Red Okra Cultivation: ఎర్రబెండలో మెండుగా పోషకాలు

Red Okra Cultivation: ఆరోగ్యకరమైన కూరగాయల్లో బెండ ముఖ్యమైనది. దేశవ్యాప్తంగా అత్యధికంగా సాగులో ఉన్న కూరగాయ కూడా ఇదే.

Update: 2022-05-05 09:06 GMT

Red Okra Cultivation: ఎర్రబెండలో మెండుగా పోషకాలు

Red Okra Cultivation: ఆరోగ్యకరమైన కూరగాయల్లో బెండ ముఖ్యమైనది. దేశవ్యాప్తంగా అత్యధికంగా సాగులో ఉన్న కూరగాయ కూడా ఇదే. బెండలో ఫైబర్ శాతం అధికంగా ఉంటుంది. అంతే కాదు ఇందులో పోషక పదార్ధాలు మనోవికాసానికి తోడ్పడతాయి. గుండెజబ్బులు, మధుమేహం, మలబద్ధకం, స్థూలకాయం వంటి వ్యాధుల నియంత్రణలో బెండ సమర్థవంతంగా తోడ్పడుతాయి. బెండలో సాధారణంగా రైతులు అందరూ పచ్చ రకాలనే ఎక్కువగా సాగు చేస్తున్నారు. కేరళ, కేరళ సరిహద్దులను ఆనుకుని ఉన్న కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో తెల్ల బెండను రైతులు పండిస్తున్నారు. పచ్చ. తెలుపు రంగుకు తోడు ఈ మధ్యకాలంలో రైతులు కాశీ లాలిమ అనే ఎరుపు బెండ రకాన్ని పండించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇండియన్ వెజిటబుల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ ఐసీఏఆర్ ఈ ఎరుపు బెండ రకాన్ని విడుదల చేసింది. అతి తక్కువ కాలంలోనే ఈ రకం బెండ జనాధరణ పొందింది. ప్రస్తుతం ఎర్ర బెండ సాగు అన్ని రాష్ట్రాలకు విస్తరించింది.

ఐసీఏఆర్‌-ఇండియన్ వెజిటేబుల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన శాస్త్రవేత్తలు 8 నుంచి 10 సంవత్సరాల పరిశోధనలు జరిపి 2019లో కాశీ లాలిమ పేరుతో ఎర్ర బెండ రకాన్ని విడుదల చేశారు. మొదటి సారిగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఈ రకం బెండ పెంపకాన్ని ప్రారంభించారు. రైతులకు మినీకిట్లు ఇచ్చి ప్రోత్సహించారు. ఆ తరువాత ఛత్తీస్‌ఘడ్‌, గుజరాత్, మధ్యప్రదేశ‌‌, మహారాష్ట్ర, దక్షిణాది రాష్ట్రాలకు సాగు విస్తరించింది. ఈ రకంలో కాయ రంగు ఎరుపుగా ఉంటుంది. సాధారణ బెండలో గల పచ్చ రంగుకి కారణమైన క్లోరోఫిల్ అనే పిగ్మెంట్‌కి బదులుగా ఎరుపు రంగు కాయల్లో ఆంథోసైనిన్ అనే పిగ్మెంట్‌ ఉంటుంది. కాయ రంగుకి కారణమైన ఈ పిగ్మెంట్ యాంటి-యాక్సిడెంట్ లక్షణాలు కలిగి ఆరోగ్యానికి దోహదపడతాయి. ఆంథోసైనిన్‌తో పాటు , కాల్షియం, ఐరన్ వంటి ఖనిజ లవణాలు కూడా ఈ బెండలో సాధరణ బెండ కంటే అధికంగా ఉంటాయి. ఎర్ర బెండ రకం మధ్యరకం ఎత్తు కలిగి, పొట్టి కణుపులను కలిగి ఉంటుంది. కాండం, ఇతర భాగాలు కూడా కొంత వరకు ఎర్ర రంగును కలిగి ఉంటాయి. ఈ రకం బెండ పల్లాకు తెగులు, ఆకుముడత వంటి వైరస్‌ రోగాలను తట్టుకుంటుంది. ఎండాకాలం, ఖరీఫ్‌ సీజన్‌లో సాగు చేసుకోవడానికి అనుకూలం.

ప్రస్తుతం ఎర్రబెండకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ బెండను వేసవిలో, వర్షాకాలంలోనూ విత్తుకోవచ్చు. వర్షాకాలంలో కన్నా వేసవిలో విత్తే పంటను దగ్గర దగ్గరగా విత్తుకోవాలి. నేలను 4 నుంచి 5 సార్లు బాగా దున్నాలి. పశువుల ఎరువు వేయాలి. ఎర్రబెండ విత్తిన వెంటనే నీరు పెట్టాలి. వేసవి కాలంలో ప్రతి రెండు లేదా మూడు రోజులకు ఒకసారి నీటి తడులు అందించాలి. ఎర్ర బెండ విత్తనం ధర కిలో రూ.3000 వరకు ఉంటుంది. ఈ ధర ఆకుపచ్చ బెండ విత్తనం కన్నా ఎక్కువ. ఇవి నాటిన 45 రోజులకు మొదటికోతను ఇస్తుంది. మొత్తం 60 కోతలు 5 మాసాల కాల పరిమితిలో తీయవచ్చు. సాధారణ బెండ 30 కోతలు మాత్రమే ఇస్తుంది. సేంద్రియ పద్ధతులతో వీటిని పండిస్తే మంచిత మెరకుగైన ఫలితాలు అందుతాయి. ఒక ఎకరాకు సుమారుగా వేసవిలో 50 క్వింటాళ్లు, వర్షాకాలంలో 80 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఇలాంటి వైవిధ్యమైన పంటలను సాగు చేసి రైతులు మార్కెట్‌లో మంచి ధరకు పంటను అమ్ముకుని లాభాలను పొందవచ్చు.

Full View


Tags:    

Similar News