Ridge Gourd Cultivation: వరిలో అంతర పంటగా బీర సాగు
Ridge Gourd Cultivation: వరిలో అంతర పంటగా బీరకాయ సాగు చేస్తు ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని కిష్టంపేట గ్రామ రైతులు.
Ridge Gourd Cultivation: వరిలో అంతర పంటగా బీరకాయ సాగు చేస్తు ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని కిష్టంపేట గ్రామ రైతులు. పెట్టుబడి తక్కువ లాభాలు ఎక్కువ ఉండటం, నాటిన 30 నుండి 45 రోజుల్లోనే రైతుకు పంట చేతికి అందడంతో రైతుకు బీరసాగు కలిసివస్తోంది. పండిన పంటను సులువుగా స్థానిక మార్కెట్లో అమ్మడం రైతుకు సులభ తరం కావడం వల్ల గత కొన్ని సంవత్సరాలు గా కిష్టంపేట గ్రామంలో కొంత మంది రైతులు సుమారు 200 ఎకరాలలో అంతర పంటగా బీర కాయ సాగు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో వరి పంటలో జోరుగా సాగుతున్న బీరకాయ సాగుపై ప్రత్యేక కథనం.
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని కిష్టంపేట గ్రామ రైతులు వినూత్న సాగుకు తెరలేపారు. పెద్దగా శ్రమ, నీరు, ఎరువులు అవసరం లేని పంట బీర కావడంతో, అధిక సంఖ్యలో రైతులు వరిలో బీరను అంతపర పంటగా సాగు చేస్తున్నారు. గత కొంత కాలంగా సుమారు 200 ఎకరాల్లో ఇదే విధానంలో సీజన్‌ను బట్టి పలు రకాల కూరగాయలను వరిలో అంతర పంటగా సాగు చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు కిష్టంపేట రైతులు.
వరి నాట్లు వేసిన వారం, పది రోజుల తర్వాత పొలాల గట్ల వెంబడి బీర విత్తనాలు నాటుతున్నారు. అనంతరం వారం, పది రోజుల్లో అవి మొక్కలుగా ఎదుగుతాయి. ఎదిగిన మొక్కలకు, తీగ పారడం కోసం ఆసరారా కర్రలను ఏర్పాటు చేస్తారు. ఈ బీర పంట కు ప్రత్యేకంగా ఎరువులు అవసరం ఉండదు. వరి పంటకు వేసిన ఎరువులు, నీరు బీరకు లభింస్తాయి. కేవలం 30 నుంచి 45 రోజుల వ్యవధిలోనే బీర కాయ కాపుకు వస్తుంది. దీంతో, వరి పంట కన్నాముందే బీర ద్వారా రైతులు ఆదాయం పొందుతున్నారు. ఎకరాకు సుమారు 10 క్వింటాళ్ల బీరకాయ కాపు వస్తుండగా, స్థానిక మార్కెట్లో అమ్ముతూ ఎకరాకి 20 వేల నుండి 30 వేల వరకు అదనంగా ఆదాయం పొందుతున్నారు.