Natural Farming: తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడి పొందుతున్న రైతు

Natural Farming: రోగాలు లేని సమాజాన్ని నిర్మించేందుకు హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర గ్రామానికి చెందిన ఓ రైతు తనవంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు.

Update: 2021-12-14 09:55 GMT

Natural Farming: తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడి పొందుతున్న రైతు

Natural Farming: రోగాలు లేని సమాజాన్ని నిర్మించేందుకు హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర గ్రామానికి చెందిన ఓ రైతు తనవంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. తనకున్న మూడు ఎకరాల భూమిలో ప్రకృతి విధానంలో నాలుగు రకాల దేశీయ వరి వంగడాలను పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తక్కువ ఖర్చుతో పోషకాలతో కూడిన ఆహారాన్ని ఉత్పత్తి చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు రైతు మహమ్మద్ అఫ్జల్‌. గత 30 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న అఫ్జల్ సేద్యంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. రసాయనాల సాగులో అప్పులే తప్ప ఆర్ధికాభివృద్ధి లేకపోవడంతో పాటు వాటి ద్వారా పొంచివున్న ప్రమాదాన్ని గుర్తించి రెండేళ‌్ల క్రితం ప్రకృతి సేద్యవైపు అడుగులు వేశారు. ఔషధ గుణాలతో పాటు పోషక విలువలు కలిగిన నవార, కాలాబట్టి, రత్నచోడి, చకావో వంటి వరి వంగడాలు సాగు చేస్తున్నారు. సత్ఫలితాలు సాధిస్తున్నారు.

ఒక్కో రకం వంగడాన్ని 20 గుంటలలో ప్రకృతి పద్దతిలో సాగు చేస్తున్నారు ఈ సాగుదారు. ఆవు వ్యర్థాలతో తయారైన జీవామృతంతో పాటు నీమాస్త్రం, దశపర్ణికషాయం వంటి పోషకాలనే పంటకు అందించారు. ఇప్పటి వరకు పంటకు ఎలాంటి చీడపీడలు ఆశించలేదని దిగుబడి సంతృప్తికరంగా ఉందని రైతు చెబుతున్నారు.

దేశీయ వరి సాగులో డ్రమ్ సీడర్ విధానం తనకు కలిసివచ్చిందని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కూలీల కొరత ఉన్న నేపథ్యంలో ఈ విధానం ఆసరగా ఉంటుందన్నారు అఫ్జల్. నాట్లు వేసినదానికంటే డ్రమ్ సీడర్ విధానం ద్వారా పంట దిగుబడి కూడా 10 నుంచి 15 రోజులు ముందుగానే అందుతోందని తెలిపారు. సాగు ఖర్చు తగ్గుతోందన్నారు.

తోటి రైతులను అఫ్జల్ సాగు పద్ధతులు ఆకర్షిస్తున్నాయి. వారు కూడా ప్రకృతి విధానంలో దేశీయ వంగడాలను సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం కాస్త ప్రోత్సాహాన్ని అందిస్తే రైతులు ఈ దిశగా అడుగులు వేసి ఆర్ధికాభివృద్ధి సాధిస్తారని రైతు చెబుతున్నారు.

Full View


Tags:    

Similar News