సాగుబాటలో...సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
ఆయనో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. నెలవారీ వేతనం వేలల్లోనే ఉంటుంది. అయినా జీవితంలో ఇంకా ఏదో సాధించాలనే తపన. ప్రజలకు ప్రకృతి ఎరువులతో పండిన ఆకుకూరలు, కూరగాయలు అందించాలనేది లక్ష్యం .
ఆయనో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. నెలవారీ వేతనం వేలల్లోనే ఉంటుంది. అయినా జీవితంలో ఇంకా ఏదో సాధించాలనే తపన. ప్రజలకు ప్రకృతి ఎరువులతో పండిన ఆకుకూరలు, కూరగాయలు అందించాలనేది లక్ష్యం . రైతులు తక్కువ ఖర్చుతో లాభదాయకమైన ఆధాయాన్ని ఆర్జించలన్నది ధ్యేయం. ఇంకేముంది ఒకవైపు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తూనే మరోవైపు వ్యవసాయంపై దృష్టి సారించాడు. పాలేకర్ ప్రకృతి విధానాలను అనుసరిస్తూ నలుగురికి మార్గదర్శకంగా నిలుస్తున్న రైతు రాజేశ్‌పై నేలతల్లి ప్రత్యేక కథనం.
హైదరబాద్ లో సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న రాజేశ్ షాబాద్ మండలం తాళ్ళపల్లి గ్రామంలో సాగు నిమిత్తం రెండు ఎకరాల పొలాన్ని కొనుగోలు చేసాడు. ఈ 2 ఎకరాల స్థలంలోనే 30 రకాల కూరగాయలు ఆకుకూరలను , 30 రకాల పండ్ల మొక్కలను పండిస్తున్నాడు. ప్రకృతి వ్యవసాయ పితామహుడు పాలేకర్ ప్రకృతిసాగు విధానాలకు, ఆధునిక పద్ధతులను జోడించి సాగులో తన సత్తాను చూపుతున్నాడు ఈ యువరైతు.
కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో పాటు 5-6 గుంటల్లో దేశీ వరిని పండిస్తున్నాడు ఈ యవరైతు. అతి తక్కువ నీటితో శ్రీ వరి పద్ధతులను పాటిస్తూ మైసూర్ మల్లిగ వరి రకాన్ని సాగు చేసాడు. మంచి దిగుబడిని సాధించాడు. ఒక్కో మొక్కకు 30-40 పిలకలు దిగుబడి వచ్చిందని రైతు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు.
ఏ పంట సాగు చేయాలనుకున్నా రైతుకు ప్రధానంగా సాగు నీటి సమస్య ఎదురవుతుంది. కానీ తక్కువ నీటితో ఎక్కువ పంటలను పండిస్తూ ఈ రైతు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. కేవలం ఒక ఇంచు నీటితో ఇన్ని రకాల పంటలను పండిస్తున్నాడు రాజేశ్. డ్రిప్ విధానాన్ని అనుసరించి మొక్క మొక్కకు ఎంతో జాగ్రత్తకు నీటిని అందిస్తున్నాడు. నేలలో తేమను నిలుపుకునేందుకు సహజ సిద్ధమైన మల్చింగ్ విధానాలను అనుసరిస్తున్నారు. తద్వారా వారం వరకు మొక్కలకు నీరు ఇవ్వకున్నా ఎలాంటి ఇబ్బందులు రావటున్నాడు ఈ రైతు. అంతే కాకుండా మొక్కకు రోగనిరోధక శక్తి పెరుగుతుందంటున్నాడు.
ప్రకృతి వ్యవసాయానికి మూలాధారం ఆవు. అందుకే పొలంలోనే దేశీ గోవు కోసం షెడ్డును ఏర్పాటు చేసుకున్నాడు. ఆవు నుంచి వచ్చే వ్యర్థాల సేకరణకు ప్రత్యేక విధానాలను అనుసరిస్తున్నాడు ఈ యువరైతు. జీవామృతం తయారీ కోసం ప్రత్యేకంగా వెయ్యి లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకును పొలంలోనే నిర్మించుకున్నాడు. ఆవునుంచి వచ్చే వ్యర్థాలను ట్యాంకుల ద్వారా సేకరించి జీవామృతాన్ని తయారు చేసుకుని మోటారు సహాయంతో డ్రిప్ ద్వారా పంటకు అందిస్తున్నాడు తన 2 ఎకరాల పొలానికి 15 రోజులకు ఒకసారి 400 లీటర్ల జీవామృతాన్ని అందిస్తున్నాడు రాజేశ్ దీని ద్వారా ఎరువులను నేరుగా పంటకు అందించడంతో పాటు కూలీల సమస్యను అధిగమిస్తున్నాడు.
పంట సాగుకు కావాల్సిన విత్తనాన్ని తానే స్వయంగా పండించుకుంటున్నాడు ఈ రైతు. బీర, సొర, చిక్కుడుతో పాటు ఆకుకూరల విత్తనాలను హైడెన్సిటీ విధానంలో పండిస్తూ వాటినే విత్తనాలనుగా తయారు చేసుకుని పంట సాగుకు వినియోగిస్తున్నాడు. ప్రతీ రైతు విత్తనం కోసం మార్కెట్‌ల మీద ఆధారపడకుండా తక్కువ ఖర్చుతో గుంటన్నర స్థలంలో విత్తనాన్ని అభివృద్ధి చేసుకోవాలంటున్నాడు రాజేశ్. తద్వారా నాణ‌్యమైన విత్తనాన్ని రైతు పొందడంతో పాటు సాగు ఖర్చులను తగ్గించుకోవచ్చంటున్నాడు.
సాధారణంగా ప్రతీ రైతు ఎక్కువ విస్తీర్ణంలో ఒకే పంటను సాగు చేసి వాటికి మార్కెట్‌లో గిట్టుబాటు ధర రాక నష్టాన్ని చవి చూడాల్సి వస్తోంది. అలా కాకుండా ప్రతీ రైతు ఒకే విస్తీర్ణంలో ఎక్కువ పంటలు వేసుకుంటే ఒకదానికి మార్కెట్ లేకున్నా మరో పంట ద్వారా ఆదాయం లభిస్తుందంటాడు ఈ రైతు. ఇలా తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలను పండించడం మాత్రమే కాకుంగా మార్కెటింగ్ , కూరగాయల బాక్స్ ఫ్యాకింగ్ లోనూ కొత్త విధానాలను అనుసరిస్తున్నాడు రాజేశ్ లాభదాయకమైన సాగు వైపు అడుగులు వేస్తున్నాడు. రైతులు ఎవ్వరికైనా సాగులో సందేహాలు ఉంటే ఉచితంగా వారికి తన క్షేత్రంలోనే శిక్షణను అందిస్తానంటున్నాడు రాజేశ్. చిన్న సన్నకారు రైతు సైతం తక్కువ ఖర్చుతో లాభదాయకమైన ఆదాయం పొందాలన్నది ఈ యువరైతు ధ్యేయం అందుకోసమే తన పొలాన్నే ఓ మోడల్‌గా తీర్చిదిద్దుతున్నాడు. తోటి రైతుకు సహాయం చేయాలనే ఆలోచనతో ముందుకు కదులుతున్నాడు.