పొద్దున్న లేస్తే రైతుల ఆత్మహత్యలు ఎక్కడ చూసిన కొత్త కొత్త రోగాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు. పోషకాహార లోపం ఇవన్నీ చూసి తన మనసు చలించి పోయింది సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా కలుషితం లేని ఆహారాన్ని తినలేని ఈ సాంకేతికత ఎందుకని భావించింది. పీజీ పట్టా పుచ్చుకున్నా పొలం బాట పట్టింది. ప్రయోగాత్మకంగా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయన్ని చేపట్టింది పశ్చిమగోదావరి జిల్లా తణుకు సమీపంలో ఉన్న కొమరవరం గ్రామానికి చెందిన ఉమ. తోటి యువతకు స్పూర్తినిస్తున్న యువ మహిళా రైతు ఉప పై నేలతల్లి ప్రత్యేక కథనం.
చిన్నప్పటి నుంచి కనీసం పొలం గట్టుకూడ ఎక్కని ఆ కాళ్ళు నేడు నలుగురికి మార్గాన్ని చూపిస్తున్నాయి తలుచుకుంటే కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేయడం పెద్ద విషయమేమీ కాదు కానీ సమాజానికి ఏదో చేయాలని ఆశపడింది ఉమ. ఎంబీయో పోస్ట్ గ్యాడ్యువేషన్ పూర్తి చేసిన ఉమ చదువు సంధ్యలను పక్కన పెట్టి ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలనే ధ్యేయంతో అడుగులు వేస్తోంది. తోటి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.
ఉపాధి కోసం గ్రామాల నుంచి నగరాలకు వలసలు వెలుతున్న రైతులను చూసి చలించిపోయేది ఉమ. దీనికి కారణం సాగులో పెట్టుబడులు పెరిగి అనుకున్న దిగుబడులు, ఆదాయం రాకపోవడమేనని గ్రహించింది అందుకే తాను ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ స్పూర్తితో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని మొదలుపెట్టింది. అందులో దేశీ విత్తనాన్ని ఎంపిక చేసుకొని దేశీ ఆవులను పెంచుకుంటూ జీవామృతం, ఘనజీవామృతాలను తయారు చేసుకుంటు. మొదట ఈ వ్యవసాయం చేయటం కొంత ఇబ్బంది అనిపించినా వీటి ప్రతిఫలాన్ని చూసి ఆనందిస్తున్నారు ఉమ.
ప్రకృతి సేద్యంలో దేశీ విత్తనం ఎంపిక చేసుకోవటం చాలా ముఖ్యమైంది అసలు పెట్టుబడిని తగ్గించడం ఇక్కడే మొదలవుతుంది. దేశీ విత్తనాలతో సాగు చేయడం వల్ల చీడ పీడల ఉధృతిని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఎరువుల వినియోగాన్ని నియంత్రించవచ్చు. ప్రకృతి వ్యవసాయం కాబట్టి ఒకవేళ చీడపీడలు వచ్చినా ఆ ఎరువులను కూడా మన వ్యవసాయం క్షేత్రంలో వున్న ఆవుల ద్వారా పొందవచ్చంటున్నారు ఉమ. ప్రస్తుతం తన రెండెకరాల పొలంలో రాజ్ భోగ్, నవారా, నారయణ కామీని, కులాకార్, బాలాజీ రకాలను సాగు చేస్తున్నారు ఉమ. నేటితరాన్ని సాగు వైపు మళ్లించేందుకే తాను ఈ ప్రయత్నాలను చేస్తున్నానంటున్నారు.
ప్రకృతి ఎరువుల కోసం మూడు ఒంగోలు జాతి ఆవులను తన వ్యవసాయ క్షేత్రంలోనే పెంచుతున్నారు ఉమ. వాటి దాణా కోసం తమ పొలంలోనే సూపర్ నేపియర్, జింజువా, రంగమోలు గడ్డిని పెంచుతున్నారు. దేశీ ఆవుల పోషణలో ప్రత్యేక శ్రద్ధను తీసుకోవటం వల్ల తాము ప్రకృతి సిద్ధమైన ఎరువులను తయారు చేసుకోవడంతో పాటు మంచి ఆరోగ్యకరమైన పాలు లభిస్తున్నాయంటున్నారు ఉమ. ఎన్నో పోషకాలు కలిగిన ఈ గడ్డి విత్తనాన్ని ఉచితంగా ఇవ్వటానికి సిద్ధంగా వున్నామని కావాల్సిన వారు తమను సంప్రదించవచ్చంటున్నారు.
వ్యవసాయం అంతగా తెలియని ఉమకు సాగులో చేదోడువాదోడుగా నిలుస్తున్నాడు సత్యనారాయణ. నేటి యువత సాగు వైపు ప్రయణించడం చాలా సంతోషంగా ఉందని చెబుతున్నాడు. పొలాన్ని దగ్గరుండి సంరక్షిస్తున్నాడు సత్యనారాయణ. చదువుకున్న యువత సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల కోసం వెంపర్లాడకుండా సాగు వైపు మళ్లితే మళ్లీ బీడు బారిన భూములను సస్యశ్యామలు అవుతాయంటున్నాడు సత్యనారాయణ.
ఎంబీఏ పూర్తి చేసి ఉమ ఉద్యోగం చేసుకుంటూ నగరాల్లోనో, పట్టణాల్లోనో హాయిగా ఉండవచ్చు. ఒక వేళ ఉద్యోగం వద్దనుకుంటే ఏదో ఒక వ్యాపారం చేసుకోనూవచ్చు. కానీ అవన్నీ కాదనుకుని వ్యవసాయం చేయడంలోనే సంతోషం ఉందని గ్రహించిన ఉమ తోటి యువతకు స్పూర్తిగా నిలుస్తోంది.