ISS: అంతరిక్షంలో జీవితం ఎలా ఉంటుంది? బాత్‌రూమ్ వ్యవస్థ సంగతేంటి?
అంతరిక్ష కేంద్రంలో సాధారణ నీటి ప్రవాహం ఉండదు. కాబట్టి వ్యోమగాములు ప్రత్యేకంగా రూపొందించిన టాయిలెట్ వ్యవస్థను ఉపయోగిస్తారు.

ISS: అంతరిక్షంలో జీవితం ఎలా ఉంటుంది? బాత్‌రూమ్ వ్యవస్థ సంగతేంటి?
ISS: భూమి నుంచి సుమారు 400 కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్ష కేంద్రంలో గడిపే జీవితం భూమిపై ఉన్న జీవనశైలికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అక్కడున్న శూన్య వాతావరణంలో ప్రతీ కదలిక కొత్తగా అనిపిస్తుంది. అంతరిక్షంలో బరువులేనట్టుగా అనిపించడం వల్ల, నేలమీద నిలబడే అవసరం ఉండదు. అంతరిక్ష నౌకలో గాలిలో తేలుతూ, గోడలు, పైకప్పుల మీద కూడా సులభంగా కదలడం సాధ్యమవుతుంది. అంతరిక్ష కేంద్రంలో సాధారణ మంచాలపై పడుకోవడం సాధ్యం కాదు. అందుకే ప్రత్యేకంగా రూపొందించిన నిద్రబస్తాలు (sleeping bags) గోడలకు అమర్చుతారు. వ్యోమగాములు వాటిలో చుట్టేసుకుని నిద్రిస్తారు. అంతరిక్ష కేంద్రం భూమి చుట్టూ తిరిగే వేగం కారణంగా రోజుకు 16 సార్లు సూర్యోదయం, అస్తమయం కనిపిస్తుంది. ఎప్పుడైనా కిటికీ దగ్గర కూర్చుని భూమిని చూస్తూ నిద్ర మరిచిపోయే సందర్భాలు ఏర్పడుతాయి.
అంతరిక్షంలో ద్రవ పదార్థాలు గాలిలో తేలిపోతాయి. అందుకే నీటిని స్ట్రా ద్వారా తాగాలి. ఆహార పదార్థాలు ప్రత్యేకంగా ప్యాక్ చేసిన ఫుడ్ బాక్స్‌ల్లో అందుబాటులో ఉంటాయి. పొడి ఆహారాన్ని నీటితో కలిపి తినాలి. అంతే కాకుండా, అక్కడ ఉన్న వాతావరణ నియంత్రిత పరిస్థితుల వల్ల తాజా ఆహారం ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అంతరిక్ష కేంద్రంలో సాధారణ నీటి ప్రవాహం ఉండదు. కాబట్టి వ్యోమగాములు ప్రత్యేకంగా రూపొందించిన టాయిలెట్ వ్యవస్థను ఉపయోగిస్తారు. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అక్కడ చెమట, మూత్రాన్ని శుద్ధి చేసి తిరిగి మంచినీటిగా మార్చేస్తారు. సున్నితమైన గురుత్వాకర్షణ వాతావరణంలో ఎక్కువ రోజులు గడపడం వల్ల వ్యోమగాముల ఎముకలు బలహీనపడుతాయి. కండరాలు తక్కువ శక్తివంతంగా మారతాయి. ఈ ప్రభావాలను తగ్గించేందుకు వారు రోజుకు కొన్ని గంటలు వ్యాయామం చేయాల్సి ఉంటుంది. ట్రెడ్‌మిల్‌పై నడిచేందుకు బెల్టులతో కట్టుకుని తేలిపోకుండా కాపాడుకోవాలి.
ఇక సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ అనుకున్నదానికంటే ఎక్కువ రోజులు అంతరిక్షంలో గడిపారు. అయినప్పటికీ, వారి ప్రయాణం అనుభవపూర్వకంగా మారింది. భూమిని బయట నుంచి చూడటం ఒక అద్భుతమైన అనుభూతి. అంతరిక్షంలో జీవితం అనేక సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ, ఆ అనుభవం జీవితాంతం గుర్తుండిపోయే ప్రత్యేకమైనది.