Natural Farming: ప్రకృతి సేద్యంలో రాణిస్తున్న డాక్టర్
Natural Farming: వృత్తిరీత్యా ఆయనో వైద్యుడు. రోగులకు చికిత్స అందిస్తాడు. ప్రవృత్తిరీత్యా మాత్రం ఆయనో వ్యవసాయదారుడు.
Natural Farming: వృత్తిరీత్యా ఆయనో వైద్యుడు. రోగులకు చికిత్స అందిస్తాడు. ప్రవృత్తిరీత్యా మాత్రం ఆయనో వ్యవసాయదారుడు. సేద్యంలో విచ్చలవిడిగా పెరిగిన రసాయనాలు, పురుగు మందుల వినియోగం కొత్తకొత్త అనారోగ్య సమస్యలకు కారణమని గుర్తించి ఆ సమస్యను సేద్యం ద్వారా నివారించేందుకు ఆయనే స్వయంగా రైతు అవతారమెత్తాడు. ప్రకృతి సేద్యం చేస్తూ ఆరోగ్యదాయకమైన పంటలు పండిస్తున్నాడు. రైతులు సాగులో బాగుపడాలన్నా వినియోగదారులు ఆరోగ్యకరమైన ఆహారం తినాలన్నా ప్రకృతి సేద్యమే మార్గమని నిరూపిస్తూ సేద్యంలో నిలదొక్కుకుంటున్నాడు. మరి ఈ డాక్టర్ రైతు చెబుతున్న ప్రకృతి పాఠాలను మనమూ తెలుసుకుందాం.
విజయగనరం జిల్లా పార్వతిపురంకు చెందిన డాక్టర్ శేషగిరిరావు గత నలబై సంవత్సరాలుగా వైద్య వృత్తిలో కోనసాగుతున్నారు. పార్వతీపురం పరిసర ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలను అందిస్తున్నారు. ఇటీవల కాలంలో చాలా మంది ప్రజలు దీర్ఘకాలిక వాధ్యుల బారిన పడటం, కొత్తకొత్త అనారోగ్య సమస్యలతో సతమతమవడం చూసి ఆయన కలత చెందారు. వ్యవసాయంలో మోతాదుకు మించి రసాయన మందులు వాడటమే కారణమని గ్రహించారు. ఈ సమస్యను ప్రకృతి వ్యవసాయంతోనే నివారించగలమని నమ్మారు. తానే స్వయంగా రైతు అవతారం ఎత్తారు.
శేషగిరిరావు తన సొంతూరైన గరుగుబిల్లి మండలం నందివానివలసలో ఉన్న ఆరు ఎకరాల పోలంలో పూర్తి ప్రకృతి విధానాలను అనుసరించి వ్యవసాయం చెయ్యాలని సంకల్పించారు. దీంతో అనుకున్నదే తడవుగా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి ప్రకృతి వ్యవసాయంలో మేళకువలు తెలసుకుని ముందుగా రెండు ఎకరాలలో పంటల సాగు ప్రారంభించారు. ప్రస్తుతం ఆరు ఎకరాలలో వివిధ రకాల పంటలను సాగు చేస్తూ సత్ఫలితాలను అందుకుంటున్నారు.
రసాయన ఎరువులు వాడి వ్యవసాయం చేసి పంటలు పండించినప్పుడు ఖర్చులు అధికమవడంతో పాటు వరి దిగుబడి ఎకరాకు 25 బస్తాల నుండి 30 బస్తాలకు మించేది కాదు. దీంతో వ్యవసాయం రైతుకు లాభాసాటిగా లేకపోయింది. కానీ ప్రకృతి విధానంలో ఎకరాకు 35 నుంచి 40 బస్తాల వరకు దిగుబడి అందుతోందని శేషగిరిరావు చెబుతున్నారు. ప్రస్తుతం తనకున్న పొలంలో ఢిల్లీ బాస్మతి, రత్నచోడి, సిద్దసన్నాలు మొదలైన వరి వంగడాలను సాగు చేస్తున్నారు. ప్రకృతి విధానాలను అవలంభించడం వల్ల పంట ఎంతో ఆరోగ్యంగా ఉందంటున్నారు. ప్రతి వారం నీమాస్త్రం పంటకు అందించడం వల్ల చీడపీడల సమస్యలు పెద్దగా లేవని చెబుతున్నారు.
ప్రకృతి వ్యవసాయం సాగుచేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్న డాక్టర్ శేషగిరిరావును చూసి నందివానివలసలో మరికోంతమంది రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లి మంచి లాభాలు పోందుతున్నారు. అంతేకాక డాక్టర్ శేషగిరిరావు భార్య కూడా ప్రకృతి వ్యవసాయంపై మక్కువతో తన ఇంటిపైన మిద్దేతోటను ప్రకృతి వ్యవసాయ విదానంలో పెంచడంతో పాటు పలు రకాల పళ్ళును పండిస్తూ అందిరికీ తాము ఆ పంటలను తినడమేకాక చుట్టుపక్కల వారికి ఆ పంటలను అందిస్తున్నారు డాక్టర్ శేషగిరిరావు దంపతులు.
వరితో పాటు కూరగాయలను పండిస్తున్న శేషగిరిరావు 13 ఎకరాల్లో పామాయిల్ తోటలను పెంచుతున్నారు. దీనికి పూర్తి ప్రకృతి ఎరువులను వినియోగిస్తున్నారు. జీవాల వ్యర్థాలతో తయారైన ఎరువులను అందిస్తున్నారు. నీటి సదుపాయం ఉన్న ప్రతి ఒక్కరు పామాయిల్ సాగు చేసుకోవచ్చునని చెబుతున్న ఈ సాగుదారు మొదటి మూడేళ్లు అరటిని అంతర పంటగా వేసుకోవాలని సూచిస్తున్నారు.
డాక్టర్ శేషగిరిరావు భార్య కూడా సేద్యంలో ఆయనకు తోడుగా నిలుస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం మీద ఉన్న మక్కువతో పొలంలో రకరకాల కూరగాయలను పండిస్తూనే ఇంటి మేడ మీద వివిధ రకాల ఆకుకూరలను సాగు చేస్తున్నారు. పురుగు మందులు కొట్టని ఆహారాన్ని పండిస్తూ ఆ ఆహార ఉత్పత్తులను నలుగురికి పంచుతూ సంతృప్తి పొందుతున్నారు. డాక్టర్ సహాయకులు సేద్యంలో చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. ఓవైపు వైద్య సేవలను కొనసాగిస్తూనే మరోవైపు ఆరోగ్యకరమైన ఆహారాన్ని వినియోగదారులకు అందించాలన్న ఆశయంతో ముందుకు సాగుదున్నారు. ప్రకృతి సేద్యం చేయడం ఎంతో సంతృప్తినిస్తోందని డాక్టర్ సహాయకులు చెబుతున్నారు.
డాక్టర్ శేషగిరిరావు స్ఫూర్తితో గరుగుబిల్లి మండలంలో ఒక ఉద్యమంలా ప్రకృతి వ్యవసాయం కొనసాగుతోందని అధికారులు చెబుతున్నారు. మండలంలోని సుమారు వేయి ఎకరాలలో రైతులు ప్రకృతి విధానంలో పలు రకాల పంటలను పండిస్తున్నారన్నారు. ప్రకృతి సేద్యాన్ని కష్టంతో కాకుండా ఇష్టంగా చేయాలని సూచిస్తున్నారు. ఈ విధానం రైతులకు ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. ప్రకృత్వం కూడా ప్రకృతి సాగు చేసే రైతులను ప్రోత్సహిస్తోందని మార్కెటింగ్ సదుపాయాలను కల్పించేందుకు సన్నాహాలు చేస్తోందని చెబుతున్నారు.