నేటి కాలంలో వ్యవసాయంతో నిశ్చింతగా ఉన్నారంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అయితే కేవలం పంట మీదే ఆధారపడకుండా అనుబంధ రంగాలలో ఆసరా ఉంటే మాత్రం ఈ రంగంలో తిరుగుండదని నిరూపిస్తున్నారు కొంత మంది యువరైతులు. పంట సాగుకు ప్రత్యామ్నాయంగా కోళ్ల పెంపకం వంటి అదనపు ఆదాయ వనరులపై మొగ్గు చూపుతున్నారు. ఆ కోవలోనే నాటు కోళ్ల పెంపకంలో రాణిస్తున్న రంగారెడ్డి జిల్లాకు చెందిన యువరైతుపై ప్రత్యేక కథనం.
గ్రామాల్లో కోళ్ల పెంపకం కొత్తేమీ కాదు. ఇళ్లు, వ్యవసాయ పొలాల్లో నాటు కోళ్లు పెంచడం అనాదిగా వస్తోంది. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే కొందరు రైతులు నాటు కోళ్ల పెంపకాన్ని చేపట్టి లాభాలు గడిస్తున్నారు. ఆ కోవలోనే రంగారెడ్డి జిల్లాకు చెందిన మహేశ్వరం గ్రామానికి చెందిన సాయిబాబా గత 5 ఏళ్లుగా కోళ్ల పెంపకం చేపడుతున్నాడు. తన మితృడి సలహాతో నాటు కోళ్ల పెంపకాన్ని ప్రారంభంచి ఆర్ధిక పురోగతిని సాధిస్తున్నాడు.
ప్రస్తుత కాలంలో పౌష్టికాహారానికి ప్రధాన్యత పెరిగింది ఆహారంలో మాంసం వినియోగం కూడా ఎక్కవ మొత్తంలో పెరుగుతున్న నేపథ్యంలో నాటు కోళ్ళకు ఉన్న డిమాండ్ గుర్తించిన ఈ యువ రైతు ఒక షెడ్డును నిర్మించి సుమారు 2 వేల నాటు కోడి పిల్లలతో పెంపకంతో ప్రారంభించి ముందుకు సాగుతున్నాడు.
నాటు కోళ్లను పెద్ద సంఖ్యలో పెంచాలంటే వాటికనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే వాటికందించే దాణాను బట్టే ఎదుగుదల ఉంటుంది అంటున్నాడు యువరైతు సాయిబాబా. కాలాలను బట్టి ఇచ్చే దాణాలో తగిన జాగ్రత్తలు పాటించాలని, ఈ క్రమంలో తానే స్వంతంగా దాణా తాయారు చేసుకోవడం వల్ల ఒక్కో కోడిని పెంచేందుకు సుమారు 100 రూపాయల వరకు ఖర్చు అవుతోందని అంటున్నాడు.
రైతులకు వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయంగా ఉండే ఈ కోళ్ల పెంపకంలో కోడి పిల్లల దగ్గర్నుండి కంటికి రెప్పగా కాపాడుకోవాలని, వాటికి నీరు, షెడ్ల నిర్వాహణ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ సరైన పోషణ ఇవ్వగలిగితే, మార్కెట్లో మంచి లాభాలు పొందవచ్చని అంటున్నాడు ఈ యువరైతు. మరి ఈ కోళ్ల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? షెడ్ల నిర్వహణ భారం ఏ విధంగా ఉంటుంది? ఆ వివరాలు అయన మాటల్లోనే తెలుసుకుందాం.