వ్యవసాయమే ప్రధానమని నమ్మి, అందులోనే విజయాన్ని అందిపుచ్చుకుంటున్నారు ఈ రైతు. రసాయనిక ఎరువుల లాభ నష్టాలపై అవగాహన తెచ్చుకుని కరవు సీమలో సేంద్రీయ విధానంలో 18 రకాల పండ్ల తోటలను సాగు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. ప్రధానంగా సాగులో పెట్టుబడి ఖర్చులను తగ్గించుకుని వ్యవసాయ కూలీలకు, యువతకు ఉపాధి కల్పిస్తున్నారు అనంతపురం జిల్లాకు చెందిన రైతు కపాడం సుబ్బయ్య. ఇలా ఎందరో రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన రైతు కపాడం సుబ్బయ్య. రాయలసీమ ప్రాంతంలో ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టిని మొదటి పది మంది రైతుల్లో ఈయన ఒకరు. మొదట రసాయనిక సేద్యం చేసిన ఈ రైతు రాను రాను దాని దుష్పరినామాలను తెలుసుకున్నారు. ప్రత్యామ్నాయ సాగుపై అవగాహన పెంచుకున్నారు ఈ నేపథ‌్యంలో పాలేకర్ ప్రకృతి పద్ధతులు ఈ రైతును ఆకర్షించాయి. సాగులో అవగాహన పెంచుకునేందుకు పాలేకర్ నిర్వహించిన ఎన్నో సభలకు హాజరయ్యి ప్రకృతి సాగులో ఉన్న పరమార్థాన్ని తెలుసుకున్నారు. తన 11 ఎకరాల పొలంలో ప్రకృతి విధానంలో పంటల ను సాగు చేస్తున్నారు. బంగారు పంటలను పండిస్తున్నారు.
తనకున్న 11 ఎకరాల పొలాన్ని విభజించి 4 ఎకరాలల్లో 18 రకాల పండ్ల మొక్కలను పెంచుతున్నారు. వీటి దిగుబడి ప్రారంభం కావడానికి సమయం ఉండడటంతో 3 ఎకరాల్లో చెరకు సాగు చేపట్టారు చెరకు దిగుబడి రావడానికి 11 నెలల సమయం పడుతుండడంతో చెరకులో అంతర పంటలుగా అలసందలు సాగు చేస్తున్నాడు. దీని ద్వారా పెట్టుబడి ఖర్చులను దక్కించుకున్నారు. మరో 2 ఎకరాల్లో దానిమ్మ సాగు చేస్తూనే మిగిలిన స్థలంలో కూరగాయలను పండిస్తున్నారు. ఇలా గత 12 సంవత్సరాలుగా ప్రకృతి సేద్యాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నారు ఈ రైతు.
అందురూ చదువులంటూ పట్టణాలకు ప్రయాణమైతే రేపు అన్నం పెట్టే రైతంటూ ఉండడు. అందుకే తన కుమారుడికి ప్రకృతి వ్యవసాయాన్ని నేర్పిస్తున్నారు ఈ ఆదర్శ రైతు తండి చెబుతున్న ప్రకృతి పఠాలను నేర్చుకుంటూ తండ్రికి సేద్యంలో చేదోడువాదోడుగా నిలుస్తున్నాడు నందవర్థన్. ఉన్నత చదువులు చదువుకుని ఒకరి కింద ఉద్యోగం చేయడం కంటే సేద్యంలో చెమటోడ్చి నలుగురికి అన్నం పెట్టడమే కాకుండా ఉపాధిని కల్పించి సగర్వంగా బ్రతకవచ్చని చెబుతున్నాడు ఈ యవరైతు.
వ్యవసాయంలో విపరీతమైన ఖర్చులు పెడుతున్నారు. దాని వల్ల రైతుకు ఒరిగేదేమి లేదంటున్నారు ఈ రైతు. తక్కువ ఖర్చుతోనే ప్రకృతి వ్యవసాయంతో నేలను సస్యశ్యామలం చేయడంతో పాటు బంగారు పంటలు పండించవచ్చని తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు సుబ్బయ్య. రైతుకు లాభాదాయకమైన ఆదాయం దక్కాలంటే అది ప్రకృతి సేద్యంతోనే సాధ్యం అని అంటున్నారు ఈ రైతు.