సమగ్ర సేద్యం చేస్తున్న వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
సమగ్ర సేద్యం చేస్తున్న వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
Niranjan Reddy: ఆయన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి. నిత్యం రైతాంగం ఎలాంటి పంటలు సాగు చేయాలి? ఏ పద్ధతులను అనుసరించాలి? లాభాలు పొందే మార్గాలేమిటి వంటి అంశాలపై సూచనలు, సలహాలు ఇస్తుంటారు. నోటి మాటలు చెప్పడమే కాదు ప్రత్యక్షంగా తూచాతప్పకుండా ఆ సూచనలను తానూ తన వ్యవసాయక్షేత్రంలో పాటిస్తూ విభిన్నరకాల పంటలను వైవిధ్యమైన విధానాల్లో సాగు చేస్తూ తోటి రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ప్రకృతికి సేవ చేస్తూ , మూగజీవాల నేస్తంగా మెలుగుతూ, పచ్చటి మొక్కలతో నిత్యం ముచ్చటిస్తూ, ప్రకృతి ప్రసాదించిన ప్రతి వనరులను సంరక్షిస్తూ రైతే రాజు అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. కర్శకుని కంట నీరు రాకుండా కాసుల పంటలు ఏ విధంగా పండించాలో తన అనుభవాలను జోడించి కచ్చితమైన పద్ధతులను తెలియజేస్తున్నారు. రైతుకు లాభాల మార్గాన్ని సూచిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి... తనకు లభించిన ఆ మంత్రి పదవికే వన్నే తీసుకొస్తున్నారు. గత 20 ఏళ్ళుగా ప్రకృతి పద్దతిలో వ్యవసాయం చేస్తూ... రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వనపర్తి జిల్లా పాన్ గల్ మండల కేంద్రం శివారులోని ....50 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో సమగ్ర సేద్యం చేస్తున్నారు నిరంజన్ రెడ్డి. ప్రతి రోజు ఉదయం మొక్కల మధ్య గడపటం ఈయన రోజూవారి దినచర్య. రాజకీయ నాయకునిగా ఎదురయ్యే అనేక ఒత్తిడులను అధిగమించేందుకు ప్రకృతితో గడుపుతుంటారు మంత్రి. అందులోనే మానసిక ఉల్లాసాన్ని పొందుతుంటారు. వ్యవసాయమంటే కూలీలను పెట్టి పంటలు పండించడం కాదు. తోటలోని ప్రతి చెట్టును స్వయంగా పలకరిస్తారు ఈయన. వాటి బాగోగులను ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. ప్రతి రోజు సుమూరు రెండు గంటల పాటు వ్యవసాయ క్షేత్రంలో కాలినడకన తిరుగుతూ సాగు తీరును తెలుసుకుంటారు. రైతుగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తారు.
పంటల సాగులో పూర్తిగా సేంద్రియ విధానాలనే అనుసరిస్తున్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. అందుకోసం తన క్షేత్రంలోనే దాదాపుగా 150 పాడి పశువులను సురక్షితమైన పద్ధతుల్లో పెంచుతున్నారు. ఆ పశువుల నుంచి వచ్చే మూత్రం, పేడతో ఎరువులను , వర్మీకంపోస్ట్‌ను తయారు చేసి వాటిని మొక్కలకు అందిస్తున్నారు. వర్మీకంపోస్ట్ తయారీ కోసం ప్రత్యేకమైన యూనిట్‌ను నెలకొల్పారు నిరంజన్ రెడ్డి. అంతే కాదు పశువుల వ్యర్థాలు, వర్షపు నీరు వృథాగా పోకుండా నిపుణుల సూచనల మేరకు భారీ ట్యాంకును ఏర్పాటు చేశారు. పొలంలో ఏ మూలన వర్షం కురిసినా ఒడిసిపట్టేందుకు నీటి కుంటలను నిర్మించుకున్నారు. సాగునీరు సమృద్ధిగా లభిస్తున్నప్పటికీ ఆధునిక సేద్యపు విధానమైన డ్రిప్ ద్వారా పండ్ల తోటలకు నీటిని అందిస్తున్నారు. సేంద్రియ విధానాలను అవలంభించడం వల్ల తోటలో ఏ పండు తిన్నా దాని రుచి అమృతంగా ఉంటుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
విభిన్న రకాల పండ్లు, కూరగాయలతో పాటుగా మరో ఆరున్నర ఎకరాలల్లో నూనె గింజల పంటైన ఆయిల్ పామ్ ను సాగు చేస్తున్నారు మంత్రి. ఆయిల్ పామ్ పంటకు ఉన్న డిమాండ్‌ను గుర్తించి 4 ఏళ్ళ క్రితమే సాగును ప్రారంభించారు. తెలంగాణ ప్రాంతం అయిల్ పామ్‌కు అత్యంత అనుకూలమైనదని తెలిపారు. ఒక ఎకరంలో వరి పండించే నీటితో నాలుగెకరాల్లో ఆయిల్ పామ్ పండించవచ్చని పంట చేతికి వచ్చే వరకు అంతర పంటలు సాగు చేసుకోవచ్చునని అన్నారు. నాలుగేళ్లకు పంట ప్రారంభమైతే ప్రతి 15 రోజులకు ఆదాయాన్ని పొందవచ్చని తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణాలో 20 లక్షల ఎకరాల్లో ఈ ఆయిల్ పామ్ సాగును విస్తరింపచేయాలన్న లక్ష్యంతో ఉన్నామన్నారు నిరంజన్ రెడ్డి.