
I regret moving to canada - indian student - కెనడా వచ్చి తప్పు చేశాను... వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్
Indian students in Canada: మీలో ఎవరైనా కెనడాకు వస్తున్నారా? లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా కెనడాలో కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే, ఇది మీ కోసమే అంటున్నారు ఆల్రెడీ కెనడాలో చదువుకుంటున్న ఒక ఇండియన్ స్టూడెంట్. కెనడాకు వచ్చి తప్పు చేశానని బాధపడుతున్నట్లుగా ఆ స్టూడెంట్ రెడిట్ ద్వారా చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ పోస్టులో ఆ ఇండియన్ స్టూడెంట్ ఏమేం వివరాలు వెల్లడించారు? ఎందుకు ఆ పోస్ట్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.
విదేశాల్లో భవిష్యత్ బాగుంటుందని కెనడాకు వచ్చాను. ఒకవేళ మీరు కూడా అలాంటి కలలు కంటూ పాశ్చాత్య దేశాలకు రావాలనుకుంటే అది ఒక భ్రమే అవుతుంది కానీ అందులో నిజం లేదని ఆ స్టూడెంట్ అభిప్రాయపడ్డారు.
బిజినెస్ మోడల్ పేరుతో కెనడా ప్రభుత్వం, కెనడాలోని కాలేజీలు ఇక్కడ చదువుకోవడానికి వచ్చే విదేశీ విద్యార్థుల జీవితాలతో ఆటాడుకుంటున్నాయని వాపోయారు. చాలావరకు విదేశీ విద్యార్థులు ప్రైవేట్ కాలేజ్‌లు లేదా లో-ర్యాంకింగ్ ఉన్న కాలేజీల్లోనే చేరుతారు. ఫీజులు ఎక్కువగా ఉంటాయి కానీ విద్యా ప్రమాణాలు మాత్రం చాలా తక్కువగా ఉంటాయని అన్నారు.
ప్రొఫెసర్స్ విద్యార్థులకు పాఠాలు నేర్పేందుకు ప్రయత్నించరు. సిలబస్ కూడా ఎప్పుడో పాతకాలం నాటిది.ఆ డిగ్రీలు, డిప్లొమాలు పట్టుకుని జాబ్ మార్కెట్లోకి వెళ్తే ఎవ్వరూ ఉద్యోగాలు ఇవ్వరు. ఇంకొంతమంది అయితే, అసలు మీ డిగ్రీని కూడా సీరియస్‌గా తీసుకోరని ఆవేదన వ్యక్తంచేశారు. ఉదాహరణ కోసం కల్గరీలోని బో వ్యాలీ కాలేజ్ గురించి ప్రస్తావించారు.
ఇక్కడ డిగ్రీలు చదువుకున్న వారిలో చాలామందిలో బతకడం కోసం ఉబర్, గోదాంలలో పనులు, రీటెయిల్ స్టోర్స్ వంటి పనులు చేసుకుంటున్నారు అని కెనడాలోని పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారు.
కెనడాలో చదువుకోవడానికి వచ్చే విదేశీ విద్యార్థులకు మరో షాక్ ఏంటంటే... ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఎక్కువే అని ఆ స్టూడెంట్ పేర్కొన్నారు. ఇంటి అద్దె, నిత్యావసరాలు, ఇతరత్రా ఖర్చులు.... ఇలా ఏవీ తీసుకున్నా అనుకున్న దాని కంటే ఎక్కువే ఖర్చు అవుతుందన్నారు.
గొడ్డులా కష్టపడాలి... లేదంటే పస్తులు ఉండాలి..
అన్నింటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే... ఇక్కడ కనీస అవసరాలు వెళ్లదీసుకునేందుకు గంటలకు గంటలు ఎక్కువ పని చేయాలి. పని చేస్తేనే కనీస అవసరాలకు సరిపడ డబ్బు వస్తుంది. లేదంటే ఇక పస్తులే అని ఆందోళన వ్యక్తంచేశారు.
విదేశీ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటారు
కెనడాలో చదువుకోవడానికి వచ్చే విదేశీ విద్యార్థులకు ఇక్కడ పని ఇచ్చే వారు చాలా దారుణంగా వ్యవహరిస్తారని ఆ స్టూడెంట్ తెలిపారు. "తక్కువ డబ్బులు ఇచ్చి ఎక్కువ పని చేయించుకుంటారు. అదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే, వారిని వెంటనే పనిలోంచి తీసేసి అదే స్థానంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తోన్న మరో విదేశీ విద్యార్థిని పెట్టుకుంటారు. అందుకే ఉద్యోగం కాపాడుకోవడం కోసం ఆ పని ఎంత కష్టమైనా అలా చేసుకుపోక తప్పదు" అని ఆ స్టూడెంట్ రెడిట్‌లో రాశారు. కెనడాలో విదేశీ విద్యార్థులు ఎదుర్కుంటున్న ఇబ్బందుల గురించి ఆ స్టూడెంట్ చెప్పిన తీరు చూస్తే వారి దుస్థితిని కళ్లకు కట్టినట్లు చూపించినట్లుంది.
కెనడాలో ఉంటున్న ఇండియన్ స్టూడెంట్ చేసిన ఈ రెడిట్ పోస్టుకు సోషల్ మీడియాలో భారీ స్పందన కనిపిస్తోంది. ఉన్నత చదువుల కోసం, ఉద్యోగాల కోసం అమెరికా, కెనడా వెళ్లిన విద్యార్థుల బతుకులు కూడా "దూరపు కొండలు నునుపు" అనే సామెత చందంగానే ఉన్నాయంటూ కొంతమంది నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు.
Trump tariffs Impacts on India: ట్రంప్ టారిఫ్‌లతో ఇండియా బేజారు
Gold Rate: రూ. 64 నుంచి 90,000 దాకా బంగారం ధర ఎలా పెరిగింది? ఇంకెంత పెరుగుతుంది?