Farmers: ఊపందుకున్న వ్యవసాయ పనులు
Farmers: వానాకాలం ఆరంభంలోనే వర్షాలు కురవడంతో పుడమితల్లి పులకించిపోతోంది.
Farmers: వానాకాలం ఆరంభంలోనే వర్షాలు కురవడంతో పుడమితల్లి పులకించిపోతోంది. అన్నదాతలు ఆత్రంగా తడిసిన నేలలో విత్తనాలు నాటుతున్నారు. పొలాలలో దుక్కులు దున్నుతూ విత్తనాలు వేస్తున్నారు. మరికొందరు నాటు వేసేందుకు నేలతల్లిని సిద్ధం చేస్తున్నారు. ఇన్నాళ్లు ఎండలతో సతమతం అవుతున్న జనాలకు తొలకరి జల్లులు కాస్త ఊపిరిని కలిగించాయి.
రోహిణి కార్తెలో భానుడు తన ప్రతాపం చూపించాడు. దాంతో మృగశిర కార్తెకు ముందు రోజు నుంచి కురిసిన వర్షాలకు నేల తల్లి పులకరించింది. ఒకవైపు నైరుతి రుతుపవనాలు, మరోవైపు అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు వాతావరణం చల్లబడింది. ఎండలతో అల్లాడిన జనాలకు వానలు కాస్తంత ఉపశమనం కలిగింది. అంతేకాదు తొలకరి జల్లులతో రైతులు వ్యవసాయ పనులు తిరిగి ప్రారంభించారు.
రుతుపవనాలతో వర్షాలు కురుస్తుండడంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. దుక్కులు దున్ని పత్తి విత్తనాలు నాటుతున్నారు. పత్తితో పాటు వరి సాగు చేసేందుకు పొలాలను సిద్ధం చేస్తున్నారు. పెసర, కంది, మినుము పంటను కూడా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం కురిసిన వర్షాలతో నేలతల్లి పులకరించింది.
ఒకవైపు అతివృష్టి.. మరోవైపు అనావృష్టిలతో పంటల దిగుబడి తగ్గిపోయి పెట్టిన పెట్టుబడి కూడా చేతికందే పరిస్థితి లేదని వాపోతున్నారు రైతులు. నకిలీ విత్తనాలతో రైతులను మోసాలు చేస్తూనే ఉన్నారు. మరోవైపు పెరుగుతున్న ఎరువుల ధరలు ఇంకోవైపు వ్యవసాయ కూలీలు రేట్లు పెరగడంతో రోజు రోజుకి వ్యవసాయంలో తమ రెక్కల కష్టం కూడా దక్కడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
అరుగాలం శ్రమించి పండించిన పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో అప్పుల పాలవుతున్నామని రైతులు వాపోతున్నారు. సరైన సమయంలో ఎరువులను అందుబాటులోకి తెచ్చి నకిలీ విత్తనాల మోసాలని అరికట్టాలని కోరుతున్నారు. ఇక గతేడాది ప్రకటించిన గిట్టుబాటు ధరను ఈ ఏడాదైనా అమలు చేయలని ప్రభుత్వాన్ని రైతులు వేడుకుంటున్నారు.