పెట్టిన పెట్టుబడికి డబుల్ ఆదాయం.. బీర సాగులో రాణిస్తున్న యువరైతు
Ridge Gourd Cultivation: ఏడాది పొడవునా అన్ని కాలాల్లోనూ గిరాకీ ఉంటూ వినియోగదారులకు అందుబాటులో ఉండేవి కూరగాయలు.
Ridge Gourd Cultivation: ఏడాది పొడవునా అన్ని కాలాల్లోనూ గిరాకీ ఉంటూ వినియోగదారులకు అందుబాటులో ఉండేవి కూరగాయలు. ముఖ్యంగా తీగజాతి కూరగాయలైన సొర, పోట్ల, దోస, గుమ్మడి, బీరకాయలకు ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. ఆ గిరాకీని తెలుసుకున్న కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఓ అభ్యుదయ రైతు ఉన్నత చదువులు చదివి కూడా అందరిలాగా ఉద్యోగాల వెంట పరిగెత్తకుండా తనకున్నకొద్దిపాటి భూమిలో కూరగాయలు సాగు చేస్తున్నాడు. సేంద్రియ విధానంలో బీర సాగుచేస్తూ లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతున్నాడు యువరైతు వస్రం నాయక్.
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రానికి చెందిన యువరైతు వస్రం నాయక్ గ్యాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఉన్నత చదువులు చదివినా తోటి వారిలా ఉద్యోగాల వేటలో పడకుండా స్వయం ఉపాధి పొందాలనే ఉద్దేశంతో సంప్రదాయ వ్యవసాయం వైపు మొగ్గు చూపాడు. తనకున్న రెండు ఎకరాలలో బీరకాయ సాగు మొదలు పెట్టాడు. నాణ్యమైన దిగుబడి రాబట్టేందుకు పొలంలో శాశ్వత పందిరిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆధునిక సేద్యపు విధానాలైన డ్రిప్ విధానం , మల్చింగ్ ను సాగులో వినియోగించుకోవడం వల్ల నీటి వినియోగంతో పాటు సాగు ఖర్చులు తగ్గాయంటున్నాడు ఈ యువరైతు. గడిచిన మూడు సంవత్సరాలగా తీగ జాతికి చెందిన బీర సాగులో ఆశాజనకమైన దిగుబడులు అందుతున్నాయని చెబుతున్నాడు. ధరల్లో కాస్త హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ మంచి దిగుబడి అందివస్తుండటంతో లాభదాయకమైన ఆదాయమే అందుతోందని రైతు చెబుతున్నాడు.
రెండు ఎకరాల్లో బీర సాగుకు అయ్యే ఖర్చు 25వేల రూపాయలు అయితే పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ఆదాయం బీర సాగులో వస్తోందని వస్రం నాయక్ తెలిపాడు. బీర సాగుకు అవసరమైన పందిరి, మల్చింగ్ కోసం ఉద్యాన శాఖ తరఫున 50 శాతం సబ్సిడీ లభిస్తుందని, అధికారులు క్షేత్ర స్థాయిలో వచ్చి పర్యవేక్షించడం , వారి సలహాలు సూచనలు పాటించి సాగు చేయడం వల్ల సేద్యం తనకు కలిసివస్తోందని యువరైతు హర్షం వ్యక్తం చేస్తున్నాడు. యువత ఉద్యోగాలవేటలోపడి నిరాశ నిస్పృహలకు లోనవకుండా వ్యవసాయం వైపు మొగ్గు చూపితే అధిక లాభాలుగడిస్తూహాయిగా జీవితం గడపవచ్చని అంటున్నాడు ఈ యువరైతు.
బీర సాగుకు ఎక్కువగా పండు ఈగ బెడద ఉంటుందని దీని కోసం రసాయినికంగా కాకుండా ఎల్లోస్టిక్స్, వైట్ స్టిక్స్ లేదా సోలార్ ప్యానెల్ తో అమర్చబడిన లైట్ ట్రాప్స్ ను వాడి కొంత మేర నివారించుకోవచ్చని రైతు చెబుతున్నాడు. బీర పంట వేసిన తర్వాత ఖచ్చితంగా పంట మార్పిడి చేయాలని, లేదంటే చీడ పీడలు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని ఉద్యానవన శాఖ అధికారులు సూచిస్తున్నారు.