క్యాన్సర్ దూరం చేసే 'నల్లబియ్యం'..డిమాండ్ ఎంతో అధికం.. ఇదీ తిరుపతి చేస్తున్న సేంద్రియ వ్యవసాయం!!
Organic Farming: మనమంతా పాలిష్ బియ్యానికి అలవాటు పడ్డాం. బియ్యం అంటే తెల్లగా నాజుగ్గా ఉంటాయని మాత్రమే మనకు తెలుసు. కానీ బ్లాక్, రెడ్ రైస్ ఆరోగ్యానికి ఎంతో మేలంటున్నాడు ఓ యువరైతు. పాత తరం రైతులు వాడే కాలబట్టి విత్తనాలతో పండించిన బియ్యం తింటే, క్యాన్సర్ దరిదాపులకు కూడా రాదంటున్నారు కొత్త తరం రైతులు. ఆ వివరాలేంటో చూద్దాం.
కాలబట్టి విత్తనాలతో పండిన పంటతో ఆరోగ్యానికి ఎంతో మేలని డాక్టర్లంటుంటే, అప్పట్లో ఈ బియ్యాన్ని తినబట్టే ఇంత గట్టిగా ఉన్నామంటున్నారు గ్రామంలోని పెద్దలు. ఇక్కడ మనం చూస్తున్న ఈ యువరైతు పేరు జక్కుల తిరుపతి. ఊరు సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం నాగపురి. పోస్ట్ గ్రాడ్యూట్ పూర్తి చేసుకొని హైదరాబాద్ లో ఓ ఆర్గనిక్ షాపులో ఐదంకెల జీతానికి ఉద్యోగం చేసేవాడు. పాత తరం నాటు వరి పంటతో లాభాలను తెలుసుకొని నల్లని వరి పంటను వేసేందుకు నడుం బిగించాడు. నలుపు, తెలుపు బియ్యంతో క్యాన్సర్ వ్యాధి దరిదాపులకు కూడా రాదని తెలుసుకున్న కొత్త తరం రైతులు ఇప్పుడు ఆ పంటల్ని వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వరి అంటే పచ్చని పైరు తెల్లని బియ్యం అని మాత్రమే ఈ తరం వారికి తెలుసు. కానీ నల్లని, ఎర్రని బియ్యం కూడా పండుతాయని కొద్ది మందికే తెలుసు. ఈ పంట దాదాపు నలుపు రంగులోనే ఉంటుంది.
ప్రస్తుతం తిరుపతి తనకున్న రెండెకరాల పొలంలో పాత పద్దతిలో పంటలను పండిస్తున్నాడు. పొలంలో రసాయనాలు, యూరియా వెదజల్లి పంటలు ఉత్పత్తి చేస్తున్న కాలంలో జీవామృతాన్ని ఎరువుగా ఉపయోగిస్తున్నాడు. పశువుల పేడ మూత్రాన్ని సేకరించి, అందులో శనగపిండి, బెల్లం కలిపి జీవామృతాన్ని తయారు చేసి, వారానికి ఒకసారి పొలంలో చల్లుతున్నాడు. కొన్ని సందర్భాల్లో స్ప్రే విధానంతో సేంద్రీయ ద్రావణాలను పంటకు పట్టిస్తున్నాడు. ఒక ఎకరానికి 3 కిలోల విత్తనాలు చల్లాలి. 105 రోజులకు ఈ వరి పంట పండుతుంది. పంచరత్న, నాసరబట్టి, చిట్టిముత్యాలు, కాలబట్టి ఇలా మొత్తం 51 రకాల వరి పంటలను తిరుపతి పండిస్తున్నాడు. మార్కెట్లో ఈ పంటకు చాలా డిమాండ్ ఉందని కిలోకు 3 నుంచి 4 వందల రూపాయలు పలుకుతుందని తిరుపతి వివరించాడు.
క్యాన్సర్ తో ఇటివలె తన తండ్రి మృతి చెందిన పరిస్థితి ఎవరికీ రాకూడదనే కాలబట్టి వరి విత్తనాలు వేసినట్లు చెప్పాడు. దీనిలో క్యాన్సర్ తగ్గించే గుణాలున్నాయని వివరించాడు తిరుపతి. ప్రస్తుతం నాగపురి గ్రామంలో 60 నుంచి 70 ఎకరాలలో ఆర్గానికి పద్దతిలో వ్యవసాయం చేస్తున్నారు.