RAS Fish Farming: ఆర్‌ఏఎస్ పద్ధతిలో చేపల పెంపకం
RAS Fish Farming: ఆధునిక పద్ధతులు రైతులకు అధిక ఆదాయాన్ని ఆర్జించి పెడుతున్నాయి.
RAS Fish Farming: ఆధునిక పద్ధతులు రైతులకు అధిక ఆదాయాన్ని ఆర్జించి పెడుతున్నాయి. ముఖ్యంగా తక్కువ స్థలంలో తక్కువ నీటితో అతి తక్కువ మంది కూలీలతో , సేంద్రియ విధానాలు అనుసరిచి చేస్తున్న చేపల పెంపకం ద్వారా రైతులు ఆర్ధికాభివృద్ధిని సాధింస్తున్నారు. ప్రారంభంలో పెట్టుబడి కాస్త ఎక్కువే అయినా ప్రతినెల ఉద్యోగి మాదిరి ఆదాయం లభిస్తుండటంతో రైతులు ఇటువైపుగా మొగ్గుచూపుతున్నారు. చుట్టుపక్కన నదులు కానీ, చెరువులు కానీ, వరదనీటి కాలువలు కానీ లేకుండానే కేవలం బోరు నీటితో ఆధునిక పద్ధతులను అవలంభిస్తూ చేపల పెంపకాన్ని విజయవంతంగా చేసి చూపిస్తున్నారు. అదే కోవలోకి వస్తారు హైదరాబాద్ లోని గాజులరామారంకు చెందిన జోసెఫ్. రీసర్కులేటరీ ఆక్వా కల్చర్ సిస్టమ్ పద్ధతిలో 200 గజాల విస్తీర్ణంలో ఐదు ట్యాంకులను నిర్మించుకుని చేపల పెంపకాన్ని చేపట్టడం ద్వారా మంచి ఆదాయం పొందుతున్నారు.
మూడేళ్లు RAS పద్ధతిపై పరిశోధనలు చేశారు. అందులో ఉన్న సాదకబాదకాలను తెలుసుకున్నారు. మత్స్య సంపదను పెంచడానికి ఈ పద్ధతి ఎంతగానో ఉపయోగపడుతుందనే నిర్ణయానికి వచ్చి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని RAS పద్ధతిలో చేపల పెంపకం మొదలు పెట్టారు. పూర్తి సురక్షితమైన పద్ధతుల్లో మారుతున్న వాతావరణానికి అనుగుణంగా చేపలను పెంచుతున్నట్లు జోసెఫ్ తెలిపారు. చేపలకు ఎప్పుడు ఏం కావాలో వాటిని అందిస్తున్నారు. ట్యాంకుల్లో ఏర్పడే బయో వ్యర్థాలను తొలగించేందుకు డ్రమ్ ఫిల్టర్లు, బయో ఫిల్టర్లు, ఆక్సీజన్ స్థాయిలను పెంచడానికి ఏరియేటర్లు, చేపల వ్యర్థాల నుంచి వచ్చే అమ్మోనియాను నియంత్రించేందుకు బయో రియాక్టర్లను వినియోగిస్తున్నాట్లు జోసెఫ్ చెప్పారు. అదే విధంగా చేపలు వైరస్ ల బారిన పడకుండా రోగకారకమైన సూక్ష్మ, బ్యాక్టీరియాను ఎప్పటికప్పుడు సంహరించేందుకు అల్ట్రావైలెంట్ ఫిల్టర్స్ వాడుతున్నారు.
RAS పద్ధతిలో ప్రధానంగా మనకు కనిపించేవి రెండు ట్యాంకులు. అవి నర్సరీ ట్యాంకులు, కల్చర్ ట్యాంకులు. నర్సరీ ట్యాంకుల్లో చిన్న చేప పిల్లలను తీసుకువచ్చి అవి బరవు వచ్చే వరకు అందులోనే పెంచుతారు. ఆ తరువాత ఒక నిర్థిష్ట బరువు పెరిగిన చేప పిల్లలను కల్చర్ ట్యాంకుల్లో పెంచుతారు. ఈ పద్ధతిలో ట్యాంకుల నిర్మాణమే అత్యంత ప్రధానమైన అంశం అని అంటారు ఈ రైతు. ప్రస్తుతం జోసెఫ్ ఐదు సెల్ఫ్ క్లీనింగ్ ట్యాంకులలో చేపలను పెంచుతున్నారు.
సంప్రదాయ పద్ధతుల్లో చెరువుల్లో పెరిగే చేపలకు RAS పద్ధతిలో పెరిగే చేపలకు చాలా వ్యత్యాసం ఉంటుందంటున్నారు జోసెఫ్. ఈ RAS పద్ధతిలో చేపలకు కావాల్సిన ఆహారం సమయానుకూలంగా అందుతుంది. చేపల పెరుగుదలకు అనుగుణంగా ఉష్ణోగ్రతలను మొయిన్‌టేన్ చేయవచ్చు. అంతే కాదు చేపల వ్యర్థాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు ప్రత్యేక పద్ధతులను అవలంభించవచ్చు. చేపలు ఎలాంటి వ్యాధులబారిన పడకుండా కాపాడుకోవచ్చంటున్నారు. మరీ ముఖ్యంగా చేపలకు ఎలాంటి కెమికల్స్ అందించకుండా పూర్తి సేంద్రియ పద్ధతుల్లోనే పెంచుతున్నారు. తద్వారా ఇవి ఆరోగ్యంగా , రుచికరంగా ఉంటాయని తెలిపారు.
చేపల పెంపకంలో పాండ్ కల్చర్, కేజ్ కల్చర్ అని కొత్త పద్ధతులు వచ్చినా వీటన్నింటిని మించినది ఈ RAS పద్ధతి అని అంటున్నారు ఈ రైతు. ఈ విధానంలో పంట నష్టపోతామని భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. సరైన జాగ్రత్తలు , మెళకువలు పాటిస్తే లాభాలు తప్పక వస్తాయంటున్నారు. సంప్రదాయ పద్ధతుల్లో కేజీ చేప రావడానికి 2 కేజీల మేత ఖర్చు వస్తే ఈ పద్ధతిలో కేజీ చేప తయారవడానికి 200 గ్రాముల మేత సరిపోతుందంటున్నారు. ఇక చాలా మందిలో RAS పద్ధతి అంటే చాలా ఖర్చుతో కూడుకున్నదనే అపోహ ఉందని అయితే ప్రారంభ పెట్టుబడి తరువాత పెద్దగా ఖర్చు ఏమీ ఉండదంటున్నారు. తక్కువ నీరు, తక్కువ స్థలం, అతి తక్కువ మంది కూలీలతో ఆర్గానిక్ పద్ధతిలో చేపలను పెంచవచ్చంటున్నారు. ఆరు, ఏడు నెలల్లోనే చేపలు పట్టుబడికి వస్తాయంటున్నారు.
కల్చర్ ట్యాంకుల్లో పెరుగుతున్న పెద్ద చేపలకు సమాంతరంగా నర్సరీ ట్యాంకుల్లో చిన్న చేప పిల్లను పెంచుతున్నారు జోసెఫ్. వాటిని పెంచే క్రమంలో చిన్న చేప పిల్లలకు హై ప్రోటీన్ ఫీడ్ అందిస్తున్నారు. తద్వారా చేపల త్వరగా పట్టుబడికి వస్తాయంటున్నారు. ఇక ఒక క్యూబిక్ మీటర్ నీటిలో అంటే వెయ్యి లీటర్ల నీటిలో 50 కేజీల చేపలను పెంచితే ఈ పద్ధతిలో ఏడాదికి 5 నుంచి 6 టన్నుల వరకు దిగుబడిని తీయవచ్చని చెబుతున్నారు. హైడెన్సిటీ లో పెంచితే 7 నుంచి 8 టన్నుల వరకు వస్తుందంటున్నారు. అందుకే రెండు సెంట్ల భూమి ఉన్నా 7 నుంచి 8 లక్షల రూపాయల పెట్టుబడితో సంవత్సరానికి 10 నుంచి 12 లక్షల వరకు ఆదాయం ఈ పద్ధతిలో పొందవచ్చంటున్నారు. కానీ 365 రోజులు విద్యుత్ సరఫరా నిలిచిపోకుండా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.