హరితవిప్లవం కారణంగా మారిన వ్యవసాయ తీరు, రసాయనాల సాగులో పెరుగుతున్న పెట్టుబడులకు రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వ్యవసాయాన్ని వ్యాపారం చేసి, అధిక దిగుబడులే లక్ష్యంగా సాగు చేస్తన్న వాణిజ్య పంటల వల్ల నష్టాల పాలవుతున్నారు రైతులు. ఈ క్రమంలో ఆరోగ్యకర పంటలు పండించాలన్నా ఆర్ధికంగా రైతు బలపడాలన్నా, ప్రకృతి వ్యవసాయమే ఇప్పుడున్న ఏకైక మార్గం. ఆ విధంగానే కరీంనగర జిల్లా గ్రామాల్లో ఆహార భద్రతతో పాటు, రైతులకు ఆర్ధిక భద్రత కల్పించడానికి, నాబార్డు సహకారంతో జన వికాస గ్రామీణ అభివృద్ధి సంస్థ, రైతులకు ప్రకృతి విధానంలో పందిరి పంటల సాగు పై ప్రత్యేక శిక్షణలు ఇస్తుంది. నీటి ఎద్దడి ఉండే ప్రాంతాల్లో సైతం రసాయనాలు లేని సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగు పై ప్రత్యేక కథనం.
వ్యవసాయంలో రైతులు ఆర్థికంగా బలపడడానికి, అలాగే నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో కూడా ప్రకృతి విధానంలో పుష్కలమైన పంటలు పండించే విధంగా రైతులకు సబ్సీడీలు, శిక్షణ కార్యక్రమాలను ఇస్తుంది జన వికాస గ్రామీణ అభివృద్ధి సంస్థ. జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు నాబార్డు సహకారంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు కలిగే పందిరి కూరగాయల సాగులో రైతులకు ప్రోత్సాహం ఇస్తుంది.
తక్కువ నీటి లభ్యత గల ప్రాంతాల్లో నీటి సంరక్షణ చాల అవసరం. ఆ విధంగానే ఆధునిక పద్దతిలో నీటి వినియోగాన్ని తగ్గించుకుంటూ సేంద్రియ విధానంలో కూరగాయలతో పాటు పందిరి పంటల సాగులో శిక్షణ , అవగాహన కార్యాక్రమాలు నిర్వహిస్తున్నామని అంటున్నారు సుందరగిరి గ్రామానికి చెందిన ఫుడ్ ప్రొడక్షన్ కంపెనీ ఎండీ తిరుపతి.
రసాయనాలు పంట పొలాలకు కాకుండ రైతుల ఆరోగ్యం పై కూడా దుష్ప్రభావాలను చూపెడతాయి, పంట దిగుబడులు కూడా ఆశించిన స్థాయిలో రావు. ఫలితం పెట్టుబడులు పెరిగి రైతులు నష్టాలు చూడాల్సి వస్తుంది. అలాంటి నష్టాల నుండి రైతులను లాభాల వైపు నడిపించాడకి జన వికాస గ్రామీణ అభివృద్ధి సంస్థ, రైతులకు ప్రకృతి వ్యవసాయంలో శిక్షణ ఇస్తూ వాణిజ్య పంటలు కాకుండా, లాభదాయకమైన పందిరి పంటల సాగుని ప్రోత్సాహిస్తుందని జన వికాస గ్రామీణ అభివృద్ధి సంస్థ, నిర్వాహకులు సంపత్ కుమార్ అంటున్నారు.
ప్రకృతి వ్యవసాయానికి ఆధునికతను జోడించి కూరగాయలు సాగు చేస్తున్నానని, సాగులో అధిక దిగుబడులకు కొత్త పద్దతులను నాబార్డు, జన వికాస సంస్థ సహకారంతో శిక్షణ తీసుకుని, నాణ్యమైన పంటలు పండించి, సమాజానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యమని అంటున్నాడు సుందరగిరి గ్రామానికి చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు రాధాకృష్ణ.
బొల్లోని పల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ ఉన్నత చదువులు చదివినా కూడా వ్యవసాయం పై ఆసక్తితో సాగులోకి దిగాడు. తక్కువ నీటితో కూడా సాగు చేసుకునే ప్రకృతి వ్యవసాయమే లాభదాయకమని, నాబార్డు సహకారంతో ప్రకృతి వ్యవసాయంలో శిక్షణతో పాటు తాము పండించిన సేంద్రియ ఉత్పత్తులను కూడా మార్కెటింగ్ చేస్తున్నారని అంటున్నాడు ఈ రైతు.