అనంతపురం రైతును దానిమ్మ సాగు ఆదుకుంటున్నది. ప్రకృతి విధానంలో దానిమ్మ సాగు చేపట్టి రైతులు లాభాలు గడిస్తున్నారు. అనంత జిల్లాలో తనకున్న ఐదెకరాల్లో దానిమ్మ సాగు చేస్తూ తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయాన్ని పొందుతున్నాడు రైతు అంజినప్ప యాదవ్.
భూమిని నమ్ముకొన్న రైతు ఎప్పటికీ చెడిపోడు అనే నానుడిని అక్షరసత్యం చేస్తున్నాడు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం జరుట్లరాంపురం గ్రామ రైతు ముచ్చెర్ల అంజినప్ప యాదవ్. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలు, ధరలు లేకపోవడం వంటి ఎదురుదెబ్బలు తగులుతున్నా ధైర్యంగా నిలబడి నేలతల్లి మీద భారం వేసి ముందుడుగు వేస్తున్నాడు. తక్కువ ఖర్చుతో, తక్కువ నీటి వినియోగంతో, ప్రకృతి విధానంలో దానిమ్మ పంటను సాగు చేసి మంచి దిగుబడులు తీస్తున్నాడు. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
దానిమ్మపంటను సాగు చేయడానికి 5 ఎకరాలకు గాను 2 లక్షల రూపాయల వరకు ఖర్చు చేశాడు. దానిమ్మ మొక్కలను మహారాష్ట్రలోని నర్సరీలో కొనుగోలు చేసి తీసుకువచ్చి తన పొలంలో నాటాడు 5 ఎకరాలకు గాను 1150 మొక్కలను నాటాడు.
దానిమ్మ సాగులో ఎలాంటి రసాయనాలను వినియోగించలేదు ఈ రైతు. పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించి దానిమ్మ తోటను పండిస్తున్నాడు ఈ రైతు. పంటకు కావాల్సిన కషాయాలను , జీవామృతాన్ని సమయానికి తగ్గట్లుగా పంటకు అందిస్తున్నాడు. రోజు మార్చి రోజ జీవామృతాన్ని మొక్కలకు డ్రిప్ ద్వారా అందిస్తున్నాడు. ప్రకృతి విధానంలో పండిన పంట కావడంతో మొక్కలు మంచి ఏపుగా పెరగడంతో పాటు , నాణ్యమైన దిగుబడి లభిస్తోంది. మార్కెట్‌లో మంచి ధరల పలుకుతోందని రైతు ఆనందంవ్యక్తం చేస్తున్నాడు.
కరవు ప్రాంతం కావడంతో ఇక్కడ నీటి సమస్య సర్వసాధారణం అందులోనూ వేసవి కాలం కావడంతో ఎంతో సమర్థవంతంగా నీటిని వినియోగించాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ రైతు తనకున్న కొద్దిపాటి బోరు నీటిని సాగులో ఎంతో జాగ్రత్తగా వినియోగిస్తున్నాడు. మొక్కకు మొక్కకు నీటిని పంపిణీ చేసేతందుకు డ్రిప్ విధానాన్ని అనుసరిస్తున్నాడు.
ప్రస్తుతం పంట నాటి ఐదేళ్లవుతుంది. ఇప్పటికే 4 కోతలు కోశాడు ఈ రైతు. మొత్తం 2 లక్షల పెట్టుబడి పెట్టారు. ఇందుకు గాను తాను 24 లక్షల రూపాయల వరకు ఆదాయం వచ్చిందని రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ప్రకృతి సాగు విధానాల ద్వారా తక్కువ ఖర్చుతో తాను సాగులో మంచి లాభాలను పొందగలుగుతున్నానని రైతు చెబుతున్నాడు. లాభదాయకమైన ఆదాయం వస్తుందని రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.