అమరావతిలో సాగు బహు బాగు - పల్సస్ సీఈవో డాక్టర్ గేదెల శ్రీనుబాబు
-ప్రత్యేక వ్యవసాయ మండలిగా మార్చితే అద్భుత ఫలితాలు -వ్యవసాయోత్పత్తుల ఎగుమతుల మండలిగా గుర్తించినా ఎన్నో లాభాలు
భారతదేశ ధాన్యాగారంగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ 2020లో తన పేరు సార్థకం చేసుకునే దిశగా అడుగులు వేయనుందనే సమాచారం ఇప్పుడు ఎల్లెడలా చర్చకు దారితీస్తోంది. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం మూడు పంటలు పండే భూములిచ్చిన అమరావతి అన్నదాతలకు అండగా నిలిచే ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేస్తోందని సమాచారం వస్తున్న నేపథ్యంలో శాస్ర్తవేత్తగా, వాణిజ్యవేత్తగా అక్కడి పరిస్థితులు పరిశీలించి, అమరావతిపై అధ్యయనం చేశాను. నూతన సంవత్సరంలో వినూత్నమైన ఆలోచనలతో ప్రభుత్వానికి నిపుణుల కమిటీ అందజేసిన నివేదిక అమరావతికే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రగతికి కరదీపిక అని చెప్పవచ్చు. రాజధాని కోసం రూపొందించిన మౌలిక సదుపాయాలను అలాగే ఉంచుతూ సారవంతమైన ఇక్కడి భూముల్లో ప్రత్యేక వ్యవసాయ మండలి ఏర్పాటు చేయగలిగితే అద్భుత ఫలితాలు సాధించే అవకాశం ఉంది. వ్యవసాయోత్పత్తుల ఎగుమతుల మండలిగా అమరావతిలో 33 వేల ఎకరాలను వాడుకున్నా ఎన్నో ప్రయోజనాలు ఒనగూరుతాయి.
అమరావతిలో ఉన్న భౌగోళిక, వాతావరణ పరిస్థితులు, నీటివనరులు, భూసారం వంటి అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతంలో ప్రత్యేక వ్యవసాయ మండలి లేదా వ్యవసాయోత్పత్తుల ఎగుమతుల మండలి ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడం ఒక అద్భుతమైన ఆలోచన. ఇక్కడున్న సహజసిద్ధమైన అనుకూలతలు వల్ల ప్రత్యేక వ్యవసాయ మండలి ద్వారా సుస్థిరమైన అభివృద్ధి సాధించవచ్చు. సామాజిక అంశాలు, స్థానిక వనరుల రీత్యా మూడు పంటలు పండే పచ్చని అమరావతి పరిధి భూములు వ్యవసాయ ప్రాంతంగా కంటే, ప్రత్యేక వ్యవసాయ మండలిగా ఏర్పడటం వల్ల మరిన్ని అనుకూలతలు అంది వస్తాయి. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం.
చారిత్రాత్మకంగా అమరావతికి ప్రత్యేక స్థానం ఉంది. అలాగే వ్యవసాయానికి అందుబాటులో అన్ని వనరులుండటంతో ఇది సహజసిద్ధమైన వ్యవసాయ క్షేత్రంగా వెలుగొందుతోంది. ఇప్పటి వరకూ చిన్న కమతాలుగా సాగిన వ్యవసాయం, ఒక సువిశాల క్షేత్రంలో ప్రణాళికాబద్ధంగా సాగేందుకు అనుకూలమైన పరిస్థితులున్నాయి. వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు కేంద్రం కావడం వల్ల వ్యవసాయ శాస్ర్తవేత్తలు, విద్యార్థులతో ఇదో హబ్‌గా మారుతుంది. వీరంతా ఇక్కడి వ్యవసాయక్షేత్రాలను దగ్గర నుంచి గమనించి వ్యవసాయానికి మరింత సాయం అవుతారు.
రాజధాని కోసం 29 గ్రామాలలో సమీకరించిన 33 వేల ఎకరాలలో వ్యవసాయం ఎన్నో నమూనాలలో చేయవచ్చు. సమాంతర వ్యవసాయం(వెర్టికల్ ఫార్మింగ్), హైడ్రో ఫోనిక్స్, సేంద్రియ వ్యవసాయం, వాణిజ్య పంటలు, ఉద్యాన పంటలు, ఔషధ జాతి మొక్కలు, సుగంధ మొక్కల పంటలు వేయవచ్చు. దీని ద్వారా పశు,పాడి పరిశ్రమలూ వర్థిల్లుతాయి. ఇది పశుసంవర్థక, వ్యవసాయ- పర్యాటక రంగాలకు దేశానికే మోడల్‌గా నిలిచే అవకాశం ఉంది.
నిర్మాణాత్మక సరఫరా వ్యవస్థను కనుగొనడంతోపాటు పంట ఉత్పత్తిదారుడి నుంచి చివరివరకూ ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా చేరేలా పటిష్టమైన యంత్రాంగం ఏర్పడింది. వస్తువుల ఆధారిత సమూహ వ్యవసాయం సుసాధ్యం చేయొచ్చు. ఇందులో సంస్థాగత విధానం ద్వారా ఎఫ్‌పిఓలు/సహకార సంస్థలను సులభంగా ప్రవేశపెట్టవచ్చు వ్యవసాయానికి సంబంధించి అనేక ప్రాథమిక నమూనాలను అభివృద్ధి చేయడానికి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌గా ఉపయోపడతుంది. విధివిధానాలు ఖరారు ద్వారా స్థానిక రైతుల హక్కులను పరిరక్షించడంతోపాటు వ్యవసాయ కూలీలకు స్థానికంగా ఉపాధి కల్పించవచ్చు.
పూర్తిస్థాయిలో ప్రత్యేక వ్యవసాయ మండలిగా మారితే వ్యవసాయోత్పత్తుల ఎగుమతి కేంద్రంగా రూపొందుతుంది. అలాగే అతి పెద్ద విస్తీర్ణంలో సేంద్రియ వ్యవసాయ ప్రాంతంగా అభివృద్ధి చేయవచ్చు. ప్రత్యేక వ్యవసాయ మండలికి విదేశీ పెట్టుబడులు, నిధులు వెల్లువెత్తుతాయి. అలాగే వ్యవసాయరంగంలో సరికొత్త పరిజ్ఞానం, సాంకేతిక నైపుణ్యం విషయంలో దేశ విదేశీ శాస్ర్తవేత్తలు, అధ్యయనకారులు భాగస్వాములు అవుతారు. తద్వారా వ్యవసాయరంగంలో వినూత్న ఆవిష్కరణలు మొదలవుతాయి. ఉత్పత్తులు ఆరంభమై ఫలితాలు రావడం మొదలయ్యాక ఆదాయం వృద్ధి చెందుతుంది.
సంబంధిత వ్యవసాయం, ఉత్పత్తులు, ప్యాకింగ్, ఎగుమతులు, సేంద్రియ వ్యవసాయం, యాజమాన్య పద్ధతులపై యువత, మహిళలకు శిక్షణనిచ్చే నైపుణ్యం ఆధారిత శిక్షణా కేంద్రాలను నెలకొల్పడం ద్వారా శిక్షణ అనంతరం ఉపాధి కూడా స్థానికంగా కల్పించవచ్చు. ఇక్కడి అగ్రికల్చర్ సెజ్ దేశానికే రోల్ మోడల్‌గా నిలవనుంది. సమిష్టి వ్యవసాయోత్పత్తిలో భాగమైన రైతులను సెజ్‌లో వాటాదారులుగా కూడా చేర్చుకుని మరిన్ని ప్రయోజనాలు వారికి అందించవచ్చు. ప్రత్యేక వ్యవసాయ మండలి లేదా వ్యవసాయోత్పత్తుల ఎగుమతుల మండలిలో వ్యవసాయం, పాడి, పశు రంగాలపై నిత్య పరిశోధనలు ఒక అంతర్భాగం అవుతాయి.
వ్యవసాయం, ఉత్పత్తులు, సేవలు అందించడానికి, ప్రత్యేక వ్యవసాయ మండలిలో భాగస్వాములు కావడానికి కార్పోరేట్లకు చక్కని అవకాశం. అలాగే చక్కని వాణిజ్యానికి కేంద్రంగా మారే పరిస్థితులున్నాయి. చాలా మంది కార్పొరేట్‌లను ప్రత్యేక వ్యవసాయ మండలిలో భాగస్వాములను చేసుకోవడం ద్వారా వారి సాంకేతిక పరిజ్ఞానాలను, ఆవిష్కరణలను పరిచయం చేయొచ్చు. స్పెషల్ అగ్రికల్చర్ జోన్ (SAZ) లేదా అగ్రికల్చర్ ఎక్స్‌పోర్ట్స్ జోన్ (AEZ)లలో ప్రైవేట్ పబ్లిక్ పార్టనర్‌షిప్ మోడల్‌ని అనుసరించి ..విజయవంతమైన నూతన విధానానికి నాంది పలికే చాన్స్ ఉంది. స్పెషల్ అగ్రికల్చర్ జోన్లో AI టూల్స్, ఐఒటి, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ మెథడాలజీల వంటి వ్యవసాయ ఆవిష్కరణలను ప్రదర్శించవచ్చు తెగుళ్ల నిఘా, వాతావరణ అంచనా నమూనాలను 33వేల ఎకరాల సువిశాల వ్యవసాయ క్షేత్రంలో పరీక్షించి, విజయవంతమైన నమూనాని దేశమంతా అమలు చేయవచ్చు. ఉత్తమ పంట యాజమాన్య పద్ధతులు, నీటిపారుదల వ్యవస్థలు, వ్యవసాయ యాంత్రీకరణ, పంటకోత సాంకేతికతలు, ప్రాసెసింగ్ సౌకర్యాల వల్ల వ్యవసాయోత్పత్తులకు అదనపు విలువ సమకూరుతుంది.
అమరావతిలో ప్రయోగాత్మకంగా అమలు చేయాలనుకుంటున్న ప్రత్యేక వ్యవసాయ మండలి (SAZ) అనుభవాలు, ఫలితాలు అభ్యాసాలు దేశంలోని ఇతర రాష్ర్టాలలో అనుకరించడానికి, అభివృద్ధి చేయడానికి దోహదపడతాయి. ఇది క్రమంగా వ్యవసాయాధారిత దేశమైన భారతదేశ వ్యవసాయ ముఖచిత్ర రూపురేఖలే మార్చివేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ప్రత్యేక వ్యవసాయ మండలి (SAZ)లో దేశీయ చట్టాలకు అనుగుణంగా వ్యవస్థీకృత విధానం అమలు చేయడం ద్వారా రైతులు, వ్యవసాయ కూలీల హక్కులు పరిరక్షించవచ్చు. స్పెషల్ అగ్రికల్చర్ జోన్ (SAZ) లేదా అగ్రికల్చర్ ఎక్స్‌పోర్ట్స్ జోన్ (AEZ)లలో నైపుణ్యం గలవారు, పాక్షిక నైపుణ్యం ఉన్నవారు, అసలు నైపుణ్యం లేనివారిని కూడా మానవవనరులుగా ఉపయోగించుకోవచ్చు. అన్నివర్గాలకు ఉపాధి కేంద్రంగా ఈ జోన్ ఉపయోపడనుంది.
వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, అనుబంధ పరిశ్రమలు, సేంద్రీయ ఆహారోత్పత్తులు, మిల్లెట్ ఫుడ్ పార్క్, అగ్రి స్టార్టప్‌లు మొదలైనవి స్పెషల్ అగ్రికల్చర్ జోన్ (SAZ)లో క్రమంగా అభివృద్ధి చెందుతాయి. వీటి ద్వారా స్థానికంగా ఉన్న గ్రామీణ మహిళలు, యువత కూడా వ్యాపారులుగా..కుటీర పరిశ్రమల యజమానులుగా రూపొందే అవకాశాలు దొరకుతాయి. స్పెషల్ అగ్రికల్చర్ జోన్ విజయవంతం అయితే వినియోగదారుల సంతృప్తి సూచిక ( Consumer satisfaction index) , ప్రజల సంతోష సూచిక (common man happiness index) ఎన్నో రెట్లు అధికం అవుతుంది. వ్యవసాయం దండగ అనుకుంటున్న ఆదునిక కాలంలో ఈ వ్యవసాయ మండలి ద్వారా సాధించిన ఫలితాలను చూపించి యువతకు, భవిష్యత్ తరాలకు వ్యవసాయం పట్ల గౌరవం పెంచే అద్భుత అవకాశం ఇది. మనదేశం భవిష్యత్తులో ఎదుర్కొనబోయే వ్యవసాయరంగ సవాళ్లు, ఆహార భద్రతా సమస్యలను ఎదుర్కొనేందుకు ఇది ఒక సరికొత్త నమూనా.
సహజసిద్ధమైన అమరావతి పరిసరాలు, స్థానికుల ఆందోళనలు పరిగనణలోకి తీసుకుని అదే వాతావరణాన్ని కొనసాగిస్తూ, అదే పర్యావరణ ప్రకృతిని గౌరవిస్తూ దేశానికే దిక్సూచిగా నిలిచే వ్యవసాయ మండలిగా నిలిచే ఆవిష్కరణల ప్రదేశంగా అమరావతి ప్రాంతాన్ని తీర్చిదిద్దవచ్చు.
ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన స్థిరమైన ఆర్థిక లక్ష్యాలను ( సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్) చేరడానికి అమరావతిలో ప్రతిపాదించనున్న ప్రత్యేక వ్యవసాయ మండలి విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది. వ్యవసాయాన్ని ఒక బలైమన ఆర్థిక సంస్థగా మార్చడానికి ఒక కేంద్రంగా ఉంటుంది.
రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అయిన అంధ్రప్రదేశ్ ఇప్పుడు వ్యవసాయరంగంలో దేశానికే దిశానిర్దేశం చూపించే దిశగా వేసిన ఈ ముందడుగు విప్లవాత్మకం. ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే మనదేశంలో ఇక వ్యవసాయం ప్రతీరోజూ పండగగా మారనుంది.