కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం..మొక్కజొన్న రైతుల పాలిట శాపం!

Update: 2020-10-09 05:51 GMT

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ప్రభుత్వ జాప్యం రైతన్నలను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రైతుకష్టం దళారుల పాలవుతోంది. ప్రభుత్వం 18వందల 50 మద్దతు ధర ప్రకటించినప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో దళారులు క్వింటాల్‌ను పన్నెండు వందలకే కొనుగోలు చేస్తుండడంతో మక్క రైతులు దిగులు చెందుతున్నారు. మక్కలు కొనుగోలు చేయండి మహాప్రభో అంటూ సర్కారు వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు.

మొక్కజొన్న సాగుకు నిజామాబాద్ జిల్లా ప్రసిద్ధి. రాష్ట్రంలోనే అత్యధికంగా మొక్క జొన్నను ఇక్కడి రైతులు సాగు చేస్తారు. ప్రభుత్వ ఆదేశంతో ఈ సంవత్సరం పంటను సగానికి సగం తగ్గించారు. కేవలం 40వేల ఎకరాల విస్తీర్ణంలో మొక్క జొన్న పంట సాగు చేశారు. అధిక వర్షాలతో పంట దిగుబడి తగ్గి ఆందోళనలో ఉన్న మక్క రైతులకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాకపోవడం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం క్వింటాల్‌ మొక్కజొన్నకు 18వందల 50 మద్దతు ధర ప్రకటించింది.

రాష్ట్ర ప్రభుత్వం ఏటా మార్క్ ఫెడ్ ద్వారా మొక్క జొన్న పంటను కొనుగోలు చేస్తుంది. ఈ సంవత్సరం పంట కొనుగోలు చేసేందుకు సర్కారు సుముఖంగా లేకపోవడంతో రైతులు దిక్కు తోచని స్ధితిలో పడ్డారు. ఇదే అదునుగా భావించిన దళారులు రైతుల దగ్గరికి వెళ్లి పంటను కొనుగోలు చేస్తున్నారు. క్వింటాలుకు వెయ్యి నుంచి 12 వందలలోపు ధర పలుకుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కోనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యంతో రైతులు ప్రైవేట్ వ్యాపారి చెప్పిన ధరకు పంట అమ్ముకునే పరిస్ధితి నెలకొంది. దీంతో ఎకరానికి 20 వేలు నష్టపోతున్నామని ఆవేదన చెందుతున్నారు రైతులు.

మక్క కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళనకు సిద్దమవుతున్నారు. పసుపు, ఎర్రజొన్న రైతుల ఉద్యమం తరహాలో మొక్కజొన్న రైతులు భారీ ఉద్యమానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని లేనిపక్షంలో ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు రైతులు. ఇప్పటికైనా ప్రభుత్వం మక్కరైతుల విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.

Tags:    

Similar News