మొక్కల పెంపకం ఇష్టమైన అభిరుచిగా ఉండేవారు చాలామందే ఉంటారు. దానికి తోడు మిద్దెతోటల ప్రయోజనాలు తెలియడంతో మరింత ఎక్కువగా వాటిని పెంచడానికి ఇష్టపడుతున్నారు. తాజాగా అప్పటికప్పుడు మొక్కలనుంచి కోసిన కూరగాయలను వండుకుంటుంటే ఆ ఆనందమే వేరు. ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని మిద్దె తోటల సాగు ద్వారా పొందవచ్చు. అందుకే తమ మూడంతస్తుల మేడ మీద మిద్దె తోటలను పెంచుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు వెంకటకృష్ణ.
10 ఏళ్లుగా మిద్దె తోటను నిర్వహిస్తున్నారు వెంకటకృష్ణ. కుటుంబసభ్యులు మిద్దె తోటల సాగులో వెంకటకృష్ణకు సహాయపడుతున్నారు. ఈ మేడ మీద దొరకని కూరగాయలు , ఆకుకూరలు, ఔషద మొక్కలు, పూల మొక్కలు లేవు. 365 రోజులు మొక్కలు ఉత్పత్తులను అందిస్తూనే ఉంటాయి. అన్నింటిని ఎంతో అందంగా పెంచేస్తున్నారు వీరు. పాలేకర్ ప్రకృతి విధానంలో మిద్దె తోటలను సాగు చేస్తున్నారు. కొత్త కొత్త పద్ధతులను అవలంభిస్తున్నారు. ఇలా కలిసికట్టుగా మిద్దె తోటలను సాగు చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందంటున్నారు వెంకటకృషణ.
ప్రాచీనకాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకూ మొక్కలు, వివిధ ఔషధాల తయారీలో ఉపయోగపడుతూనే ఉన్నాయి. ప్రకృతిలో లభించే ప్రతి మొక్క ఏదో ఒక ఔషధ గుణాన్ని కలిగి ఉంటుంది. కానీ వాటిని విస్మరించి చిన్న జలుబు , తుమ్ము వచ్చినా సరే క్షణం ఆలోచించకుండా డాక్టర్ల దగ్గరకు పరుగులు తీస్తుంటాం. వేలకు వేలు డబ్బులను ఖర్చుచేస్తుంటాము. కొత్త కొత్త రోగాలను కొని తెచ్చుకుంటాం. అందుకనే మేడ మీద ఆహార పంటలనే కాదు ఔషధ మొక్కలను పెంచుతూ ఇంటిళ్లిపాది ఆరోగ్యంగా జీవిస్తున్నారు ఈ కుటుంబసభ్యులు.
బజారులో ఏం కొన్నా వాటి మీద ఏ పురుగు మందులు చల్లారో, ఎన్ని రసాయన ఎరువులు వాడారోనన్న సందేహం. పైగా పండ్లను మగ్గబెట్టడానికీ రసాయనాలను వాడుతున్నారు. ఆ భయాలు లేకుండా కూరగాయలనూ, పండ్లనూ ఇంటిమీదే చక్కగా పండించుకోవచ్చు అంటున్నారు వెంకటకృష‌్ణ కుటుంబసభ్యులు. అందరూ ఉదయం మార్నింగ్ వాక్‌కు వెళ్తుంటారు కానీ కాస్త సమయాన్ని మిద్దె తోటల్లో గడిపితే చక్కటి వ్యాయామంతో పాటు రుచికరమైన ఆహారం, ఆరోగ్యం, ఆనందం లభిస్తాయంటున్నారు.