైలట్‌కు తను పాస్‌పోర్ట్ మర్చిపోయిన విషయం గుర్తుకొచ్చింది. వెంటనే యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థకు, లాస్ ఏంజెల్స్‌లోని ఇమ్మిగ్రేషన్ అధికారులకు సమాచారం అందించారు.
ఇమ్మిగ్రేషన్ రూల్స్ ప్రకారం పైలట్స్ కూడా అందరి తరహాలోనే పాస్‌పోర్ట్ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. అందుకే పైలట్ విమానాన్ని మళ్లీ వెనక్కు తిప్పకతప్పలేదు. సాయంత్రం 5 గంటలకు క్యాలిఫోర్నియా రాష్ట్రంలోని మరో పెద్ద నగరమైన శాన్ ఫ్రాన్సిస్కోలో విమానం ల్యాండ్ అయింది. అక్కడ ప్రయాణికులకు భోజనం కోసం 30 డాలర్లవి 2 టోకెన్స్ ఇచ్చారు. అక్కడ విమానంలో పైలట్ సహా సిబ్బంది మొత్తం మారిపోయారు. పైలట్ చేసిన తప్పిదం వల్ల ఈ పొరపాటు జరిగిందని యునైటెడ్ ఎయిర్ లైన్స్ ప్రకటించింది.
విమానం ఆలస్యంగా చేరడం వల్ల తనకు నష్టం జరిగిందని యాంగ్ షువన్ అనే ప్రయాణికురాలు ఆందోళన వ్యక్తంచేశారు. అందుకు ఎయిర్‌లైన్స్ సంస్థ తనకు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా యునైటెడ్ ఎయిర్ లైన్స్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసినట్లు ఆమె తెలిపారు. 14 పనిదినాల్లో తనకు రిప్లై వస్తుందని ఎయిర్‌లైన్స్ చెప్పినట్లుగా సీఎన్ఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంగ్ చెప్పారు.
కొత్త సిబ్బందితో శాన్ ఫ్రాన్సిస్కో నుండి బయల్దేరిన విమానం 6 గంటలు ఆలస్యంగా షాంఘాయ్‌లో ల్యాండ్ అయింది. అదే విమానం తిరుగు ప్రయాణంలో షాంఘాయ్ నుండి లాస్ ఏంజెల్స్‌కు వెళ్లాల్సిన ప్రయాణికులపై కూడా ఈ ఆలస్యం ప్రభావం పడింది.
గతంలో ఇలా ఎప్పుడైనా జరిగిందా?
గతేడాది మార్చి నెలలో పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ సంస్థకు చెందిన విమానం సిబ్బందిలో ఒకరికి ఇలాంటి సమస్య ఎదురైంది. పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ నుండి కెనడాలోని టొరొంటోకు వెళ్లిన PK-781 విమానంలో సిబ్బంది ఒకరు పాస్‌పోర్ట్ తీసుకెళ్లడం మర్చిపోయారు. టొరొంటోలోని కెనడా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమె వైఖరిని తప్పుపట్టారు. పాస్‌పోర్ట్ మర్చిపోవడం నిర్లక్ష్యం కిందకే వస్తుందని చెబుతూ ఆమె నుండి జనరల్ డిక్లరేషన్ పేపర్స్‌పై సంతకం చేయించుకున్నారు. అంతేకాకుండా 200 డాలర్లు జరిమానా కూడా విధించారు.