నగరాల్లో మిద్దెతోటల పెంపకంపై బాగానే ఆసక్తి పెరుగుతుంది. కల్తీ లేని ఆహారం కావాలంటే ఇప్పుడు మిద్దెతోటలే పరిష్కార మార్గాలయ్యాయి. నాణ్యమైన ఆహారమే కాదు మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. చాలా మంది మార్కెట్లో దొరికే కలుషితమైన పండ్లు, కూరగాయలకు భయపడి సొంత ఇళ్లపైనా, ఖాళీ స్థలాలలో మిద్దెతోటలని సాగు చేసుకుంటున్నారు ఇలా సాగు చేసుకునే వారు కొందరైతే మరి కొందరు తమ ఇంట్లో చిన్న పిల్లల కోసం ఎలాంటి రసాయనాలు వాడని ఆహరం ఇవ్వడానికి మిద్దెతోటలని ఏర్పాటు చేసుకుంటున్నారు. అదే ఆలోచనతో నగరంలోని బంజారాహిల్స్ కు చెందిన ప్రభ , తన మనవరాలి కోసం పెంచుతున్నారు మిద్దెతోట.
బంజారాహిల్స్ కు చెందిన ప్రభ చిన్నతనం నుండి వ్యవసాయ కుటుంబంలో పెరిగింది. పట్టణంలో ఉంటున్నప్పటికి వ్యవసాయంపై ఆసక్తి ఎక్కువ. దీని వల్ల మొదట ఇంటిని అందంగా తయారు చేసుకునేందుకు బోన్సాయ్ మొక్కలను పెంచటం మొదలు పెట్టింది. ఆ తరువాత మిద్దె తోటపై ఆసక్తి పెరిగి తన ముద్దుల మనవరాలి ఇనారా కోసం మిద్దెతోట వైపు మళ్లింది. మనం నిత్యం తీసుకొనే ఆహారం ఎన్నో రకాల రసాయానాలతో కలుషితమవుతున్నాయి. అందులో నగరాలకు వచ్చే కూరగాయల పరిస్థితి ఇంకా చెప్పనవసరం లేదు. దిగుబడే ద్యేయంగా ఎన్నో రకాలుగా పంటలు కలుషితమవుతున్నాయి. ఈ రసాయనాల మోతాదును పెద్దలు కొంత వరకు తట్టుకున్నప్పటికి పిల్లలకు అనారోగ్యాలకు గురి చేసే అవకాశం వుంది. అందుకే తన మనవరాలి కోసం ప్రత్యేక సాగు చేస్తున్నామని తాను కూడ మిద్దె తోటలో ఆడుకుంటూ సరదాగా గడుపుతుందని ప్రభ అంటున్నారు.
రకరకాల పూలు, ఆకు కూరలు పండిస్తున్న తన మిద్దెతోట సాగులో తక్కువ నీటి వినియోగంతో గ్రో బ్యాగ్స్, ఫైబర్ టబ్బులతో మొక్కలను పెంచుతున్నారు. ఎరువులుగా వర్మి కంపోస్ట్, గుర్రం పేడని వాడుతున్నారు. అదే క్రమంలో పలు రకాల బోన్సాయి మొక్కల్ని కూడా పెంచుతున్నారు. ఇప్పుడు పట్నాలు పెల్లెటూర్లుగా మారుతున్నాయి. మిద్దెతోటల వల్ల నాణ్యమైన ఆహారం పండించుకోవడమే కాకుండా మానసిక ఆహ్లాదాన్ని పొందుతున్నాని, ఇలా ప్రతి ఒక్కరు కూడా తమకి ఉన్న కోద్ది స్థలాల్లో అయినా తమ వంతు కూరగాయలు, ఆకు కూరలు సేంద్రియ పద్దతిలో పెంచుకుంటే ఆరోగ్యం, ఆనందం రెండూ ఉంటాయని అంటున్నారు.