Intel Layoffs: 20 శాతం ఉద్యోగులను తొలగించనున్న ఇంటెల్... సిబ్బందికి టెన్షన్ టెన్షన్

Intel to layoff 20% employees: ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం ఇంటెల్ కార్పొరేషన్ కంపెనీ తమ ఉద్యోగులక్ షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం ఉన్న సిబ్బందిలో 20 శాతం సిబ్బందిని తొలగించాలని ఇంటెల్ కొత్త సీఈఓ లిప్-బూ టాన్ నిర్ణయించుకున్నట్లు బ్లూమ్‌బర్గ్ న్యూస్ రిపోర్ట్ చెబుతోంది. సంస్థలోని బ్యూరోక్రసీని తొలగించి, మేనేజ్మెంట్ ను గాడిలో పెట్టడం, ఆర్థిక ఒత్తిళ్లను తట్టుకోవడంతో పాటు సంస్థ పునర్‌వ్యవస్థీకరణే లక్ష్యంగా ఇంటెల్ లేఆఫ్స్‌కు సిద్ధం అవుతున్నట్లు ఆ వార్తా కథనం పేర్కొంది. ఇంటెల్ కార్పోరేషన్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆ కంపెనీలో పనిచేస్తోన్న వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది.
అనవసర వ్యయాలను తగ్గించుకోవడం వల్ల కంపెనీపై చాలా ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చు అని ఇంటెల్ భావిస్తోంది. చిప్ తయారీ రంగంలో ఇంటెల్ ప్రస్తుతం ఏఎండీ, ఎన్వీడియా కంపెనీల నుండి భారీ పోటీ ఎదుర్కుంటోంది. దీంతో ఇంటెల్ ఆదాయం కూడా తగ్గింది. దానికితోడు నాయకత్వ సమస్యలు కూడా తలెత్తాయి. ఈ క్రమంలోనే కంపెనీకి కొత్తగా వచ్చిన సీఈఓ లిప్-బూ టాన్ ఆయా సమస్యల పరిష్కారం కోసం కొంతమంది సిబ్బందిని లే ఆఫ్ చేయడమే మార్గంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
ఇంటెల్ సంస్థలో గతేడాది మొత్తం 124,800 మంది సిబ్బంది ఉండే వారు. కానీ గతేడాది చివరినాటికి కంపెనీ 15,000 మంది సిబ్బందిని తొలగించి హెడ్ కౌంట్‌ను 1,08,900 కు తీసుకొచ్చింది. ఈ నెల చివర్లో కంపెనీ లేఆఫ్స్ గురించి ప్రకటించే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. అదే నిజమైతే ఈసారి కూడా మరో 20 వేల మందికిపైగా సిబ్బంది మెడపై లేఆఫ్స్ కత్తి వేళ్లాడుతున్నట్లేనని భావించాల్సి ఉంటుంది.
ఇప్పటికే అమెరికాలో అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా రిసెషన్ రానుందా అనే భయాంగదోళన స్పష్టంగా కనిపిస్తోంది. దానికితోడు ఐటి కంపెనీలు ఇలా వరుసగా ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయాలు తీసుకోవడం ఐటి ఉద్యోగులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.