Quail Farming: ఉపాధి మార్గంగా కౌజు పిట్టల పెంపకం
Quail Farming: ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాల కోసం ఆరాటపడకుండా స్వయం ఉపాధి పొందేందుకు చాలా మంది యువకులు ఆసక్తి కనబరుస్తున్నారు.
Quail Farming: ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాల కోసం ఆరాటపడకుండా స్వయం ఉపాధి పొందేందుకు చాలా మంది యువకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జించే వ్యవసాయ అనుబంధ రంగాలను ఎంచుకుంటున్నారు. అలాంటి కోవకు చెందినవాడే కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన యువరైతు మల్లికార్జున్. ఎంబీఏ చదివిన మల్లికార్జున్ కౌజు పిట్టల పెంపకం వైపు కదిలాడు. ఎక్కువ పోషక విలువలు కలిగి, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు గడిస్తూ తోటి యువతకు, నిరుధ్యోగులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.
కౌజు పిట్టల పెంపకం యువతకు స్వయం ఉపాధి మార్గంగా మారింది. కోడి మాంసం కంటే రుచిగా, కొవ్వు పరిమాణం తక్కుగా ఉండటం వల్ల మార్కెట్ లో వీటికి గిరాకీ ఏర్పడింది. గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు, చిన్న పిల్లకు ఈ కంజు పిట్టల మాంసం ఎంతో పౌష్టిక ఆహారమే కాక, పిల్లల్లో శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదపడే అధిక పోషకాలు ఉండడంతో ఈ గుడ్లు తినడానికి వినియోగదారులు ఇష్ట పడ్తున్నారు. బాయిలర్ కోళ్ల తో పోల్చుకుంటే ఒక్క కోడి పెంచే స్థలంలో 8 నుంచి 10 కౌజు పిట్టలను పెంచవచ్చు. ఈ పక్షులు నాలుగు నుంచి ఐదు వారాల్లో మార్కెట్ చేసుకోవడానికి అనువుగా ఉండటంతో యువకులు, నిరుధ్యోగులకు చక్కటి ఉపాధి మార్గంగా మారింది.
కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన యువరైతు మల్లికార్జున్ 4 నెలల కింద కౌజుల పెంపకం మొదలు పెట్టాడు. జిల్లాలో ఇదే మొదటి కౌజు పక్షుల ఫామ్ కావడం విశేషం. దీంతో జిల్లాలో వీటికి మంచి గిరాకీ ఏర్పడింది. ప్రతి నెల ఒక బ్యాచ్ వచ్చే విధంగా ప్రణాళికా బద్ధంగా పెంపకాన్ని చేపడుతున్నాడు మల్లికార్జున్. కౌజు పిట్టల కోసం తనకున్న కొద్దిపాటి స్థలంలో తక్కువ ఖర్చుతో అనువైన షెడ్డును, కేజ్ లను నిర్మించుకున్నాడు. దాణా, నీరు అందించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ పెంపకం చేపడితే మంచి లాభాలను పొందవచ్చని అంటున్నాడు.
మార్కెట్ లో కౌజు పిట్టల గుడ్లకు అధిక డిమాండ్ ఉండడంతో ప్రతి బ్యాచ్ లో సగం పిట్టలను గుడ్లు కోసం పెంచుతున్నాడు. వాటి సంరక్షణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఒక్కో పక్షి పెంపకానికి 25 రూపాయలు వరకు ఖర్చు అవుతోంది. మార్కెట్లో ఒక్కో పెట్టను 70 నుంచి 80 రూపాయలకు విక్రయిస్తున్నాడు. నెలకు మూడు వేల నుంచి 4 వేల వరకు పిట్టలు అమ్మినా 30 నుంచి 40 వేల రూపాయల వరకు ఆదాయం వస్తున్నట్లు మల్లికార్జున్ చెబుతున్నాడు. త్వరలోనే తన ఫామ్ లొనే కౌజు పిట్టలు పొదిగేలా వసతులు, ఇంక్యుబేటర్ ను ఏర్పాటు చేసుకుంటానని తెలిపాడు.
చదువుకున్న యువకులు కొలువులు రాలేదని, నిరాశ చెందకుండా ఇలాంటి స్వయం ఉపాధి మార్గాలు ఎంచుకుంటే, చాలా వరకు లాభాలు పొందవచ్చు అంటున్నాడు ఈ యువకుడు. ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తే, ఫామ్ ను మరింత విస్తరించి, జిల్లా వాసులకు మంచి పౌష్టికాహారం అందిస్తానంటున్నాడు.