Russia: ప్రపంచానికి మరో ముప్పు..రష్యాలో కోవిడ్ తరహా అంతుచిక్కని మిస్టరీ వైరస్?

Russia: రష్యాలో అంతుచిక్కని వైరస్ విజ్రుంభిస్తున్నట్లు పలు వార్తసంస్థల్లో కథనాలు వస్తున్నాయి. అక్కడి ప్రజలు తీవ్రమైన శ్వాసకోశ సంబంధిత సమస్యలతో దీర్ఘకాలిక జ్వరంతో బాధపడుతున్నారని తెలిపాయి. వైరస్ కారణంగా వారు దగ్గుతున్నప్పుడు రక్తం పడుతుందనే నివేదికలు ప్రపంచ దేశాల్లో ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. రష్యాలో మిస్టరీ వైరస్ పాకుతుందని మార్చి 29న పలు నివేదికలు వెలువడ్డాయి. పలు నగరాల్లో ప్రజలు వారాలతరబడి జ్వరం, ఒళ్లు నొప్పులు, తీవ్ర దగ్గుతూ బాధపడుతున్నారని..ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని పేర్కొన్నాయి. అయితే కోవిడ్ టెస్టులు చేసినప్పుడు నెగెటివ్ వచ్చిందని..ఇది మరో కొత్త వైరస్ అయి ఉంటుందని అభిప్రాయపడ్డాయి.
రష్యాకు చెందిన అలెగ్జాండ్రా అనే మహిళ 5 రోజుల నుంచి జ్వరంతో బాధపడుతుందని కొన్ని రోజులకు దగ్గుతున్న సమయంలో రక్తం పడుతుందని తెలిపిందని నివేదికలు వెల్లడించాయి. ఎన్ని మందులు వాడినప్పటికీ తగ్గలేదని..ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి అనేక ఇతర కేసుల గురించి వివరించాయి. మరికొందరు నెటిజన్లు మాత్రం తాము తీవ్రమైన రక్తంతో కూడిన దగ్గుతో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
అయితే ఈ నివేదికలన్నీ తప్పుడు ప్రచారాలంటూ రష్యన్ అధికారులు ఖండించారు. తాము జరుపుతున్న పరీక్షల్లో దేశంలో ఎలాంటి కొత్త వ్యాధి కారకాలు బయటపడలేదని కొత్త వైరస్ వ్యాపించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నప్పటికీ అందులో ఏమాత్రం నిజం లేదన్నారు. నివేదికల్లో పేర్కొన్న మహిళకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమెకు మైకో ప్లాస్మా న్యుమోనియా ఉందని నిర్ధారించినట్లు తెలిపారు.