ఒకప్పుడు న్యాయస్థానంలో వకీల్‌సాబ్.. నేడు ప్రకృతి వ్యవసాయ ప్రేమికుడు
Natural Farming: ఆహారం రసాయనాల మయం అవుతుండటం, విష రసాయనాలతో పండిన ఆహారం ద్వారా అనారోగ్య సమస్యలు..
Natural Farming: ఆహారం రసాయనాల మయం అవుతుండటం, విష రసాయనాలతో పండిన ఆహారం ద్వారా అనారోగ్య సమస్యలు వెంటాడుతుండటం, పెట్టుబడులుపెరిగి దిగుబడి లేక రైతుకు సాగు గిట్టుబాటు కానీ పిరస్థితులను కర్నూలు జిల్లాకు చెందిన కృష్ణారెడ్డి కళ్లారా చూశారు. ఈ నేపథ్యంలో తాను చేస్తున్న న్యాయవాధి వృత్తిని వీడి , నేడు ప్రకృతి వైపు పయనం సాగించారు. తనవంతు సామాజిక బాధ్యతగా రైతుల్లో మేల్కొలుపు తీసుకువచ్చి , ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలన్న లక్ష్యంతో సేద్యం మొదలు పెట్టారు. ఔషధం, పోషకం, ఆరోగ్యం అందించే దేశీయ వరి వంగడాలను సాగుకు ఎన్నుకున్నారు. తనకున్న మూడు ఎకరాల పొలంలో 10 రకాల దేశీ వరి వంగడాలను ప్రయోగాత్మకంగా పెంచుతూ సత్ఫలితాలను సాధిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ సాగుదారు.
ప్రకృతి విధానంలో దేశీ వరి వంగడాలను సాగు చేసేందుకు చక్కటి ప్రణాళికను తయారు చేసుకున్నారు కృష్ణారెడ్డి. మొదటగా నిపుణుల సలహాలను సూచనలను తీసుకున్నారు. అనంతరం అందుబాటులో ఉన్న విత్తనాలను సేకరించారు. ప్రకృతి సేద్యం కాబట్టి ఓ దేశీ ఆవును కొనుగోలు చేశారు. తాను చేస్తున్న ఈ ప్రయోగాల సాగు తోటి రైతులను ఆలోచింప చేయాలన్నది కృష్ణారెడ్డి ఉద్దేశ్యం. అందుకే రహదారికి పక్కనే ఉన్న పొలాన్ని సాగు కోసం ఎన్నుకున్నారు. ముందుగా పొలాన్ని దున్నుకుని ఘనజీవామృతాన్ని చల్లుకుని సాగుకు అనువుగా మార్చుకుని పంట సాగు మొదలు పెట్టారు. ప్రస్తుతం పంట తీరును చూస్తూ మురిసిపోతున్నారు ఈ సాగుదారు. రసాయనాల ఊసే లేకుండా కేవలం గో వ్యర్థాలతో చేస్తున్న సేద్యం తనకు ఎంతో సంతృప్తిని అందిస్తుందని అంటున్నారు కృష్ణారెడ్డి.
3 ఎకరాల్లో సుమారు 10 రకాల వరి వంగడాలను సాగు చేస్తున్నారు కృష్ణారెడ్డి. కాలాబట్టి, రత్నచోడి, ఇల్లపు సాంబ, అంబిమొహర్, కభిరాజ్ , బహుమలై, రమ్యగళీ, చిట్టిముత్యాలు వంటి పోషకాలు, ఔషధాలు కలిగిన వరిని పండిస్తున్నారు. ఈ రకలు 120 నుంచి 150 మధ్య కాల పరిమితి కలిగినవని రైతు చెబుతున్నారు.
ఇటీవల కురిసిన అకాల వర్షాలకు చుట్టుపక్కన సాధారణ వరి సాగు చేసిన రైతుల పొలాలు దెబ్బతిన్నాయని తెలిపారు. వడ్లు కూడా తడిసి మొలకెత్తుతున్నాయని తద్వారా రైతుకు నష్టం వాటిల్లిందన్నారు. కానీ ఈ దేశీయ వంగడాలు మాత్రం భారీ వర్షాలను సైతం తట్టుకుని మంచి దిగుబడిని అందిస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఎకరం 15 సెంట్లలో సాగు చేసిన రత్నచోడి 30 బస్తాల దిగుబడి అందించిందన్నారు.
ఆవు పేడ, మూత్రంతో తయారు చేసిన ఘన, ద్రవ జీవామృతాలనే పంటకు అందిస్తున్నారు. తద్వారా రసాయనాలు, పురుగుమందుల ఖర్చు మిగులుతోందని తెలిపారు. ఇక నాటు, కలుపు కూలీలకు కలుపుకుని మొత్తం 20 వేల ఖర్చయ్యిందన్నారు. ఏ రకంగా చూసుకున్నా దేశీ వరి సాగుకు సత్ఫలితాలను అందిస్తోంని రైతు హర్షం వ్యక్తం చేశారు. దేశీ వరి సాగు దిశగా ఆసక్తి చూపే రైతులకు ఉచితంగా విత్తనాన్ని అందిస్తానని కృష్ణారెడ్డి తెలిపారు. కృష్ణా రెడ్డి స్ఫూర్తితో తోటి రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో దేశీ వరి సాగుకు ఆసక్తి చూపుతున్నరు.