Narayanpet District Farmers Problems: అధికారుల నిర్లక్ష్యం.. రైతులకు శాపం
Narayanpet District Farmers Problems : కూతవేటు దూరంలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నా అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. ఏడాదిన్నర కాలంగా ఓ ఎత్తిపోతల పథకం నిరుపయోగంగా ఉండటంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. తమకు భూములున్నా సాగు చేసుకోలేని దుస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
జూరాల ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ద్వారా నారాయణపేట జిల్లా నర్వ మండలం చంద్ర గట్టు ఎత్తిపోతల పథకాన్ని 2005 లో ఏర్పాటు చేశారు. ఈ లిఫ్ట్ ద్వారా నాగిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన 5000 ఎకరాలకు గాను 1500 ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారు. ఏడాదిన్నర కాలంగా ఈ లిఫ్ట్ స్టాటర్లు కాలిపోవడంతో పని చేయటం లేదు. దీంతో గడచిన రెండేళ్లుగా ఆయకట్టు రైతులు పంటలు పండించుకో లేకపోతున్నారు.
అయితే లిప్టు మరమ్మతు కోసం 15 నుంచి 20 లక్షల వరకు ఖర్చు అవుతుందని రైతులు వాపోతున్నారు. ఇంత పెద్ద మొత్తం ఖర్చు పెట్టే స్తోమత తమకు లేదని అధికారులు స్పందించి లిప్టు బాగుచేయాలని కోరుతున్నారు. లేదంటే పంట పొలాలన్ని బీడు భూములుగా మారే ప్రమాదం ఉందన్నారు.
వర్షాకాలం ప్రారంభం కావడంతో రైతులు లిప్టు రిపేరు పనులపై ఆశ పడుతున్నారు. లిఫ్ట్ ను మరమ్మతు చేసి తమ పొలాలకు సాగునీరు అందించాలని ఆయకట్టు రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా లిప్టు మరమ్మతు చేసి 1500 ఎకరాల ఆయకట్టును కాపాడాలని నాగిరెడ్డి పల్లి గ్రామస్థులు కోరుతున్నారు.