China on Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించిన చైనా.. ఇక పాకిస్తాన్ కు ముచ్చెమటలే

China condemns Jammu and Kashmir terror attack expresses strong anti terrorism stance
Jammu and Kashmir terror attack
China: జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ముక్తకంఠంతో ఖండించింది. ఈ దాడిని మాత్రమే కాదు అన్ని రకాల ఉగ్రవాదాన్ని గట్టిగా వ్యతిరేకిస్తామంటూ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గువో జియాకున్ తెలిపారు. బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో గువో..ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. జమ్ముకశ్మీర్ లో జరిగి దాడి గురించి చైనా నిశితంగా పరిశీలించింది. మేము ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. అన్ని రకాల ఉగ్రవాదాన్ని గట్టిగా వ్యతిరేకిస్తాము. ప్రాణాలు కోల్పోయినవారి కోసం విచారిస్తున్నా..గాయపడిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియచేస్తున్నాము అని అన్నారు.
మంగళవారం అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గామ్ లో ఉగ్రవాదులు జరిగిన దాడిలో కనీసం 26 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడి శాంతియుతంగా ఉండే పహల్గామ్ ను శోకసంద్రంలో ముంచింది. ఈ దాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ పౌరుడు మరణించారు. అలాగే అనేక మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటనను దేశమంతా ఖండించింది. అనేక దేశాలు భారతదేశానికి సంఘీభావం ప్రకటించాయి.
ఈ దాడి కారణంగా భారత కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ బుధవారం సాయంత్రం ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో దేశంలోని మొత్తం భద్రతా పరిస్ధితిని సమీక్షించారు. ప్రత్యేకంగా పహల్గామ్ ఉగ్రదాడిపై ఫోకస్ పెంచారు. సీసీఎస్ ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. బాధిత కుటుంబాలకు సానుభూతిని తెలియజేసింది. గాయపడినవారిని త్వరిత కోలుకోవాలని ఆకాంక్షించింది.