రైతులకి శుభవార్త.. పీఎం కిసాన్‌తో పాటు సబ్సిడీ ప్రయోజనం..!
Fertilizer Subsidy: పీఎం కిసాన్ నిధి 11వ విడతకి ముందు రైతులకు కేంద్ర ప్రభుత్వం గొప్ప వార్త అందించింది.
Fertilizer Subsidy: పీఎం కిసాన్ నిధి 11వ విడతకి ముందు రైతులకు కేంద్ర ప్రభుత్వం గొప్ప వార్త అందించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మొత్తం 14 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు. ఎరువుల సబ్సిడీ పెంపునకు కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. దీని ద్వారా రైతులకు నేరుగా లబ్ధి చేకూరనుంది. ఆహార సంస్థలు డీఏపీ ధరను పెంచాయి. దీని తర్వాత యూరియాతోపాటు ఇతర ఎరువుల ధర కూడా పెరుగుతుందని భావించారు. నానాటికీ పెరుగుతున్న డీజిల్ ధరతో రైతులు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిలో పెరుగుతున్న ఆహార ధరల ఒత్తిడి రైతులపై పడకూడదని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ఎరువుల సబ్సిడీ పెంపునకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపారు.
మొదటి 6 నెలలకు ఆమోదం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో డీఏపీ సహా ఫాస్ఫేట్, పొటాష్ (పీ అండ్ కే) ఎరువులకు రూ.60,939.23 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం ఆమోదించింది. అధికారిక ప్రకటన ప్రకారం.. ఖరీఫ్ సీజన్‌లో (ఏప్రిల్ 1, 2022 నుంచి సెప్టెంబర్ 30, 2022 వరకు) ఫాస్ఫేట్, పొటాష్ ఎరువుల కోసం పోషక ఆధారిత సబ్సిడీ రేట్లను PM మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.
డీఏపీపై సబ్సిడీ రూ.2,501కి పెరిగింది
రష్యా, ఉక్రెయిన్ మధ్య అంతర్జాతీయ మార్కెట్‌లో డి-అమోనియం ఫాస్ఫేట్ (డిఎపి), ముడి పదార్థాల ధర పెరిగింది. అయితే రైతులపై భారం పెరగకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. డీఏపీపై ఇప్పటి వరకు బస్తాకు రూ.1,650గా ఉన్న సబ్సిడీని రూ.2,501కి కేంద్రం పెంచిందని పేర్కొన్నారు. గతేడాది సబ్సిడీ రేటు కంటే ఇది 50 శాతం ఎక్కువ.
డీఏపీ బస్తాకు రూ.1,350 మాత్రమే
క్యాబినెట్ సమావేశం తరువాత సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ..ఖరీఫ్ సీజన్‌కు మాత్రమే పి అండ్ కె ఎరువులపై రూ. 60,939 కోట్ల సబ్సిడీని ఆమోదించామన్నారు. డీఏపీపై సబ్సిడీని బస్తాకు రూ.2,501కి పెంచామని, రైతులకు ఒక్కో బస్తాకు రూ.1,350 చొప్పున అందజేస్తామన్నారు. రైతులపై భారం పెరగకుండా ప్రభుత్వం భరోసా ఇచ్చిందని తెలిపారు.