Terrace Gardening: మిద్దె సేద్యంతో ఆకట్టుకుంటున్న ఇల్లాలు

Terrace Gardening: హైదరాబాద్‌లోని బీరమ్‌కూడకు చెందిన లక్ష్మీ ఓ గృహిణి.

Update: 2021-05-31 10:22 GMT

Terrace Gardening: మిద్దె సేద్యంతో ఆకట్టుకుంటున్న ఇల్లాలు

Terrace Gardening: హైదరాబాద్‌లోని బీరమ్‌కూడకు చెందిన లక్ష్మీ ఓ గృహిణి. సొంతూరు ప్రకాశం జిల్లా తన భర్త ఉద్యోగరిత్యా 10 ఏళ్ల క్రితం హైదరాబాద్ కు వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. పిల్లలూ పెద్దవారు కావడం భర్త ఉద్యోగరిత్యా బిజీగా ఉండటంతో తన ఖాళీ సమయాన్ని వృధా చేయకూడదన్న ఆలోచన లక్ష్మీలో మొదలైంది. ఉద్యానశాఖ ఇచ్చిన ప్రకటన ఇంటి పంటల పెంపకానికి ప్రేరణ అందించింది. ఆ ఆలోచనే తన మేడను ఓ నందన వనంగా మార్చేలా చేసింది. గత 5 ఏళ్లుగా 180 గజాల విస్తీర్ణంలో మిద్దె తోటలను పూర్తి ప్రకృతి విధానంలో సాగు చేస్తూ ఆరోగ్యకరమైన పోషకాలతో కూడిన ఆహారాన్ని కుటుంబసభ్యులకు అందిస్తున్నారు.

ఆలోచన ఉన్నా అనుభవం లేదు. అందుకే తెలిసీ తెలియక తప్పటడుగులు వేయాలనుకోలేదు ఆచీ తూచీ అవగాహన పెంచుకుని మెళ్లి మెళ్లిగా మిద్దతోటలను విస్తరిస్తూ వస్తున్నారు లక్ష్మీ. మొదట ఆకుకూరలతో మిద్దె సాగు ప్రారంభించారు. ఆ తరువాత కూరగాయలను పండించడం మొదలు పెట్టారు. అలా ఇప్పుడు పండ్ల మొక్కలను పెంచుతున్నారు. ప్రత్యేక శ్రద్ధతో మొక్కలను పెంచుతుండటంతో మంచి నాణ్యమైన ఉత్పత్తి లభిస్తోంది. కూరగాయలు తమ ఇంటి అవసరాలకు సరిపోగా మిగిలినవి బంధుమిత్రులకు చుట్టుపక్కనవారికి అందిస్తూ ఆనందిస్తున్నారు.

కుండీల్లో కాకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న సిమెంటు తొట్టెల్లో , ఉద్యాన శాఖ అందించిన గ్రో బ్యాగుల్లో పంటలు పండిస్తున్నారు. అయితే చాలా మందికి సిమెంటు తొట్టెలు ఏర్పాటు చేసుకుంటే మేడ మీద భారం పెరుగుతుందన్న అపోహ ఉందని అలాంటి సమస్య ఏమీ ఉండదంటున్నారు లక్ష్మి. ప్రతి సంవత్సరం ఖర్చు వద్దు అనుకున్న వారు సిమెంటు తొట్టెలనే ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ తొట్టెల వల్ల మొక్కలు బాగా ఎదగడమే కాదు దిగుబడి కూడా నాణ్యంగా ఉంటుందని చెబుతున్నారు.

రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులకు దూరంగా ఉంటున్నారు లక్ష్మీ. ఇంటికి సరిపడా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను పూర్తి ప్రకృతి పద్ధతుల్లోనే పండిస్తున్నారు. చాలా వరకు మిద్దె సాగుదారులు కోకోపిట్, వర్మీకంపోస్ట్ ను వినియోగిస్తుంటారు. కానీ లక్ష్మీగారు ఆవు పేడ, మూత్రిన్ని మాత్రమే ఎరువుగా మొక్కలకు అందిస్తున్నారు. ఐదేళ్లుగా ఈ ఎరువుతోనే మొక్కలకు పోషకాలు అందుతున్నాయని చెబుతున్నారు. ఇక చీడపీడలను సైతం ప్రకృతి పద్ధతుల్లోనే నివారిస్తున్నారు. పుల్లటి మజ్జిగను మొక్కలపై పిచికారీ చేసి అదుపు చేస్తున్నారు. అయితే చీడపీడలు వచ్చిన తరువాత నివారించడం కంటే ముందుగానే గుర్తించి తగిని జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన దిగుబడులు సాధించవచ్చని అంటున్నారు లక్ష్మీ.

ఇంటిల్లిపాదికి సంవత్సరం పొడవునా తాజా కూరగాయలు, పండ్లు, ఔషధ మొక్కలు ఇస్తుంది మిద్దెతోట. ఆరోగ్యానికి భరోసా కూడా కల్పిస్తుంది. పట్టణ జీవనంలో దూరమైన మానసిక ఉల్లాసాన్ని మిద్దె తోటల ద్వారా పొందవచ్చు. అన్నింటికి మించి ప్రకృతితో స్నేహం నేర్పిస్తుంది. అందుకే ప్రతి రోజు ఓ గంట సమయం మిద్దె తోటకు కేటాయిస్తే మొక్కల సంరక్షణతో పాటు మనకు ఆరోగ్యం లభిస్తుందని చెబుతున్నారు లక్ష్మీ.

Full View


Tags:    

Similar News