Viral Video: ప్రధాని మోదీకి అరుదైన గౌరవం... మోదీ విమానానికి సౌది ఫైటర్ జెట్స్ ఎస్‌కార్ట్

Update: 2025-04-22 13:43 GMT
Viral Video: ప్రధాని మోదీకి అరుదైన గౌరవం... మోదీ విమానానికి సౌది ఫైటర్ జెట్స్ ఎస్‌కార్ట్
  • whatsapp icon

Saudi Arabia fighter jets escort PM Modi's flight: ప్రధాని నరేంద్ర మోదీ సౌది అరేబియా పర్యటనలో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికేందుకు సౌది అరేబియా ప్రభుత్వం కొత్తగా ఆలోచించింది. ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం గల్ఫ్ దేశాల గగనతలంలోకి ప్రవేశించడంతోనే సౌది ఫైటర్ జెట్స్ ఆయన విమానాన్ని ఎస్‌కార్ట్ చేస్తూ ఘన స్వాగతం పలికాయి.

సౌది అరేబియా సర్కారు పంపించిన F-15 ఫైటర్ జెట్స్ ప్రధాని మోదీ విమానాన్ని ఎస్‌కార్ట్ చేస్తున్న దృశ్యాలను భారత విదేశాంగ శాఖ విడుదల చేసింది. భారత ప్రధాని మోదీకే కాదు... ఒక దేశాధినేతకు దక్కిన అరుదైన గౌరవం ఇది. భారత ప్రధాని మోదీ పట్ల తమ గౌరవాన్ని, అభిమానాన్ని సౌది అరేబియా ఈ విధంగా చాటుకుంది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

అందరికీ దక్కని అరుదైన స్వాగతం

సాధారణంగా రోడ్డు మార్గంలో వచ్చే ప్రముఖులకు భద్రత కల్పిండం కోసం పోలీసు ఎస్‌కార్ట్ వాహనాలు ముందు వెళ్తుంటాయి. సముద్రంలోనూ అతి సున్నితమైన ప్రాంతాల్లో ఖరీదైన సరుకులు లేదా ప్రముఖులతో షిప్స్ వెళ్లే సమయంలోనూ యుద్ధ నౌకలు పెద్ద పెద్ద షిప్స్‌ను ఎస్‌కార్ట్ చేస్తుంటాయి. అలా మర్చంట్ షిప్స్‌కు భద్రత కల్పించే యుద్ధ నౌకలనే ఫ్రిగేట్స్ అని అంటుంటారు. కానీ ఇలా గగనతలంలో విమానాలను ఎస్ కార్ట్ చేయడం అనేది అత్యంత అరుదుగా జరుగుతుంటుంది. అన్నింటికిమించి ఒక దేశాధినేత కోసం మరో దేశం ఇలా స్వాగతం పలకడం అనేది ఇంకా అరుదుగా చెప్పుకోవచ్చు. 

సౌదిలో మోదీ రెండు రోజుల పర్యటన

ప్రధాని మోదీ సౌది అరేబియా పర్యటన విషయానికొస్తే, ఆయన రెండు రోజుల పర్యటన నిమిత్తం జెడ్డా చేరుకున్నారు. జెడ్డా విమానాశ్రయంలో సౌది సర్కారు నుండి మోదీకి ఘన స్వాగతం లభించింది. సౌది అరేబియా, భారత్ మధ్య ఇప్పటికే మంచి సంబంధాలున్నాయి. వాణిజ్యం విషయంలోనూ అనేక పరస్పర ఒప్పందాలున్నాయి. తాజా పర్యటనతో భవిష్యత్‌లో వాణిజ్యం అభివృద్ధి దిశగా మరిన్ని కీలకమైన ఒప్పందాలు జరగనున్నాయి.

ఇదిలావుంటే, మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ (JD Vance's India visit updates) 4 రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. రెండో రోజు అయిన మంగళవారం ఆయన రాజస్థాన్ లో పర్యటిస్తున్నారు. 


Tags:    

Similar News