Natural Farming: ఓవైపు వైద్య సేవలు.. మరోవైపు పంటల సాగు

Natural Farming: విజయనగరం జిల్లా మొరకముడిదాం మండలం గరుగుబిల్లికి చెందిన తిరిపతిరావు ఆర్ఎంపి వైద్యుడు.

Update: 2021-11-22 07:20 GMT

Natural Farming: ఓవైపు వైద్య సేవలు.. మరోవైపు పంటల సాగు

Natural Farming: విజయనగరం జిల్లా మొరకముడిదాం మండలం గరుగుబిల్లికి చెందిన తిరిపతిరావు ఆర్ఎంపి వైద్యుడు. ఓ వైపు వైద్యుడిగా ప్రజలకు తన సేవలను అందిస్తూనే మరోవైపు ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తూ అందరినీ ఆకర్షిస్తున్నాడు. వైద్య వృత్తిలో కోనసాతునే వ్యవసాయం మీద మక్కువతో పంటల సాగు మొదలు పెట్టారు తిరుపతిరావు మొదట్లో రసాయనిక సేద్యం చేసి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెట్టుబడులు పెరిగాయే కానీ ఫలితం పెద్దగా లేకపోవడంతో ZBNF టిమ్ సహకారంతో ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేశారు. ప్రయోగాత్మకంగా ప్రకృతి పద్ధతులను అనుసరించి మామిడి సాగులో అద్భుతాలు సాధించన ఈ సాగుదారు ప్రస్తుతం విభిన్న రకాల దేశీయ వరి వంగడాలను సాగు చేస్తూ సత్ఫలితాలను సాధిస్తున్నారు.

ఐదు ఎకరాల భూమిలో దేశీయ వరి వంగడాలైన సిద్ద సన్నాలు, నవారా, కాలాబట్టి తో పాటు ప్రయోగాత్మకంగా బాస్మతీని సాగు చేస్తున్నారు తిరుపతిరావు. బాస్మతి సాగు చేస్తానంటే తోటి రైతులు గేలిచేశారని ఈ నేలలు బాస్మతికి అనుకూలం కాదని వైద్యుడివి నీకేం తెలుసునని ఎద్దేవాచేశారన్నారు. కానీ పట్టుదలతో బాస్మతిని పండిస్తూ తోటి రైతులను ఆశ్చర్యపరుస్తున్నారు. అందుకు తాను అనుసరించిన ప్రకృతి సేద్యపు విధానాలే కారణమని రైతు గర్వంగా చెబుతున్నారు. దుక్కులు దున్నడం, విత్తన శుద్ధి చేసుకోవడం, పచ్చిరొట్టలను వేసుకోవడం నారు నాటడం నుంచి ప్రతి పనిని ఎంతో నిబద్ధతతో చేసి నేడు సాగులో నిలబడుతున్నారు ఈ సాగుదారు.

జీవామృతం, నీమాస్త్రం, పంచగవ్యలను మాత్రమే పంటకు అందిస్తూ చక్కటి ఫలితాలను పొందుతున్నారు ఈ సాగుదారు. గతంలో రసాయనిక సేద్యంలో పంటలు సాగు చేసినా సంతృప్తి దక్కలేదని కానీ ప్రకృతి సేద్యంతో ఎంతో ప్రశాంతత లభిస్తుందంటున్నారు ఈ రైతు. ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తున్నానని హర్షం వ్యక్తం చేస్తున్నారు. చీడపీడలను సైతం స్థానికంగా లభించే వనరులను సేకరించి కషాయాలను తయారు చేసుకుని పంటకు అందిస్తూ నివారిస్తున్నారు.

వరి చేను చుట్టు రక్షణ పంటలను సాగు చేస్తున్నారు తిరుపతిరావు. గట్ల వెంబడి మునగ, బెండ, కంది, బంతి వంటి పంటలు పండిస్తున్నారు. ఏ క్రిమి కీటకాలు చేనుపై వాలకుండా పకడ్బందీకా తన ప్రయత్నాలు తాను చేస్తూ పంటకు రక్షణ కల్పిస్తున్నారు. అంతే కాదు ఈ రక్షణ పంటల వల్ల నత్రజనిని విడిగా అందించాల్సిన పనిలేందంటున్నారు. యూరియా, డీఏపీ వాడకుండా నాణ్యమైన దిగుబడిని పొందవచ్చంటున్నారు.

ప్రస్తుతం రైతులంతా మితిమీరిన రసాయనాలను విపరీంతంగా సాగులో వినియోగిస్తున్నారు. తద్వారా పెట్టుబడులు పెరిగి, దిగుబడులు తగ్గుతున్నాయి. ఈ రసాయనాల ఆహారం తిన్న ప్రజలు అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు. ఈ క్రమంలో రైతు ఆరోగ్యంగా ఉండాలన్నా నేలలో పోషకాలు లభించాలన్నా వాతావరణాన్ని సంరక్షించాలన్నా ప్రకృతి సేద్యమే అసలైన వైద్యమని అధికారులు చెబుతున్నారు. అందుకే ప్రకృతి సేద్యాన్ని ప్రతి రైతు చేపట్టే విధంగా గ్రామస్థాయిలో సదస్సులు, అవగాహన కార్యక్రమాలు, క్షేత్ర ప్రదర్శనలు నిర్వహిస్తూ రైతులను చైతన్య పరుస్తున్నారు.

నేల తయారీ నుంచి విత్తు వేయడం, చీడపీడల నివారణ నుంచి పంట కోత ఆ తరువాత మార్కెటింగ్ వరకు రైతుకు కావాల్సిన అన్ని రకాల సలహాలను, సూచనలు అందిస్తున్నారు అధికారులు. మొక్క ఎదుగుదలకు, చీడపీడల నివారణకు అవసరమైన ప్రకృతి ఎరువులతో పాటు కషాయాల తయారీ పైన ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. అవసరమైన రైతులకు ఎరువులను అందిస్తూ సహాయపడుతున్నారు .

రసాయన విధానంలో ఎకరం విస్తీర్ణంలో వరి సాగు చేస్తే 25 నుంచి 30 వేల వరకు పెట్టుబడి ఖర్చు అవుతుంది. ఆదాయం 45 వేల వరకు వస్తుంది పెట్టుబడులు పోను రైతుకు మిగిలేది ఎంతో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదే ప్రకృతి విధానంలో ఎకరం విస్తీర్ణంలో వరి సాగు చేస్తే 15వేల రూపాయలకు మించి పెట్టుబడి కాదంటున్నారు అధికారులు. ఒక్క ఆవు ఉంటే చాలు 10 ఎకరాలు సాగు చేసుకోవచ్చని తెలిపారు. పెట్టుబడి ఖర్చులు తగ్గడమే కాదు ఇటు రైతుకు అటు వినియోగదారుడికి ఆరోగ్యం, ఆనందం లభిస్తుందంటున్నారు. 

Full View


Tags:    

Similar News