ఇంటిపంటల సంస్కృతి ఇప్పటిది కాదు, గ్రామాల్లో ఇంటి చుట్టూ ఖాళీస్థలాలో పండ్లు, కూరగాయలు విరివిగా సాగు చేసుకోవడం చూస్తూనే ఉంటాం. నగరీకరణలో కాలుష్యం, అదే విధంగా అధిక దిగుబడి కోసం రసాయనాలు వేసి పండించే కూరగాయలు రోజురోజుకి పెరిగిపోయిన క్రమంలో, పట్టణాలలో కూడా ఇంటిపంటలు, మిద్దెతోటలు సాగు చేసే వారి సంఖ్య పెరుగుతుంది. స్వయంగా తమ ఇళ్ళదగ్గరే పండించుకొని తినే ఆహారపదార్థాలతో సంతృప్తితో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటున్నామంటున్నారు. అదే విధంగా కూరగాయలు,పండ్లతో పాటు అరుదైన ఔషధ మొక్కలను సాగు చేస్తూ తోటి కాలనీ వాసులకు ఆదర్శంగా నిలుస్తున్న వరంగల్లు జిల్లాకి చెందిన పద్మజ,రవీందర్ రావు దంపతుల ఇంటిపంట పై ప్రత్యేక కథనం.
వరంగల్ జిల్లాకి చెందిన పద్మజ మార్కెట్లో దొరికే కూరగాయలు, పండ్లలో రసాయనాలు అధికంగా ఉండడం గమనించి తానే స్వయంగా ఇంటిపంటను సాగు చేసుకోవడం మొదలుపెట్టారు. మొదట్లో కొంత తడబడినా మిద్దెతోటల నిపుణుడు రఘోత్తమరెడ్డి తరగతులకు వెళ్లి ఇంటిపంటల సాగుపై అవగాహన పెంచుకున్న పద్మజ, ఎన్నో రకాల పళ్ళు, కూరగాయల మొక్కలతో పాటు ఔషధ మొక్కలని కూడా పెంచుతున్నారు.
బజారులో దొరికే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఏవి కొనాలన్నా వాటి ధరలు రోజురోజుకి ఆకాశాన్ని అంటుతున్నాయి. అదే మన ఇంటి చుట్టూ ఉన్న ఖాళీస్థలంలో పండించుకోవడం ద్వారా వాటికయ్యే ఖర్చులే కాకుండా రసాయనాల వల్ల కలిగే రోగాలను కూడా అరికట్టవచ్చని, స్వయంగా సాగు చేసుకుని తింటే ఆ సంతృప్తే వేరంటున్నారు పద్మజ.
తక్కువ మట్టిని వినియోగించి నూతన పద్దతిలో మిద్దెతోటలో ఎలాంటి బరువు పడకుండా సహజ ఎరువుల మిశ్రమాన్ని మొక్కల పెంపకంలో ఉపయోగిస్తున్నారు. వీరి మిద్దెతోటలో పళ్ళు,కూరగాయాలే కాకుండా ఔషధ మొక్కలతో పాటు గ్రోబ్యాగ్స్ లలో వివిధ రకాల అరుదైన ద్రాక్ష, స్టార్ ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్, కాశ్మీర్ ఆపిల్ , చెరకు, గ్రీన్ ఆపిల్, అరటి మొక్కలను పండిస్తున్నారు. అదే విధంగా మామిడి, మర్రిచెట్టు వంటి వృక్షాలను బోన్సాయ్ పద్దతిలో పెంచుతూ వాటికి ఇంట్లోనే తయారు చేసుకున్న కిచెన్ వెస్ట్ ని సహజ ఎరువులుగా వాడుతున్నారు.
చాలా వరకు గ్రామాల్లో ఇంటి చుట్టూనే అవసరానికి అనుగుణంగా కూరగాయలు, ఆకు కూరలు వేసుకుంటారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా సహజ సిద్ధంగా పెంచుకుని నాణ్యమైన పోషకాలున్న ఆహారాన్ని తీసుకుంటారు. పట్టణాలలో నగరీకరణ కారణంగా పెరుగుతున్న కాలుష్యానికి తోడు, తినే ఆహారం కూడా కలుషితం అవుతున్న క్రమంలో ఈ సమస్యలకు ఏదైనా పరిష్కారం ఉందంటే అది ఇంటిపంటలే అని అంటున్నారు రవీందర్ రావు.