మన దేశంలో వ్యవసాయం ప్రధాన జీవనాధారం. మొదట్లో వ్యవసాయం పూర్తిగా గో ఆధారంగానే జరిగేది మొత్తం 72 రకాల గోజాతులు వుండేవి కానీ ప్రస్తుతం దాని సంఖ్య తిరగబడింది అంటే 27 వరకు మాత్రమే ఉన్నాయి. దీనికి కారణం పూర్తిగా వ్యవసాయాన్ని ఆధునిక పద్ధతులతో చేస్తూ రసాయనాలతో కూడిన ఎరువువులు వాడటమే. దీని ప్రభావంతో గో సంతతి తగ్గింది. దేశంలో రసాయన ఎరువులు వాడిని పంటను తినడం వల్ల ప్రజలంతా రోగాల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో గోఆధారిత వ్యవసాయానకి మళ్లీ ఆధరణ పెరిగింది. సుభాష్ పాలేకర్ దీని మీద పూర్తి సమయం కేటాయిస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు ఒడిశాకు చెందిన కమాలా పూజారీ అనే మిహిళా రైతు. ఆమెకృషికి గుర్తింపుగా భారదేశం పద్మశ్రీతో ఆమెను సత్కరించింది.
ఒడిశా, కోరాపుట్ జిల్లా, పత్రాపూట్ గ్రామానికి చెందిన కమలా పుజారి గిరిజన రైతు. ఆమె ఏమి చదువుకోలేదు స్కూలు అనేది ఒకటి ఉంటుందని కూడా తెలియని బాల్యం ఆమెది. ఆమెకు మాత్రమే కాదు ఆ గ్రామంలో అందరితదీ ఒకటే జీవనశైలి. రోజుకింత వండుకోవడం, పొలానికి వెళ్లి సేద్యం చేసుకోవడమే ఆమెకి తెలిసింది. అది కాకుండా ఆమెకి తెలిసన మరో సంగతి మన నేల మనకిచ్చిన వంగడాలనుకాపాడుకోవాలని మాత్రమే. అందుకే పండించిన ప్రతి పంట నుంచి కొంత తీసి విత్తనాలను భద్రంగా దాచేది. అలా ఇప్పటి వరకు ఆమె దగ్గర వందకు పైగా విత్తనాల రకాలున్నాయి. అవి మన నేలలో ఉద్భవించిన మొలకలు కాబట్టి ఇక్కడి వాతావరణాన్ని తట్టుకుంటాయి. రసాయన పురుగు మందులు చల్లాల్సిన అవసరమే ఉండదు.
మా విత్తనాలు కొనండి అధిక దిగుబడిని సాధించండి అని ఊదరగొట్టే విత్తనాల కంపెనీల ఆటలేవీ సాగవు ఆమె దగ్గర. తెగుళ్ల నివారణకు మా క్రిమి సంహారక మందులనే వాడండి అనే ప్రకటనలకూ మార్కెట్ లేదక్కడ. దేశీయతను పరిరక్షించడం ద్వారా బహుళ జాతి కంపెనీలకు ఎంట్రీ లేకుండా చేయగలగడమే ఆమె సాధించిన విజయం. జన్యుమార్పిడి పంటలు, డీ జనరేషన్ విత్తనాలు రాజ్యమేలుతూ, ఎరువుల కంపెనీలు, పెస్టిసైడ్ కంపెనీలు రైతుని నిలువునా దోచేస్తున్న ఈ రోజుల్లో భారత భవిష్యత్తు తరానికి ఆరోగ్యకరమైన విత్తనాలను దాచి పెట్టింది కమలా పూజారి. అందుకే దేశం ఆమెకు పద్మశ్రీ ప్రదానం చేసి గౌరవించింది.
దాదాపు పాతికేళ్ల కిందట ఒడిషాలోని జేపూర్ పట్టణంలో ఉన్న ఎం.ఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించింది. ఆ సదస్సుకు హాజరైన రైతు మహిళల్లో కమలాపూజారి కూడా ఉన్నారు. ఆమె శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలను అర్థచేసుకోవడంతో పాటు ఆచరణలోనూ పెట్టింది. పంటను గింజ కట్టడం ఆమె ఎప్పటి నుంచో చేస్తున్న పనే. అయితే ఆ సదస్సులో ఆమె కొత్తగా రసాయన ఎరువుల అవసరం లేని పంటలనే పండించాలని తెలుసుకున్నారు. మంచి విత్తనాన్ని దాచడం అనేది తాను ఎప్పటి నుంచో ఆచరిస్తున్నదే కొత్తగా చేయాల్సింది ప్రతి విత్తనాన్ని దాచి ఉంచడం. సేంద్రియ వ్యవసాయం చేయమని పదిమందికి తెలియజేయడం.
కమలా పూజారి నిరక్షరాస్యురాలైన మారుమూల గిరిజన మహిళ. అయితేనేం పాత్రాపుట్‌లో తనకున్న కొద్దిపాటి పొలంలో దేశీయ వంగడాలను ఉపయోగించి అద్భుతమైన ఫలితాలను రాబడుతోంది. తద్వారా అంతర్జాతీయ ఖ్యాతి పొందింది. పరిసర గ్రామాల నుంచి ప్రధానంగా దేశీయ వరి విత్తనాలను సేకరించి, సంరక్షించి మంచి దిగుబడులు సాధించారు. ఇప్పటివరకు వంద రకాల దేశీయ వరి విత్తనాలతో పాటు పసుపు విత్తనాలను కూడా సంరక్షించారు. వాటిని సంప్రదాయ పద్ధుతులతోనే సాగు చేస్తున్నారు.
వాడ వాడలా జనాన్ని సమీకరించి దేశీయ విత్తనాలనుకాపాడాల్సిన అవసరాన్ని తెలుపుతున్నారు. రసాయన ఎరువులను బహిష్కరించడానికి కూడా పిలుపునిచ్చారు కమల. పత్రాపూట్‌లో తన ఊళ్లో ఇంటింటికీ తిరిగి చెప్పారు. పరిసర గ్రామాలకు కూడా వెళ్లి సేంద్రియ చైతన్యం తెచ్చారు. కోరాపూట్ పక్కనే ఉన్న సబరంగపూర్ జిల్లాలోని అనేక గ్రామాలు ఆమె బాటపట్టాయి. గ్రామస్థులను సమీకృతం చేసి , స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ సహకారంతో విత్తనాల బ్యాంక్ నెలకొల్పరు కమల. రసాయన ఎరువుల పంజా తమ ఆదివాసీ ప్రాంతాల మీద పడనివ్వకుండా ఆపిన ధీర ఆమె. బీజంలో జీవం ఉంటుంది. గింజలో ఉన్న పునరుత్పత్తి చేసే గుణాన్ని కాపాడుకోవాలి డీ జర్మినేషన్ గింజల వెంట పరుగెత్తకుండా జర్మినేషన్ సీడ్‌ను రక్షించుకోవాలనేది స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రధాన ఉద్దేశం.
సేంద్రియ పంటతో పాటు కమాపూజారీకి అవార్డుల పంట కూడా వరించింది. స్వామినాథన్ ఫౌండేషన్ 2002లో సౌత్ ఆఫ్రికా, జోహాన్నెస్ బర్గ్‌లో సేంద్రియ వ్యవసాయం మీద నిర్వహించిన సదస్సుకు ఆమెకు ఆహ్వానం వచ్చింది. ఆమె తన అనుభవాలను ఆ సదస్సులో ప్రపంచ దేశాల ప్రతినిధులతో పంచుకున్నారు. విశేషమైన ప్రశంసలందాయామెకి. ఈక్వేటర్ ఇనిషియేటివ్ అవార్డుతో గౌరవించిందా సదస్సు. ఆ తరువత ఏడాది మన కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో జరిగిన వ్యవసాయ సదస్సులో కమలా పూజారిని కృషి విశారద బిరుదును ప్రదానం చేసింది. ఒడిషా రాజధాని భువనేశ్వర్‌లో ఉన్న ఒడిషా యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ 2004లో కమాలా పూజారిని ఉత్తమ మహిళా రైతు పురస్కారంతో గౌరవించింది. ఈ ఏడు భావి తరాలకు అన్నానికి భరోసా కల్పించిన ఆ తల్లికి పద్మశ్రీ పురస్కారాన్ని తన చేతుల మీదగా ప్రదానం చేశారు రాష్ట్రపతి.
అధిక దిగుబడులకు ఆశపడి, హైబ్రిడ్ రకాల విత్తనాలపై ఆధారపడి, విచ్చలవిడిగా రసాయనాలు చల్లి పంటలు సాగు చేసే రైతులు కమాలా పూజారి ని చూసి ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కొన్నేళ‌్లుగా వందల దేశీయ వరి వంగడాలను సేకరించి నిల్వచేసి, పరిరక్షిస్తున్న ఈ మహిళా రైతు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.