Bangladesh-China: ఇండియాకు దూరం అవుతున్న బంగ్లాదేశ్‌.. చైనాతో చట్టాపట్టాల్‌.. కారణాలు ఇవే!

Bangladesh-China: యూనస్ పాలనలో బంగ్లాదేశ్‌ భారత్‌కు దూరమవుతూ, చైనా–పాకిస్థాన్‌లకు మరింత దగ్గరగా మారుతోంది. ఈ మార్పులు ఆ దేశ భవిష్యత్తుపై గాఢమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. మైనారిటీలపై ముప్పు పెరుగుతోందన్న వాస్తవం మరింత ఆందోళన కలిగిస్తోంది.

Update: 2025-03-29 14:45 GMT
Bangladesh-China

Bangladesh-China: ఇండియాకు దూరం అవుతున్న బంగ్లాదేశ్‌.. చైనాతో చట్టాపట్టాల్‌.. కారణాలు ఇవే!

  • whatsapp icon

Bangladesh-China: యూనస్ బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన దృష్టి పూర్తిగా భారత్‌ వైపుకు తిరగలేదు. మొదటి నుంచీ చైనా, పాకిస్థాన్‌ల వైపే ఆయన మొగ్గుచూపుతున్నారు. ఇటివల చైనా అధ్యక్షుడిని కలిసి పలు కీలక ఒప్పందాలు కూడా చేశారు. మోదీ సర్కార్‌తో సంబంధాలు మెరుగుపరచేందుకు ఎలాంటి ప్రయత్నం చేయకపోవడం, ఢిల్లీ పర్యటనకు ఆయన చేసిన అభ్యర్థనను భారత్ ప్రత్యక్షంగా తిరస్కరించడం వంటివి, యూనస్‌పై భారత ప్రభుత్వ అభిప్రాయం ఎలా ఉందో సూచిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, యూనస్ పాలనలో చైనాతో సంబంధాలు మరింత బలపడుతున్నాయి. ఇటీవల చైనా అధ్యక్షుడితో జరిగిన భేటీలో రెండు దేశాల మధ్య భారీ స్థాయి ఒప్పందాలు కుదిరాయి. దాదాపు 138 మిలియన్ డాలర్ల గ్రాంట్‌తో పాటు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, పెట్టుబడుల సహకారాలు ప్రారంభమయ్యాయి. చైనాకు ఇప్పటికే బంగ్లాదేశ్‌లోని మౌలిక రంగాల్లో పట్టు ఏర్పడింది. చాటోగ్రామ్‌లో ఏర్పాటు చేస్తున్న 'చైనా ఎకనామిక్ జోన్' ఈ విషయంలో ప్రధాన ఉదాహరణ.

దీనికితోడు పాకిస్థాన్‌తో కూడా బంగ్లాదేశ్ సన్నిహితంగా మారుతోంది. గతంలో బంగ్లాదేశ్‌ను చీల్చిన దేశంతో ఇప్పుడు స్నేహ హస్తం అందించడం రాజకీయంగా ఆసక్తికరమైన మార్పు. 1971 యుద్ధంలో జరిగిన అమానుషాల్ని, భారతదేశం ఇచ్చిన మద్దతును పూర్తిగా విస్మరించినట్టుగా యూనస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇప్పుడు పాకిస్థాన్‌తో మిలిటరీ భాగస్వామ్యం, ఇంటెలిజెన్స్ సంబంధాలు, వ్యాపార ఒప్పందాలు చేపట్టడం విచిత్రంగా మారింది.

ఇటీవల రెండు దేశాల మిలిటరీ అధికారుల మధ్య రహస్యంగా జరిగిన సమావేశాల్లో బోర్డర్ మానిటరింగ్ టెక్నాలజీ, డ్రోన్స్ వంటి అంశాలపై చర్చలు జరిగాయని సమాచారం. పైగా, పాకిస్తాన్ డిఫెన్స్ సంస్థలు బంగ్లాదేశ్‌లో ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. పాక్ బ్యాంకులు ఆ దేశ ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశించే ప్రయత్నాలు చేస్తున్నాయి. మొత్తంగా చూస్తే, బంగ్లాదేశ్ మిత్రదేశాలను విస్మరించి శత్రు శిబిరంలో అడుగులు వేస్తోందన్న భావన బలపడుతోంది.

ఇక మరోవైపు, బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు పెరిగిపోతున్నాయి. షేక్ హసీనా పదవీ విరమణ తర్వాత మొదలైన అల్లర్లు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇప్పటికే 23 మంది హిందువులు హత్యకు గురయ్యారు. దాడులు, దేవాలయాల విధ్వంసం, ఆస్తుల ఆక్రమణలు, బెదిరింపులు రోజురోజుకీ పెరుగుతుండటంతో అక్కడి మైనారిటీలు భయంలో జీవిస్తున్నారు. మతపరమైన స్వేచ్ఛ కోల్పోయిన హిందువులు శరణార్థుల్లా మారిపోతున్న పరిస్థితి నెలకొంది.

Tags:    

Similar News