Palm Oil: పామాయిల్ సాగువైపు సిద్దిపేట జిల్లా రైతులు

Palm Oil: ఈ మధ్యకాలంలో వంట నూనెల ధరలు ఎంతలా పెరిగాయో అందరికీ తెలిసింది. మన దేశానికి ఇతర దేశాల నుంచి వంట నూనెలు దిగుమతి కావడమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణం.

Update: 2022-03-15 11:20 GMT

పామాయిల్ సాగువైపు సిద్దిపేట జిల్లా రైతులు

Palm Oil: ఈ మధ్యకాలంలో వంట నూనెల ధరలు ఎంతలా పెరిగాయో అందరికీ తెలిసింది. మన దేశానికి ఇతర దేశాల నుంచి వంట నూనెలు దిగుమతి కావడమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. దేశంలో సుమారు 22 మిలియన్ టన్నుల వంట నూనెలు అవసరం కాగా కేవలం 7 మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. మిగతాదంతా దిగుమతి అవుతోంది. వంట నూనెలకు అంతలా డిమాండ్ ఉంది కాబట్టే దేశీయంగా నూనె గింజల పంటల సాగును ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ఈ క్రమంలో ఒకసారి నాటితే 40 ఏళ్ల వరకు దిగుబడి అందిచే నూనె గింజల పంటైన ఆయిల్ పామ్‌కు ప్రభుత్వం వివిధ రకాలుగా రాయితీలను అందిస్తోంది. దీంతో రైతులు ఆయిల్ పామ్ సాగుకు ఆసక్తి చూపుతున్నారు. మొక్కనాటిన నాల్గవ ఏట నుంచి ప్రతి నెల నమ్మకమైన రాబడిని అందిచడంతో పాటు మార్కెట్‌లో ధర ఆశాజనకంగా ఉండటంతో సిద్దిపేట జిల్లా రైతులు పామాయిల్ సాగుకు ఆసక్త చూపుతున్నారు.

ఒకసారి సాగు చేస్తే నష్టాలు, కష్టాలు ఉండవు. ప్రతి నెల రైతుకు ఆదాయం నమ్మకంగా లభిస్తుంది. అందుకే ఈ మధ్యకాలంలో ఆయిల్ పామ్ సాగువైపు మొగ్గు చూపుతున్నారు సాగుదారులు. అదే క్రమంలో సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లపూర్ గ్రామం రైతులు సాంప్రదాయ పంటలకు బదులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. రైతులు తమ పొలాల్లో పామాయిల్ పంటను సాగు చేస్తూ అధిక లాభాలు గడిస్తున్నారు. అతి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి తో రైతులు ఆర్థికంగా ముందడుగు వేస్తున్నారు. మరో వైపు ప్రభుత్వం కూడా ప్రోత్సాహం అందిస్తుండటంతో జిల్లాలో పామాయిల్ సాగు రోజురోజుకు విస్తరిస్తోంది.

దేశంలో ప్రధాన ఆహార పంట వరి. అయినా మారుతున్న కాలానికి, డిమాండ్‌కు అనుగుణంగా వాణిజ్య పంటలపై రైతులు దృష్టి సారిస్తున్నారు. అందులోనూ తెలంగాణలో వరికి ప్రత్యామ్నయా పంటలపై దృష్టి సారించాలని ప్రభుత్వం అధికారులు సూచిస్తుండటంతో జిల్లాలోని రైతులు పామాయిల్ సాగువైపు అడుగులు వేశారు. సొంతగా భూమి లేకున్నా కొంత మంది రైతులు కౌలుకు పొలం తీసుకుని మరీ పామాయిల్ సాగు చేస్తున్నారు. సాగుకు అవసరమైన డ్రిప్పులను ప్రభుత్వం సబ్సిడీ మీద అందించిందని రైతులు తెలిపారు. పామాయిల్ మొక్కలు నాటిని నాలుగేళ‌్లకు దిగుబడి అందుతుందని అంత వరకు అధికారుల సూచనల మేరకు అంతర పంటలుగా కూరగాయలు పండిస్తున్నామన్నారు రైతులు

జిల్లాలోని చంద్లపూర్ గ్రామంలో 45 నుంచి 50 ఎకరాల్లో పామాయిల్ సాగులో ఉంది. రానున్న రోజుల్లో 200 ఎకరాల్లో సాగు విస్తరించే అవకాశం ఉంది. 200 వరకు పామాయిల్ మొక్కలను సాగు చేసే రైతులకు ప్రభుత్వం సబ్సిడీ కూడా అందిస్తోంది.

యువకులు సైతం పామాయిల్ సాగు వైపు దృష్టి సారిస్తున్నారు. జిల్లాకు చెందిన యువరైతు సాయికృష్ణ 4 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలను నాటుకున్నాడు. ఈ పంట దిగుబడి రావడానికి 4 ఏళ్ల సమయం పడుతుండటంతో అంతర పంటలుగా పొద్దుతిరుగుడు, మిర్చి సాగు చేసుకున్నాడు. తోటి రైతులు మూసదోరణిలో వరి సాగు వైపే వెళ్లకుండా ఇలాంటి వాణిజ్య పంటలను సాగు చేయాలని సూచిస్తున్నాడు.

ప్రస్తుతం తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగు రైతులకు లాభసాటిగా ఉంది. ఒకప్పుడు కొస్తా ప్రాంతంలోనే కనిపించే ఈ పంట రాష్ట్రంలో క్రమంగా విస్తరిస్తోంది. ప్రభుత్వం కూడా పామాయిల్ సాగుకు రాయితీలను అందిస్తూ రైతులను ప్రోత్సహిస్తోంది. మొక్కలు, ఎరువుల, డ్రిప్పులపై వివిధ రకాల రాయితీలు అందిస్తోంది. వరి , చెరకు కాకుండా ఏదైనా పంటలను అంతర పంటలుగా ఆయిల్‌పామ్‌లో సాగు చేసుకోవచ్చు. సిద్ధిపేట జిల్లాలో 50 వేల ఎకరాలకు పైగా ఆయిల్ పామ్‌ను సాగు చేయాలన్న లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. క్షేత్రస్థాయిలోనూ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తూ సాగులో సూచనలను అందిస్తున్నారు. రైతులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఆదాయాన్ని అందించే పంటల సాగు వైపు అడుగులు వేయాలని మనమూ ఆశిద్దాం.

Full View


Tags:    

Similar News