Natural Farming: ఉచితంగా దేశీ విత్తనాల పంపిణీ
Natural Farming: వ్యవసాయంలో రైతుకు ప్రాణాధారమైనది విత్తనం.
Natural Farming: వ్యవసాయంలో రైతుకు ప్రాణాధారమైనది విత్తనం. అందులోనూ ప్రకృతి సాగులో దేశీ విత్తనమే అతి ప్రధానమైనది. అయితే కాలక్రమేనా వ్యవసాయం తీరు మారుతూ వస్తోంది. అదే క్రమంలో ప్రకృతి సేద్యంతో పాటు, దేశీ వంగడాలు కూడా కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ దేశీ విత్తనానికి పునరుజ్జీవం పోసే కార్యక్రమం తలపెట్టారు ప్రకృతి వ్యవసాయ రైతు శివప్రసాద్ రాజు. పల్లె సంపద పేరుతో దేశీ విత్తన దత్తత అనే వినూత్న ఆలోచనలను తోటి రైతులతో పంచుకంటున్నారు. మరి ఈ విత్తన దత్తత కార్యక్రమం అంటే ఏమిటి ? ఉచితంగా దేశీ విత్తనాలు పొందడానికి ఏం చేయాలి ? ఎవరిని సంప్రదించాలి?
రసాయనాల వ్యవసాయం వ్యసనంగా మారిన తరుణంలో, ప్రజలకి ఆరోగ్యకరమైన ఆహారం అందించాలన్నా రైతులు ఆర్ధికంగా బలపడాలన్నా ఒకే ఒక్క మార్గం, ప్రకృతి వ్యవసాయం. అదే ప్రకృతి వ్యవసాయంలో కీలకం దేశీ విత్తనం. కనుమరుగయ్యే దశకు చేరుకున్న ఈ దేశీ విత్తనాలను ముందు తరాలకు చేరవేయడంతో పాటు, సమాజానికి ఆరోగ్యకరమైన్న ఆహారాన్ని అందించాలన్న సంకల్పంతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రకృతి వ్యవసాయ రైతు శివప్రసాద్ రాజు. పల్లె సంపద పేరుతో దేశీ విత్తన దత్తత అనే వినూత్న ఆలోచనలను తోటి రైతులతో పంచుకంటున్నారు. దేశీ వరి విత్తనాలను ఉచితంగా రైతులకు అందిస్తున్నారు.
దేశీ వరి రకాలను సాగు చేస్తూనే, వాటి ఉపయోగాలను నలుగురు రైతులకు తెలియజేయాలని, తోటి రైతులు కూడా పండించే విధంగా ప్రేరణ కల్పించాలన్నది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. తద్వారా దేశీ విత్తన వృద్ధి మరింత పెరుగుతుందని అంటున్నారు ఈ అభ్యుదయ రైతు.