ఏడాది పొడువునా లభిస్తూ శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలనందిస్తుంది బొప్పాయి. అందుకే ఈ పండును 'దేవదూత' గా పిలుస్తారు. పండించిన వాళ్లకు బోలెడు లాభాలు, తిన్నవాళ్లకు బోలెడు పోషకాలు ఇచ్చే ఈ బోప్పాయి సాగు వైపు ప్రత్యామ్నాయ పంటగా క్రమేనా రైతులు మొగ్గు చూపుతున్నారు. ఆ కోవలోనే బిందు సేద్యం, మల్చింగ్ వంటి ఆధునిక విధానాలు అవలంబిస్తూ ఈ పంటను సాగు చేస్తున్న వరంగల్ జిల్లాకు చెందిన యువ రైతుపై ప్రత్యేక కథనం.
వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం వెంకటేశ్వర పల్లి గ్రామానికి చెందిన ఈ రైతు పేరు మంద రమేష్. తనకున్న ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమిలో ప్రతి సంవత్సరం పత్తి, మొక్కజొన్న తదితర పంటలు వేసి పంటను పండించేవాడు. సాగులో పెట్టుబడులు, కూలీల ఖర్చుల భారం పెరగడంతో, కొత్త ఆలోచనతో బొప్పాయి సాగు పంట ను ప్రారంభించాడు. మండలంలోని కొంతమంది రైతులు చేస్తున్న బొప్పాయి సాగును స్వయంగా రైతుల దగ్గరికి వెళ్లి తెలుసుకుని తాను కూడా పండించాలని ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. తనకున్న ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమిలో నాలుగు ఎకరాలను బొప్పాయి, మరో నాలుగు ఎకరాలలో వరి, పత్తిని సాగుచేశాడు.
ఎకరాకి లక్ష రూపాయల పెట్టుబడితో బొప్పాయి సాగు పంటను, అన్ని రకాల జాగ్రత్తలతో సాగు చేశాడు. ఒక వైపు కరోనా మరోవైపు, భారీ వర్షాల కారణంగా సాగు కొంత నష్టం వాటిల్లిందని, అయినప్పటికీ మార్కెట్లో కిలో బొప్పాయి కి 25- 30 రూపాయలు ఉండాల్సిన ధర నేడు 5 రూపాయల నుండి 15 రూపాయలు మాత్రమే ధర వస్తుందని రైతు అంటున్నాడు.
తక్కువ పెట్టుబడి తక్కువ కూలీలతో తాను బొప్పాయి సాగు చేసానని, పండించిన బొప్పాయి కి మార్కెట్ కు వెళ్లి అమ్మాల్సిన అవసరం లేకుండా కొనుగోలుదారుడు నేరుగా పంట వద్దకు వచ్చి వాటిని కొనుగోలు చేయడం కొంత భారం తగ్గించిందని, వరంగల్, హైదరాబాద్, ఢిల్లీ, ఎన్నో ప్రాంతాలకు బొప్పాయిని ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు. కరోనా నేపథ్యంలో మాత్రమే మార్కెట్లో ధర తక్కువగా ఉందని, అయినప్పటికీ తమ పెట్టుబడిని సంపాదించుకొన్నామని కొంత లాభాలను పొందామని అంటున్నాడు ఈ యువరైతు.
గత 15 సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నామని పత్తి వరి మొక్కజొన్న పంటలను పండించడం చాలా వ్యయ ప్రయాసలతో పాటు,కూలీల భారం ఎక్కువ గా వుంటుందని, దీన్ని అధిగమించి బొప్పాయి సాగులో లాభాలను ఆర్జించడం కోసమే తాను సాగు చేయడం మొదలుపెట్టానని అంటున్నాడు.. మిర్చి, పత్తి వంటి పంటలతో పోలిస్తే బొప్పాయి సాగుకు ఖర్చు తక్కువగా ఉంటోందని, కూలీల అవసరం పెద్దగా లేకుండానే పంట చేతికి వస్తుందని, బిందు సేద్యం, మల్చింగ్, వల్ల నీటి సమస్య తగ్గి, ఎరువుల ఖర్చు తగ్గుతాయని, వైరస్, తుఫానులు వంటి సమస్యలు మినహా పంట సాగులో ఇబ్బందులు ఉండవని పంటపై ఒక వ్యక్తి నిరంతర పర్యవేక్షణ అవసరమని అంటున్నాడు రైతు రమేష్.