విదేశాల్లో ఉద్యోగం వీడి స్వదేశంలో సేద్యం.. ఆదర్శంగా నిలుస్తున్న నెల్లూరు జిల్లా రైతు..
Organic Farming: అతనో ఎన్నారై.. ప్రపంచంలోనే అగ్రగామి సంస్థల్లో ఉన్నత ఉద్యోగాలు చేసిన అనుభవం ఆయనది.
Organic Farming: అతనో ఎన్నారై.. ప్రపంచంలోనే అగ్రగామి సంస్థల్లో ఉన్నత ఉద్యోగాలు చేసిన అనుభవం ఆయనది. నెలకు పది లక్షల రూపాయలకు పైగా జీతం, నిత్యం ఏసీ గదుల్లో జీవనం, అయినా ఇవన్నీ అతడికి సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. ఫారెన్‌లో జాబ్ అంటే పరిగెత్తే యువత ఉన్న ఈ రోజుల్లో లక్షల రూపాయలు ఆర్జించిపెట్టే ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేదని తన చిన్ననాటి కోరిక నెరవేర్చుకునేందుకు ఏడాది క్రితం జన్మభూమికి తిరిగొచ్చి నెల్లూరు జిల్లాలో వ్యవసాయాన్ని మొదలు పెట్టారు సాంబశివరావు. ఇన్నాళ్లు కంప్యూటర్లతో నిత్యం కుస్తీ పట్టిన చేతులతో నేడు హలం పట్టి పొలం పనులు చేస్తూ కర్షకుడిగా స్థిరపడ్డారు. మెట్ట భూముల్లోనూ రసాయన రహిత వ్యవసాయం చేస్తూ విభిన్న పంటలు పండిస్తూ లాభాలు ఆర్జిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుముడికి చెందిన కాటరి సాంబశివరావుకు చిన్నతనం నుంచే వ్యవసాయం చేయటం అంటే ఇష్టం. కానీ తండ్రి సుబ్బారావు కోరిక మేరకు కెమికల్ ఇంజనీరు చదివి విదేశాల్లో కొన్నేళ్లు స్థిరపడ్డారు. సాంబశివరావు దక్షిణా ఫ్రికా, నైజీరియా,లిబియా, జాంబియా తదితర దేశా లలో 18 ఏళ్లపాటు ఉన్నతస్థాయి ఉద్యోగాలు చేశారు. రిటైర్మెంట్ తరువాత వ్యవసాయం చేయాలని అనుకున్నా మధ్యలోనే ఉద్యోగం వదిలి గత ఏడాది స్వదేశానికి తిరిగి వచ్చారు. తన భార్య వాణి కోరిక మేరకు నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం అనుమసముద్రం గ్రామ సమీపంలో సేంద్రియ వ్యవసాయం చేయాలన్న ఆలోచనతో సుమారు15 ఎకరాల పొలాన్ని 8 ఏళ్ల క్రితమే కొనుగోలు చేశారు. అక్కడే ఇనుప కంటైనర్ను ఇల్లుగా మార్చుకుని నివాసముంటు వ్యవసాయం చేస్తున్నారు ఈ సాగుదారు. మెట్ట భూమిలో సాహసం చేసి కూరగాయలు, పండ్లు , పూల సాగు చేపట్టారు. అది కూడా ఎటువంటి రసాయనాలు వాడకుండా పూర్తి సేంద్రీయ పద్ధతులనే అనుసరిస్తున్నారు. పంటల సాగుకు అవసరమైన నీటి కోసం బోర్లు వేయించడంతో పాటు సుమారు నాలుగు లక్షల లీటర్ల నీరు నిల్వ ఉండే చెరువును కూడా నిర్మించారు.
15 ఎకరాల పొంలలో దీర్ఘకాలిక పంటలతో పాటు పండ్లు , కూరగాయలు, పూలు సాగు చేస్తున్నారు ఈ రైతు. దొండ, బీర , కాకర వంటి తీగజాతి పంటలతో పాటు పచ్చిమిర్చి, టమోటా ,బెండ వంటి కూరగాయలు మామిడి, సపోట,జామ,నిమ్మ, దానిమ్మ, అరటి వంటి పండ్ల తోటలు బంతి, రోజా పూల తోటలను పెంచుతున్నారు. తీగజాతి పంటల కోసం ఉద్యానశాఖ అందించి రాయితో పాటు తాను కొంత వేసుకుని శాశ్వత పందిర్లను నిర్మించుకున్నారు, నీటి సరఫరాల కోసం డ్రిప్ పరికరాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇక సరిహద్దు పంటలుగా మహాగణి కలప మొక్కలను పెంచుతున్నారు రైతు. ఏడాది పాటు జాగ్రత్తగా మొక్కలను కాపాడుకుంటే 12 ఏళ్ల తరువాత రైతు లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జించవచ్చని చెబుతున్నారు. ప్రస్తుం పొలం చుట్టూ 400 చెట్లను నాటారు. రానున్న రోజుల్లో మరో 600 చెట్లు వేసే ఆలోచన చేస్తున్నారు.
పంటలకు ఎలాంటి చీడపీడలు ఆశించకుండా జీవామృతం, ఘనజీవామృతం, గోకృపామృతం, వేప నూనె, కుంకుడు రసం వంటి సేంద్రియ ఎరువులను వినియోగిస్తున్నారు. ఈ ఎరువులను సొంతంగా తయారు చేసుకుంటున్నారు. ఈ సేంద్రియ ఎరువులను క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల చీడపీడల సమస్యలు పెద్దగా పంటను ఆశించవంటున్నారు. అన్ని రకాల పోషకాలు మొక్కకు అందుతాయంటున్నారు.
విత్తనాలు, సేంద్రియ ఎరువులు, కూలీల ఖర్చులు మొత్తం కలిపి ఎకరాకు సుమారు 80 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతున్నట్లు సాంబశివరావు చెప్పుకొచ్చారు. పంట దిగుబడిని బట్టి ఎకరాకు సుమారు 2 లక్షల రూపాయల వరకు రాబడి వస్తున్నట్లు తెలిపారు. సేంద్రియ విధానంలో తాను పండించిన పంటను దళారులపై ఆధారపడకుండా పొలం వద్దే షెడ్డును నిర్మించి వినియోగదారులకు అమ్ముతున్నారు. సేంద్రియ విధానంలో పండించిన తాజా కూరగాయలు కావడంతో వినియోగదారులు పొలం వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారంటున్నారు రైతు. రైతుగా ఇంతకు మించిన సంతృప్తి ఎందులో ఉంటుందని తెలిపారు. పంటల సాగుతో పాటు నాటు కోళ్లు, పొట్టేళ్లను కూడా పెంచుతున్నారు రైతు. అంతే కాదు ప్లాస్టిక్ వ్యర్ధాలతో బయో డీజిల్ తయారు చేయటానికి ఓ షెడ్డును కూడా నిర్మించారు. ఇందుకు అవసరమైన మిషినరీని సైతం సిద్ధం చేస్తున్నారు.