కూటి కోసమే కోటి విద్యలు మనలో ఎవరు ఎంత చదువుకున్నా ఏ పని చేసి ఎంత సంపాదించినా అంతా గుప్పెడు మెతుకుల కోసమే. అయితే నగరీకరణ పెరెగుతున్నా కొద్దీ చాలా మంది వ్యవసాయం గురించి మర్చిపోతున్నారు. తాము తింటున్న తిండి ఎలా పండుతుంతో తెలుసుకోలేకపోతున్నారు. సాగుపై యువతరంలో ఆసక్తి తగ్గుతోంది. ఇది మనదేశ ఆహార భద్రతకే పెను సవాలుగా మారే అవకాశముంది. ఈ నేపధ్యంలో యువరైతుల్లో ఆసక్తిని పంచి సాగులో నైపుణ్యతను పెంచడం ఎంతైనా అవసరం ఆ దిశగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్రవ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి చేస్తోంది. యువతరానికి సాగుపై సమస్త విజ్ఞానాన్ని అందించేందుకు శిక్షణ తరగతులను నిర్వహిస్తోంది.
సాగు విధానాలపై శిక్షణా తరగతులు అంటే ఏదో తరగతి గదిలో నాలుగు గోడల మధ్య కూర్చోబెట్టి పుస్తక జ్ఞానం అందించడం మాత్రమే కాదు. వ్యవసాయ క్షేత్రంలో ఆచరణాతమ్మకంగా సాగు పనులు ఎలా చేయాలో ప్రత్యక్షంగా నేర్పిస్తున్నారు నిపుణులు. మోయినాబాద్‌లోని హఫీజ్ పేటలో ఓ వ్యవసాయ క్షేత్రంలో యువరైతులు పొలం పనులు నేర్చుకుంటున్నారు. నేలను దున్నడం, విత్తన శుద్ధి చేయడం విత్తనాలను విత్తడం, డ్రిప్ పరికరాలను ఏర్పాటు చేయడం, ఎరువులను చల్లడం ఇలా అన్ని పనులను యువరైతులే స్వయంగా చేస్తున్నారు. పొలం పనులను ఎంతో శ్రద్ధతో నేర్చుకుంటున్నారు.
వేసవిలో కూరగాయల సాగును ఏవిధంగా చేయాలో ప్రకృతి వ్యవసాయ నిపుణులు శివప్రసాద్ రాజు విద్యార్ధులకు శిక్షణను అందిస్తున్నారు.
నేలను ఏ విధంగా తయారు చేసుకోవాలి? విత్తన శుద్ధి ప్రాముఖ్యతేంటి? బెడ్‌లపైన విత్తనాలను ఏ విధంగా నాటుకోవాలి? పశువుల ఎరువును ఏ విధంగా తాయారు చేసుకోవాలి? వాటిని పంటలకు ఏ సమయంలో అందించాలి? కలుపు నివారణ ఏ విధంగా చేపట్టాలి అన్న విషయాలపై విద్యార్ధులకు శిక్షణలో భాగంగా అవగాహన కల్పిస్తున్నారు.