రసాయనాలు లేని ఆహారాన్ని తమ కుటుంబానికి అందించాలన్న తపనతో గత 20 ఏళ్లుగా మిద్దె తోటలను సాగు చేస్తున్నారు నూర్జహాన్. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను పూర్తి ప్రకృతి విధానంలో పండిస్తున్నారు. మిద్దె తోటల సాగులో మెళకువలను పాటిస్తూ జీవవైవిద్యాన్ని పెంపొందిస్తున్నారు తక్కువ మొక్కలతో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడిని పొందే పంటలను పండిస్తూ ఇంటిళ్ల పాది ఆరోగ్యంగా జీవిస్తున్నారు. నూర్జహాన్ గారు
పెరిగే ఏ మొక్కకు ఇప్పటి వరకు తెగుళ‌్లు రాలేదు. పురుగు సోకలేదు. కారణం నూర్జహాన్ మొక్కలకు అందించే ఎరువులనే చెప్పాలి. ముఖ్యంగా కిచెన్ వేస్ట్‌నే మొక్కలకు ఎరువుగా వినియోగిస్తున్నారు. అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి గో వ్యర్ధాలను వినియోగిస్తున్నారు. ఈ ఎరువులను సైతం సంవత్సరానికి సరిపడే నిల్వ చేసుకుంటున్నారు.
మిద్దె తోటల నుంచి వచ్చిన ఉత్పత్తులతో ఇంట్లోనే నాచురల్ ప్రాడక్ట్స్‌ను తయారు చేసుకుంటున్నారు. తులసీ, పుదీనా, ఎండిన చామంతి పూలతో టీ పౌడర్‌ను తయారు చేసుకుని ఇంట్లో వినియోగిస్తున్నారు. షుగర్ వ్యాధి గ్రస్తులు పళ్లపోటు నుంచి ఉపశమనం పొందే టూత్ పౌడర్ ను మొక్కల ఆకులతో తయారు చేశారు నూర్జహాన్. అంతే కాదు షుగర్, క్యాన్సర్ వ్యాధులు దరి చేరకుండా ప్రత్యేకంగా ఒక ట్యాబ్లెట్‌ను రూపొందించారు.
ఇంట్లో కూరగాయలను పండించడానికి ముఖ్యంగా కావలసినది మానసిక సంసిద్ధత, ఆ తర్వాత ఆసక్తి. సమయం, శ్రమ, సృజనాత్మకత అనేవి ప్రధాన పెట్టుబడులు. ఇవన్నీ ఉన్నట్లయితే మొక్కలను ఎక్కడెక్కడ పెంచాలో చక్కటి ఆలోచనలు వస్తాయంటారు ఈమె. ప్రతీ ఒక్కరు తమ అవసరాల నిమిత్తమైనా ఇంట్లో తప్పనిసరిగా మొక్కలను పెంచుకోవాలంటున్నారు. ఆరోగ్యంగా జీవించాలని సూచిస్తున్నారు.