
Earthquake: మయన్మార్, థాయ్ లాండ్ లో శుక్రవారం రెండు భారీ భూకంపాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పెను విపత్తులో మరణించినవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ ప్రకంపనల విధ్వంసానికి రెండు దేశాల్లో కలిపి మరణించిన వారి సంఖ్య 1000 దాటేసింది. ఒక్క మయన్మార్ లోనే 1002 మంది మరణించినట్లు మయన్మార్ మిలిటరీ అధికారులు తెలిపారు. మరో 2370 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. అటు బ్యాంకాక్ లో 10 మంది మరణించారు. ఓ భారీ భవంతి కూలిన ఘటనలో దాదాపు 100 మంది నిర్మాణ కార్మికులు గల్లంతు అయ్యారు. ఈ విపత్తు కారణంగా మరణించిన వారి సంఖ్య 10వేలు దాటే అవకాశం ఉందని అమెరికా ఏజెన్సీ హెచ్చరించడం గమనార్హం.
ఇక భూకంపం కారణంగా ఇప్పటికే అతాలకుతలమైన మయన్మార్ లో మరోసారి ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. శుక్రవారి అర్థరాత్రి దాటిన తర్వాత 4.2 తీవ్రతతో భూమి కపించినట్లు అధికారులు తెలిపారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విపత్తుతో కుందేలైన మయన్మార్, థాయ్ లాండ్ ను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ముందుకు వచ్చాయి. ఇప్పటికే భారత్ ఆపరేషన్ బ్రహ్మ కింద మయన్మార్ కు 15టన్నుల సహాయక సామాగ్రిని పంపించింది. టెంట్లు, దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగులు, జనరేటర్లు ఆహార ప్యాకెట్లను అందించింది. అమెరికా, ఇండోనేషియా, చైనా కూడా అవసరమైన సాయం అందిస్తామని తెలిపింది. ప్రభావిత దేశాలకు సహాయక సామాగ్రిని పంపుతున్నామని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ తెలిపారు.
మయన్మార్ లో శుక్రవారం మధ్యాహ్నం నిమిషాల వ్యవధిలో రెండు భారీ భూకంపాలు సంభవించాయి. ఈ ప్రభావంతో పొరుగున ఉన్న థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లోనూ తీవ్ర ప్రకంపనలు వచ్చాయి. దీంతో తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. వందల సంఖ్యలో భారీ భవనాలు పేకమేడల్లా నేలమట్టమయ్యాయి. ప్రార్థనాలయాలు, సాధువుల మఠాలు కుప్పకూలాయి. శిథిలాల కింద చిక్కుకున్న అనేక మంది విలవిల్లాడుతున్నారు. రెండు దేశాల్లోనూ అక్కడి ప్రభుత్వాలు పలు ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి.